Take a fresh look at your lifestyle.

టీడీపీ వైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చూపు

0 17

‘గోషామహల్‌’’లో రాజుకున్న రాజకీయం
టీడీపీ వైపు రాజాసింగ్ చూపు

· సైకిల్‌ ఎక్కేందుకు చర్చలు
· ఇప్పటికే ముఖ్యనేతలతో భేటీ
· మూడు సీట్లు గెలిపిస్తానని ప్రతిపాదన
· బహిష్కరణ తర్వాత పట్టించుకోని బీజేపీ
· ‘‘గోషామహల్‌’’లో రాజుకున్న రాజకీయం

హైదరాబాద్, ఏప్రిల్‌ 28 : ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగర రాజకీయాల్లో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గోషామహల్‌ నియోజవర్గంలో సైతం రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్‌ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు స్థానికంగా రాజకీయ వేడిని పెంచాయి. బీజేపీ నుంచి సస్పెండ్‌ చేసి ఆరు నెలలు దాటినా ఇప్పటికీ ఆ పార్టీ అధిష్ఠానం తనను పట్టించుకోకపోవడంతో పార్టీ మారే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన త్వరలో తనకు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడితో చర్చ

రాజాసింగ్‌ 2009లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి 2009 నుంచి 2014 వరకు కార్పొరేటర్‌గా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గోషామహల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి ముఖేష్‌గౌడ్‌పై 46,793 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌పై 17,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఓ వర్గంపై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ అధిష్ఠానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. సస్పెండై ఆరు నెలలు అవుతున్నా సస్పెన్షన్‌ ఎత్తివేతపై బీజేపీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయన తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను ఆయన రెండు రోజుల క్రితం వ్యక్తిగతంగా కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం. మరో రెండుమూడు రోజుల్లో రాజాసింగ్‌కు మార్గం సుగమం అవుతుందని, గోషామహాల్‌ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తన అనుచరులతో టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది.

మరో మూడు సీట్లు గెలిపిస్తా..

టీడీపీలో చేరిన తర్వాత గోషామహల్‌ నియోజకవర్గంతోపాటు మరో మూడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు తన పూర్తి సహకారం అందిస్తానని రాజాసింగ్‌ పార్టీ అధినేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడి రెండుమూడు రోజుల్లో పార్టీలోకి ఆహ్వానించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పినట్లు రాజాసింగ్‌ అనుచరులు చర్చించుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపీ నుంచి రాజాసింగ్‌ బరిలోకి దిగితే బీజేపీ నుంచి బేగంబజార్‌ కార్పొరేటర్‌ శంకర్‌యాదవ్‌ లేదా మాజీ మంత్రి దివంగత నేత ముఖేష్‌గౌడ్‌ తనయుడు విక్రమ్‌ గౌడ్‌కు టికెట్‌ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్‌ టీడీపీలో చేరిన అనంతరం గోషామహాల్‌ నియోజకవర్గంలోని బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు రాజాసింగ్‌ అనుచరులు ఎంతమంది ఆయనకు సహకరిస్తారనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

తాజా నిర్ణయం కలిసొచ్చేనా?

టీడీపీ నుంచి గోషామహల్‌ నియోజకవర్గంలో రాజాసింగ్‌ పోటీ చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, హిందూ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఏమేరకు రాజాసింగ్‌కు సహకరిస్తారనేది కూడా కీలకంగా మారనుంది. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌ తన అనుచరులకు ఎలాంటి సహకారం అందించలేదనే ఆరోపణలు మూట కట్టుకున్నారు. బీజేపీయేతర పార్టీలోకి వెళితే వారు ఏమేరకు కలిసొస్తారు అన్నదానిపై కూడా అనుమానాలు లేకపోలేదు. ఆయన తన సొంతగూటి(టీడీపీ)లోకి చేరితే రాష్ట్రంలో ఆ పార్టీకి కూడా మైలేజీ పెరుగుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో రాజాసింగ్‌ ప్రచారంతో బీజేపీ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, గోషామహల్‌, ముషీరాబాద్‌ తదితర నియోజకవర్గల్లో గట్టి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking