Take a fresh look at your lifestyle.

ఖాకీ ముసుగులో గులాబీకి ఊడిగం

0 28

ఖాకీ ముసుగులో గులాబీకి ఊడిగం
– క్రిమినల్ చర్యలతో నిజాలు బహిర్గతం
– ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై ప్రభుత్వం సీరియస్
– టెర్రరిస్ట్ కేసుల పేరులతో ప్రతిపక్ష నేతల ఫోన్ నెంబరులు
– అప్పట్లో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ దుమారం..
– సూత్రదారులు, పాత్రదారులు పోలీసు బాస్ లే..

(యాటకర్ల మల్లేష్)

‘శివుడి ఆజ్ఞలేనిదే చీమ కూడా కుట్టదంటారు..’ ఇదో సామెత.. రాష్ట్రంలో డీజీపీకి సమాచారం లేకుండా ఏ పని కూడా జరుగదనేది అందరికి తెలిసిన నిజం. ఇగో.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ‘ఫోన్ ట్యాపింగ్’ వ్యవహారంలో పెద్ద పెద్ద పోలీసు తలకాయలు బహిర్గతం కావాలంటే క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు లీగల్ సెల్ అధికారులు.

ఫోన్ ట్యాపింగ్.. ఇదో పెద్ద వ్యవహారమే. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను కాలరాయడమే. ముఖ్యంగా కేసీఆర్ మెప్పు కోసం పోలీసు ఉన్నతాధికారుల అనుమతితో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటిలిజెన్స్ ఓఎస్ డి ప్రభాకర్ రావుల ఆధ్వర్యంలో కింది స్థాయి పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే..?

ఇది వరకు చాలా సార్లు ఫోన్ ట్యాపింగ్ పై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే నని వ్యాఖ్యనించింది. ఒకవేళ ఎవరి ఫోన్ నైనా ట్యాపింగ్ చేయాలంటే క్రిమినల్ కేసులో ఎఫ్ ఐ ఆర్ నెంబర్ తో ఆ రాష్ట్ర డీజీపీ ద్వారా కేంద్ర హోం శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

టెర్రరిస్ట్ కేసుల పేరుతో..

కేసీఆర్ ప్రభుత్వ హయంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం దుమారం రేపింది. కరుడు గట్టిన టెర్రరిస్ట్, నక్సలైట్లపై ఉన్న క్రిమినల్ కేసులలో ఫోన్ ట్యాపింగ్ అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చారు ఇంటిలిజెన్స్ అధికారులు. ఆ కేసుల పేరుతో అవసరమగు ప్రతిపక్షాల నేతల ఫోన్ లను ఆ దరఖాస్తులో పేర్కొంటారు. అయితే.. డీజీపీ స్థాయి అధికారి సిఫారసు మేరకు కేంద్ర హోం శాఖ ఫోన్ ట్యాపింగ్ అనుమతి ఇస్తుంది.

జేడీ లక్ష్మీనారాయణ ఫోన్ ట్యాపింగ్ కేసులో..

కేంద్ర హోంశాఖకు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రతిపక్షాల నేతల క్రైమ్ డేటా రికార్డు తెప్పించుకుని ఇంటిలిజెన్స్ అధికారులు విశ్లేషణ చేస్తారు. ఆ ప్రతిపక్ష నేత ఎప్పుడెప్పుడు ఎవరితో మాట్లాడారో ప్రత్యేకంగా రహస్య నివేదికను ప్రభుత్వంలోని బాస్ కు అంద చేస్తారు. అప్పటి నుంచి ప్రతిపక్ష నేతలు ఎప్పుడెప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారో ఫోన్ ట్యాపింగ్ ద్వారా వింటూ ఆ సమాచారాన్ని పొలిటికల్ గా కేసీఆర్ కు అంద చేసారనే టాక్ వినిపించింది. అయితే.. గతంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వహించే జేడీ లక్ష్మీనారాయణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నాచారం సర్కిల్ ఇన్ స్పెక్టర్ పై క్రిమినల్ చర్యలు తీసుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో పోలీసు బాస్ లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనే టాక్ బలంగా వినిపిస్తోంది.

 

రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్..

కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన ఫోన్ లు ట్యాపింగ్ చేస్తున్నారని అప్పటి ఇంటిలిజెన్స్ ఓ ఎస్ డీ ప్రభాకర్ రావుపై మండి పడ్డారు. తమ ప్రభుత్వం రాగానే ఇంట్లో ఉన్న నిన్ను హోంగార్డులతో అరెస్టు చేయిస్తానని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.
అంతే.. ఈ వ్యవహరంపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందని భావించిన ఇంటిలిజెన్స్ డీఎస్ పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యహరంలో అతనిని ఇటీవలనే ప్రభుత్వం సస్సెండ్ కూడా చేసింది. ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, మెమోరీలు, ల్యాప్ టాప్ లను ధ్వంసం చేసినందున క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం ఉన్న పోలీసు ఉన్నతాధికారులపై విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

కేంద్ర హోం శాఖ వద్ద ఫోన్ నెంబర్ లు..

నక్సలైట్లు.. టెర్రిరిస్టుల పేరుతో ప్రతిపక్షాల నేతల ఫోన్ నెంబర్ లను కేంద్ర హోం శాఖకు దరఖాస్తు చేయడం వల్ల ఎవరెవరి ఫోన్ లను ట్యాపింగ్ చేశారో వివరాలు తెలుస్తాయి. ఇంటిలిజెన్స్ డీఎస్ పీ ప్రణీత్ రావు ముందు జాగ్రత్తగా సాక్ష్యాలు లేకుండా హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసినప్పటికీ ఆ కేంద్ర హోం శాఖ వద్ద ఉన్న వివరాలు ఆధారంగా పోలీసు బాస్ లు జైలుకు పోవాల్సిందేనంటున్నారు న్యాయవాది తులసీ దాస్ క్రాంతి.

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు..

గతంలో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో అరెస్టు కావడం వెనుక ఫోన్ ట్యాపింగ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వడానికి సంబంధించిన కేసులో రెడ్ హ్యండ్ గా పట్టుకున్న వ్యవహరంలో పోలీసు ఉన్నతాధికారుల పాత్ర కీలకంగా ఉంది. అలాగే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫాం హౌజ్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంలో కూడా ఫోన్ ట్యాపింగ్ తెరపైకి వచ్చింది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుందా లేదా అనే చర్చ ప్రారంభమైంది. తప్పు చేసినోళ్లను శిక్షించి తీరుతానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తరువాత మౌనంగా ఉండటమే కాకుండా అలాంటి వ్యక్తులకు ఉన్నత పదవులలో కూర్చొబెట్టిన సంఘటనలున్నాయి. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డిపై అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీడియా ఎదుట మండిపడిన రేవంత్ రెడ్డి అతనికి టీఎస్ పీఎస్ సీ చైర్మన్ పదవి ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధం ఉన్నోళ్లను అరెస్టు చేసి క్రిమినల్స్ గా విచారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking