అవినాశ్ రెడ్డికి షాక్!
ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ
సుప్రీంకు సునీత
కడప, ఏప్రిల్ 20 : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ రోజు సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు సునీత పిటీషన్ ను సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు. అయితే, రేపు విచారణకు స్వీకరిస్తామని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు.
దీంతో పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, రెండు రోజుల వాదనలు తర్వాత ధర్మాసనం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 25వ తేదీ వరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
25వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. ఈ తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరు అయిన సంగతి తెలిసిందే. నిన్న సుదీర్ఘంగా ఎనిమిది గంటల పాటు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణ చేశారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. అవినాష్ రెడ్డి రాజకీయ ఎంట్రీపైన కూడా సీబీఐ అధికారులు కూపీ లాగారు. నిందితులతో జరిపిన ఆర్థిక లావాదేవీల పైన కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. రూ.40 కోట్ల డీల్ పై అవినాష్ రెడ్డి పాత్ర ఏంటనేదానిపైన కూడా సీబీఐ అధికారులు ఆరా తీశారు.
సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించారని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అయితే, కొత్త విచారణ అధికారి వికాస్ సింగ్ కు అవినాష్ రెడ్డి లేఖ రాశారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు దొరికిన లేఖపై దర్యాప్తు జరపాలని అవినాష్ రెడ్డి కోరారు. వివేకా ఫోన్ లో ఉన్న వివరాలు బయట పెట్టాలని అవినాష్ కోరారు. వివేకానంద రెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ ను ఎందుకు విచారణ చేయడం లేదని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు.మరోవైపు, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని, మరో వ్యక్తి ఉదయ్ కుమార్ ను సీబీఐ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
గురువారం ఉదయం చంచల్ గూడా జైలు నుండి నిందితులను కస్టడీ లోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరినీ ఆరు రోజుల పాటు కస్టడీకి నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నిందితులతో ఉన్న పరిచయాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. సునీల్ యాదవ్ కు కోటి రూపాయలు ఇచ్చారని దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా చేసుకొని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. వివేకానంద రెడ్డి హత్య తర్వాత సాక్ష్యాలు ఆధారాలను తారు మారు చెయ్యడంపైన కూడా ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం.