Take a fresh look at your lifestyle.

టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ రానుంది..?

0 286

రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుందా..?

హైదరాబాద్ మార్చ్ 7 : టీఆర్ఎస్‌ పార్టీ బీఆర్ఎస్‌గా మారడంతో.. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేగనుంది. అదే పేరిట సెంటిమెంట్‌తో సరికొత్తగా పార్టీ ఆవిర్భవించనుందా..? ఇప్పటికే టీఆర్ఎస్ పేరుతో ఒకట్రెండు పేర్లతో రిజిస్ట్రేషన్‌కు ఎన్నికల కమిషన్‌ను సంప్రదించారా..? ఎలాగైనా సరే టీఆర్ఎస్ అనే పార్టీ పేరును చేజిక్కించుకునేందుకు కొందరు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారా..? అంటే తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇవన్నీ అక్షరాలా నిజమే అని అనిపిస్తోంది.

ఇంతకీ తాజాగా వస్తున్న టీఆర్ఎస్ అంటే ఏంటి..? ఏయే పేర్లతో పార్టీని స్థాపించాలని అనుకుంటున్నారు..? అసలు ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారు..? దీనిపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన టీఆర్ఎస్ పార్టీ ఈ మధ్యే బీఆర్ఎస్‌గా అవతరించింది. ఇప్పటి వరకూ తెలంగాణకే పరిమితమైన ఈ పార్టీ బీఆర్ఎస్‌గా అన్ని రాష్ట్రాల్లో విస్తరించడానికి సీఎం కేసీఆర్ చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందుకు ఎవరూ ఊహించని రీతిలో వ్యూహాలతో ముందుకెళ్తున్నారు గులాబీ బాస్. టీఆర్ఎస్ అంటే ఒక సెంటిమెంట్‌తో పుట్టిన పార్టీగా జనాల్లోకి వెళ్లింది. ఇంకా తెలంగాణ ప్రజలకు చాలా వరకు అసలు బీఆర్ఎస్ అనేది తెలియదు. సరిగ్గా ఇదే క్రమంలో దీన్ని క్యాష్ చేసుకోవడానికి ‘టీఆర్ఎస్’ అని వచ్చేలాగానే కొత్త రాజకీయ పార్టీని పెట్టాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఉన్న ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ కాకుండా.. ‘తెలంగాణ రైతు సమితి’ ‘తెలంగాణ రక్షణ సమితి’ అనే పేర్లు వచ్చేలా టీఆర్ఎస్ పేరును చేజిక్కించుకునేందుకు కొందరు కీలక వ్యక్తులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఒకట్రెండే కాదు నాలుగైదు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలియవచ్చింది. ఇప్పటికైతే ‘తెలంగాణ రైతు సమితి’, ‘తెలంగాణ రక్షణ సమితి’ అనే పేర్లతో రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. పార్టీనే కాదు.. జెండా రంగును బ్రైట్ పింక్ లేదా పూర్తి పింక్‌గా పెట్టుకోవాలని ఆ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీ పేరు ఏదైనా సరే.. ‘టీఆర్ఎస్’ అనేది మాత్రం ఉండాలని కోరుకుంటున్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ పేరు, జెండా కలర్ అచ్చుగుద్దినట్లుగా అలానే ఉండబోతోందన్న మాట. ఇప్పటికే గుర్తింపు పార్టీగా ‘తెలంగాణ రాజ్య సమితి’ ఉంది. అయితే.. ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అని దానిపై అధికార, ప్రతిపక్ష పార్టీల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొందట.

టీఆర్ఎస్ వెనుక ఎవరున్నారు..?
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ మారిన మరుక్షణమే తెలంగాణకు చెందిన కొందరు కీలక నేతలకు కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన తట్టిందట. ఖమ్మం రంగారెడ్డి కరీంనగర్ జిల్లాలకు చెందిన ముగ్గురు కీలక నేతలు దీన్ని ముందుకు నడిపిస్తున్నారట. వీరంతా గతంలో కేసీఆర్ పార్టీలో కీలకంగా పనిచేసిన వాళ్లేనని ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించి ఈ మధ్యనే వీళ్లంతా బీఆర్ఎస్‌ను వీడి.. ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయారట. వీరంతా కలిసి ఇలా టీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టి చక్రం తిప్పుతున్నారట. ఈ ముగ్గురు కీలక వ్యక్తులు అధికార పార్టీపై మాటలు తూటాలు పేల్చిన వాళ్లేనట. టీఆర్ఎస్ పార్టీలో ‘తెలంగాణ’ అనేది పోయి.. ‘భారత’ అనే పదం వచ్చిందో నాటి నుంచి రాష్ట్ర ప్రజానీకంలో చాలా కన్ఫూజన్ వచ్చింది. దీంతో ప్రజలను తమవైపునకు తిప్పుకునేందుకు, ఓటు బ్యాంకును క్యాష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయని భావించిన ఆ ముగ్గురు న్యూ టీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించారట. ఇప్పుడు తెలంగాణలో పాతుకుపోయిన గుర్తు కారు, గులాబీ మాత్రమే.. అందుకే జెండా, అజెండా రెండూ అదే ఉండేలా ఆ ముగ్గురు నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

వర్కవుట్ అయ్యేనా..?
ఈ కొత్త పార్టీపై రాజకీయ విశ్లేషకులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ‘TRS’ ను ఎన్నికల కమిషన్ ఎవరికీ కేటాయించే అవకాశం లేదని చెబుతున్నారు. ‘TRS’ అనే మూడు అక్షరాలే తెలంగాణ రాజకీయాలను మార్చేస్తాయనేది పొరపాటేనని అంటున్నారు. ఎందుకంటే ఈ మూడు అక్షరాలు వినగానే ఉద్యమం, రాష్ట్ర విభజన, కేసీఆర్, ఆయన ఎత్తుగడలు, జేఏసీ అనేవి టక్కున గుర్తొస్తాయి. ఎవరైతే ఈ పేరుతో జనాల్లోకి వెళ్లే నేతలు ఉంటారో వారికి స్థానికంగా ఉన్న పట్టును బట్టి ఆ ప్రాంతం వరకూ ఏమైనా వర్కవుట్ అవ్వొచ్చేమో కానీ రాష్ట్రమంతా అంటే అస్సలు అయ్యే పనే కాదని.. తలకిందులయ్యే పరిస్థితులు అస్సలు ఉండవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. అధికార పార్టీ పెద్దలే కొందరు ఇలా టీఆర్ఎస్ పేరుతో వ్యూహాలు రచిస్తూ.. పార్టీ పెట్టిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మరోవైపు.. దీనివెనుక బీజేపీ కాంగ్రెస్‌లోని కొందరు పెద్దల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.మొత్తానికి చూస్తే.. ఈ కొత్త పార్టీపై అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు.. తెలంగాణ ప్రజల్లోనే పెద్ద ఉత్కంఠే నెలకొంది. ముఖ్యంగా అసలు ఆ ముగ్గురు కీలక నేతలు ఎవరో అని తెలుసుకోవాలని ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రణాళిక బద్ధంగా వస్తామంటున్న ఈ పార్టీపై పూర్తి వివరాలు, జెండా, అజెండా… ఆ ముగ్గురు కీలక నేతలు ఎవరనే విషయం తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడక తప్పదు మరి.

Leave A Reply

Your email address will not be published.

Breaking