Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ తాజా వ్యూహం..

0 92

కాంగ్రెస్ తాజా వ్యూహం.. పవార్‌కు చెక్..
నితీశ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు..

న్యూఢిల్లీ ఏప్రిల్ 13  2024 లోక్‌సభ ఎన్నికల వేళ విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే కాకుండా, ఐక్యంగా ఉంచే బాధ్యత కూడా ఇకపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ పైనే ఉండబోతోందా? అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అదానీ అంశం ప్రజాసమస్య కాదని, అదానీ చేసిన మేలును కూడా గుర్తించాలంటూ ఎన్సీపీఅధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించడంతో ప్రతిపక్షాలు అయోమయంలో పడిపోయాయి.

అంతేకాదు ప్రధాని విద్యార్హత అంశం కూడా ప్రజా సమస్య కాదని పవార్ వ్యాఖ్యానించడంతో ప్రతిపక్షాల్లో ఐక్యత లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీంతో పరిస్థితిని చక్కబెట్టేందుకు కాంగ్రెస్ నేతలు వెనువెంటనే నితీశ్‌ను తెరపైకి తీసుకువచ్చారని సమాచారం. అందులో భాగంగానే నిన్న నితీశ్ కుమార్ బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌తో కలిసి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ప్రతిపక్షాల ఐక్యత గురించి చర్చించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సంఘటితమవ్వాలని సంకల్పం తీసుకున్నారు.

డీఎంకేఎన్సీపీతో కాంగ్రెస్‌ నేతలు చర్చించాలని.. టీఎంసీఆప్‌బీఆర్‌ఎస్‌) తదితరపార్టీల అధినేతలతో నితీశ్‌ కుమార్‌ చర్చించాలని ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్చల్లో విస్తృత ఏకాభిప్రాయం ఏర్పడితే మొత్తం విపక్ష నేతలందరితో సమావేశమై బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యూహం రూపొందించాలని నిర్ణయించారు.వాస్తవానికి ఈ సమావేశానికి ముందే ఖర్గే డీఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో చర్చించారు.

ఈ సమావేశం తర్వాత రాహుల్‌ గాంధీ, ఖర్గే, నితీశ్, తేజస్వీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ సమావేశం చరిత్రాత్మకమైనదని, విపక్షాలను ఐక్యం చేసేందుకే తాము చరిత్రాత్మక అడుగు వేశామని, ఇది దేశం కోసం విపక్షాలను భావి లక్ష్యం దిశగా నడిపిస్తుందని రాహుల్‌ చెప్పారు.

రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలందరినీ సంఘటితం చేయడమే తమ లక్ష్యమని ఖర్గే ప్రకటించారు. సాధ్యమైనన్ని పార్టీలను సంఘటితం చేసి కలిసికట్టుగా పనిచేయాలన్నదే తమ ప్రయత్నమని నితీశ్‌ కుమార్‌ అన్నారు.
సమావేశంలో నితీశ్ కీలక ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే 543 నియోజకవర్గాల్లోనూ ప్రతిపక్షాల తరపున ఒక్క అభ్యర్థే ఉండాలని నితీశ్ చెప్పినట్లు తెలిసింది. ఇదే జరిగితే బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుందని, బీజేపీ అభ్యర్థులను ఓడించడం సులభమౌతుందని నితీశ్ రాహుల్, ఖర్గేలకు వివరించినట్లు సమాచారం. దీనికి వారినుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ ఫార్ములాకు మిగతా పార్టీల స్పందన చూశాక ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఖర్గే నివాసంలో సమావేశం ముగియగానే నితీశ్, తేజస్వీ ఆప్ అధినేత, ఢిల్లీ సీఎంను కలుసుకున్నారు. ప్రతిపక్షాల ఐక్యతపై చర్చించారు. విపక్షాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు నితీశ్‌ కుమార్‌ చేస్తున్న ప్రయత్నాలను ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ శ్లాఘించారు. ఈ విషయంలో ఆయనకు ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని కేజ్రీ స్పష్టం చేశారు.

ఖర్గే నివాసంలో సమావేశానికి పవార్ రావాల్సి ఉన్నా పని ఉందంటూ డుమ్మా కొట్టారని సమాచారం. పవార్‌ను పూర్తిగా పక్కనపెట్టేస్తే విపక్షాల ఐక్యత గుండుసున్నాయే అవుతుందని కాంగ్రెస్‌కు కూడా తెలుసు. ప్రస్తుత భారత రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన నేతగా పేరున్న ఈ మరాఠా యోధుడిని పూర్తి స్థాయిలో పక్కనపెట్టేయడం అసాధ్యమే. అయితే కెప్టెన్సీ బాధ్యతలు మాత్రం ప్రస్తుతం నితీశ్‌కు అప్పగించడం ద్వారా కాంగ్రెస్ పవార్‌కు తాత్కాలికంగా చెక్ పెట్టేసిందని రాజకీయ పరిశీలకులంటున్నారు. రాబోయే రోజుల్లో పవార్ మద్దతు అవసరం లేకుండానే నితీశ్ ఏమేరకు విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురాగలరో రాబోయే కొద్ది రోజుల్లో తేలనుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking