Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ కు వరుస షాకులు

0 11

బీఆర్ఎస్ కు వరుస షాకులు
– ఒకవైపు నేతల రాజీనామాలు
– మరోవైపు అవినీతి, అక్రమాలపై సర్కారు ఫోకస్
– ఇదే సమయంలో కవిత లిక్కర్ స్కాం తలనొప్పి

నిర్దేశం, హైదరాబాద్
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. సమస్యలన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో అగ్రనాయకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒకవైపు నాయకులు పార్టీకి రాజీనామా చేస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సర్కారు దృష్టి పెట్టింది. ఇదే సమయంలో లిక్కర్ స్కాం కేసులో కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చడం తలనొప్పిగా తయారైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణంతో జరిగే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా అగ్ని పరీక్ష కానుంది. అసెంబ్లీలో బలం 39 నుంచి 38 కి పడిపోయింది. ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూల వాతావరణం ఉంటుంది. గతంలో 2014 లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కు చెందిన నారాయణ ఖేడ్, పాలేరు ఎమ్మెల్యేలు కిష్ఠారెడ్డి, ఆర్. వెంకట్ రెడ్డి మరణించగా జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ గెలుపొందింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా సర్వశక్తులూ ఒడ్డే అవకాశముంది. బీఆర్ఎస్ గెలువకుంటే రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణుల్లో ఆత్మ స్థైర్యం దెబ్బతింటుంది.

ఆగని వలసలు
బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగడం లేదు. రోజు రోజుకు పార్టీ బలహీన పడుతోంది. నమ్మిన బంటులు కూడా పార్టీకి రాజీనామా చేస్తుండడం నేతలను కలవరానికి గురి చేస్తోంది. ముఖ్య నాయకులు పార్టీ వీడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వరకు వలసలు మరింత పెరిగే అవకాశముంది. 15 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకడం లేదంటే పార్టీ ఎంత బలహీనమైందో అర్థమవుతోంది.

అవినీతి, అక్రమాలపై సర్కారు దృష్టి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సర్కారు దృష్టి పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చడానికి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేత పత్రం కూడా విడుదల చేసింది. ఇదే సమయంలో గొర్రెల స్కాం కూడా బయట పడింది. మరికొన్నింటి పై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

తలనొప్పిగా మారిన లిక్కర్ స్కాం
దిల్లీ లిక్కర్ స్కాం పెద్ద తలనొప్పిగా తయారైంది. కేసీఆర్ కూతురు కవిత ఈస్కాంలో ఇరుక్కున్నారు. ఇంతవరకు కవిత సాక్షి గా ఉండగా, ప్రస్తుతం సీబీఐ కవితను నిందితురాలిగా చేర్చింది. సోమవారం సీబీఐ ఎదుట హాజరు కావలసి ఉండగా, ఎన్నికల బిజీలో ఉన్నానంటూ హాజరుకాలేదు. ఇది ఎటు దారి తీస్తుందోననే ఆందోళన నెలకొంది. బీజేపీ సహకరించక పోవడమే గాక, దర్యాప్తు వేగం చేయించింది. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమయ్యే సమయంలో బీఆర్ఎస్ కు ఇవన్నీ సమస్యగా తయారయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking