Take a fresh look at your lifestyle.

అర్వింద్ ఒంటెత్తు పోకడలతో బీజేపీకి నష్టం

0 1

అర్వింద్  ఒంటెత్తు పోకడలతో పార్టీకి నష్టం
– సీనియర్లంతా పార్టీకి దూరం
– సొంత వర్గం ఏర్పాటు
– బీజేపీ ఓట్లకు బాజిరెడ్డి గండి

నిర్దేశం, హైదరాబాద్:
అర్వింద్ అహంకారం, ఒంటెత్తు పోకడలు పార్టీకి నష్టం చేస్తున్నాయా? మోదీ గాలిలో ఈయనకు ఎదురుగాలి వీస్తోందా? ఈయనపై వ్యతిరేకత బీఆర్ఎస్ కు అనుకూలమవుతోందా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. ఐదేళ్లు ఎంపీ గా ఉన్న అర్వింద్ ఒక ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకోలేక పోయారు.

అర్వింద్ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేసి ప్రజా సేవకుడిగా పేరు తెచ్చుకున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. అర్వింద్ మాత్రం అహంకారిగా ముద్ర వేసుకున్నారు. నియోజకవర్గంలో ప్రజల మన్ననలు పొందలేక పోయారు. మీడియాలో ఎప్పుడు భావోద్వేగ మాటలు తప్ప ఒక ఎంపీ గా, బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా మాట్లాడ లేదు. ఎవరైన కలువడానికి వచ్చినా మర్యాదగా మాట్లాడరని, కోపగించుకుంటారనే పేరుంది. ఓటర్లు కూడా మాట్లడడానికి భయపడతారంటే, ఆయన వైఖరి ఎలా ఉంటుందో అర్థమవుతోంది.

మోదీ గాలిలో అర్వింద్ కు ఎదురుగాలి

రాష్ట్ర వ్యాప్తంగా గతంతో పోలిస్తే ఈసారి బీజేపీకి ఓటింగ్ శాతం బాగా పెరిగే అవకాశముంది. ఎన్ని సీట్లు వస్తాయనేది పక్కన బెడితే ఓట్ల సంఖ్య మాత్రం బాగా పెరుగుతుంది. మోదీ గాలిలో అర్వింద్ ఎదురుగాలి ఎదుర్కొంటున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించడానికి బీజేపీ అనుబంధ సంస్థ కొంతమంది యువకులను తాత్కాలిక పద్ధతిలో అపాయింట్ చేసుకుంది. రోజుకు వెయ్యి రూపాయల భత్యం ఇచ్చి గ్రామాలకు పంపింది. ఆ యువకులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆ సంస్థ ప్రతినిధులను ఆశ్యర్యానికి గురి చేసింది. తమకు బీజేపీకి ఓటు వేయాలని ఉంది కానీ అభ్యర్థి…అని సమాధానం వచ్చింది. అప్పటికి బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఖరారు కాలేదు.

బీజేపీ ఓట్లకు బాజిరెడ్డి గండి

బీజేపీ ఓట్లకు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గండికొట్టే అవకాశముంది. నియోజకవర్గంలో మున్నూరు కాపు ఓట్లు గణనీయ సంఖ్యలో ఉన్నాయి. గత ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు అర్వింద్ కు పోల్ అయినప్పటికీ ఈసారి ఆ పరిస్థితి లేదు. అర్వింద్, బాజిరెడ్డి గోవర్ధన్ ఒకే సామాజికవర్గానికి చెందిన వారైనందున మెజారిటీ ఓట్లకు బాజిరెడ్డి గండి కొట్టే అవకాశముంది. బాజిరెడ్డికి నిజామాబాద్ రూరల్, అర్బన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ప్రజలతో సంబంధాలున్నాయి. గతంలో కల్వకుంట్ల కవితను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ఓటర్లు బీజేపీకి ఓటు వేశారు. అర్వింద్ ఎలాంటి వ్యక్తి అని ఆలోచించకుండా, కవిత వద్దనే ఉద్దేశంతో ఓటు వేశారు. ఈసారి కూడా నియోజకవర్గంలో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. బీజేపి కి ఓటు వేద్దామనుకుని ఆ తర్వాత మనసు మార్చుకున్న వారు కాంగ్రెస్ కంటే ఎక్కువ బాజిరెడ్డికి వేసే అవకాశముంది.

సీనియర్లంతా దూరం

అర్వింద్ సొంత పార్టీ సీనియర్ నేతలను కూడా దూరం చేసుకున్నారు. పార్టీలో ఒంటెత్తు పోకడలకు వెళ్తూ, సీనియర్ లను తొక్కేశాడని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. సొంత వర్గం ఏర్పాటు చేసుకుని వారికే ప్రాధాన్యం, పదవులు ఇస్తున్నారు. అర్వింద్ వెంట ఉండేవారిలో పల్లె గంగారెడ్డి మినహా మిగతా వారంతా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారే. అనేక ఏళ్లు పార్టీ జెండా మోసిన వారు ఈసారి అర్వింద్ కోసం మనస్ఫూర్తిగా పని చేసే అవకాశం లేదు.

మారిన రాజకీయ పరిస్థితి

నిజామాబాద్ పార్టమెంట్ పరిధిలో నెలరోజుల క్రితం వరకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఎన్నిక ఉంటుందని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం రాజకీయ పరిస్థితి మారి పోయింది. అర్వింద్ పై వ్యతిరేకంగా ఉన్నవారు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బీఆర్ఎస్ రేసులోకి వచ్చింది. మూడు పార్టీల మధ్య రసవత్తర పోటీ నెలకొంది. నెల రోజుల వరకు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే

Leave A Reply

Your email address will not be published.

Breaking