Take a fresh look at your lifestyle.

విశ్వవ్యాప్త సంఘీభావము – అనువైన సేవలు డాక్టర్ రాపోలు సత్యనారాయణ

0 65

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా హెచ్ ఐ వి/ ఎయిడ్స్ మహామారి కొనసాగుతనే ఉన్నది. ఇప్పటికే 3 కోట్ల 30 లక్షల ప్రాణాలు హరించింది. 3 కోట్ల 80 లక్షల మంది హెచ్ ఐ వి పాజిటివ్ వ్యక్తులు ఉన్నరు. వారిలో 68% పెద్దలు, 53% పిల్లలు ఆజీవ చికిత్స పొందుతున్నరు. 2019 లో 17 లక్షల కొత్త కేసులు, 6 లక్షల 90 వేల మరణాలు నమోదయినయి. సంఘటిత కృషి వలన 2000 – 2019 మధ్యకాలంలో 39% కొత్త ఇన్‌ఫెక్షన్ లను, 51% మరణాలను ఆపగలిగినము.మన దేశంలో చూసినట్లయితే 2019 నాటికి 23 లక్షల 49 వేల హెచ్ ఐ వి పాసిటివ్ వ్యక్తులు ఉన్నరు. 69,220 కొత్త కేసులు నమోదు అయినయి. 58,960 మరణాలు సంభవించినయి. కొవిడ్ 19 ప్రభావమో మరొకటో ఈ ఏడు కొత్త హెచ్ ఐ వి ఇన్ఫెక్షన్ లు దేశంలో 37% తగ్గినయి. హెచ్ ఐ వి తో జీవిస్తున్న జనాభా పరంగా మహారాష్ట్ర (3.96 లక్షలు), ఆంధ్రప్రదేశ్ (3.14) ఒకటి రెండవ స్థానాలలో ఉండగా, కర్నాటక (2.69), ఉత్తరప్రదేశ్ (1.61) ల తరువాత తెలంగాణ (1.58) అయిదవ స్థానంలో ఉన్నది.రక్తం, స్తన్యం, వీర్యం, యోని స్రావాల ద్వార హ్యూమన్ ఇమ్యూనో డెఫిసియెన్సీ వైరస్ (హెచ్ ఐ వి) ఒకరినుంచి మరొకరికి వ్యాప్తి చెందుతని రుజువైంది. లైంగిక కార్యం ద్వారానే హెచ్ ఐ వి సాంక్రామ్యత ఎక్కువగా జరుగుతున్నది. హెచ్ ఐ వి వలన వ్యాధినిరోధక శక్తి క్షీణించి ఇతర జబ్బుల బారిన పడే పరిస్థితికి దారి తీస్తది. ఈ క్షీణ దశను అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోం (ఎయిడ్స్) అంటరు. హెచ్ ఐ వి పాజిటివ్ వ్యక్తులకు క్షయ, ఇతర 20 పై చిలుకు అవకాశవాద వ్యాధులు సంక్రమించే ఆస్కారం ఉన్నందున జాగ్రత్త అవసరం. కొవిడ్ 19 సమయంలో హెచ్ ఐ వి పాజిటివ్ ఒక అదనపు సవాలు. కొత్త కేసులు, తల్లి బిడ్డ సాంక్రామ్యత, మరణాల నిలువరింత పటిష్టంగా చేయగలిగితే హెచ్ ఐ వి పైన విజయం సాధించినట్లే.ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు 1988 నుంచి ఏటా డిసెంబర్ 1 ని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా పాటిస్తున్నము. దినోత్సవం సందర్భంగా ఏటా ఒక నినాదం ప్రకటించటం ఆనవాయితి. ఈ ఏటి నినాదం “గ్లోబల్ సాలిడారిటి – రెసిలియెంట్ సర్వీసెస్”. భారత ప్రభుత్వం 1992లో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించింది. దానిలో భాగంగ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైసేషన్, స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలు, జిల్లా యూనిట్ ల ఏర్పాటు జరిగింది. అవగాహన, వ్యాధి నిర్ధారణ, చికిత్స ఉచితంగా అందచేస్తున్నది. 2017లో హెచ్ ఐ వి/ ఎయిడ్స్ చట్టం కూడా చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019 నుంచి ఎఫావిరెంజ్, డోల్యుటెగ్రావిర్, డారునావిర్/ రిటొనావిర్ వంటి ప్రభావశీల ఔషధాలను అందచేస్తున్నది. ఇది హెచ్ ఐ వి చికిత్సలో ఒక విజయం. వ్యాధి అంటించు కొనుట ఎంత ప్రమాదమో, చికిత్స అస్తవ్యస్తంగా జరిగినా అంతే ప్రమాదం. కనుక చికిత్సలో ఫార్మసిస్ట్ ల పాత్ర పెంచవలసిన అవసరం ఉన్నది. అందరి సంఘటిత కృషితో 2030 వరకు హెచ్ ఐ వి ని అంతం చేయగలము. చైతన్యమే ఎయిడ్స్ నివారణకు ప్రధాన ఆయుధం.

Leave A Reply

Your email address will not be published.

Breaking