Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బినామీ ఎవరు..?

0 619

హైదరాబాద్ లో ఢిల్లీ లిక్కర్ ప్రకంపనలు

హైదరాబాద్, మార్చి 8, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు కీలక ఆరోపణలు చేశారు. ఆయన ఏకంగా కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామీ అని సీబీఐ స్పెషల్ కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల మేర ముడుపులు ఇచ్చిన సౌత్‌ గ్రూప్‌ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్‌ సంస్థలో ఎమ్మెల్సీ కవిత తరఫున అరుణ్‌ పార్టనర్‌గా ఉన్నారని ఆరోపించారు. ఈ కుంభకోణం మొత్తంలో అక్రమంగా సంపాదించిన సొత్తు దాదాపు రూ.296 కోట్లు ఉండవచ్చని ఈడీ అంచనా వేసింది. దీంట్లో కొంత సొమ్ముతో అరుణ్‌ రామచంద్ర పిళ్లై కొన్ని ఆస్తులు కొన్నారని అభియోగించింది.

పిళ్లైను అరెస్టు చేసిన ఈడీ అధికారులు అదే రోజు ఢిల్లీలోని స్పెషల్ కోర్టులో ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిపోర్టులో ఈ ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై కీలక వ్యక్తిగా పేర్కొన్నారు. సౌత్ గ్రూప్‌లో పార్టనర్స్‌గా శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్, శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కవిత సహా మరికొంత మంది ఉన్నారు. దీనికి బయట ప్రతినిధులుగా పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు వ్యవహరిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.అరుణ్‌ రామచంద్ర పిళ్లైకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ వారం రోజులపాటు ఈడీ కస్టడీకి ఇచ్చారు.

ఈ కేసులో మనీలాండరింగ్ నియంత్రణ చట్టం కింద అరుణ్‌రామచంద్ర పిళ్లైను ఈడీ ఇప్పటికే చాలాసార్లు విచారణ చేసింది. అయినా ఆయన విచారణకు సహకరించట్లేదని, నగదు లావాదేవీల వివరాలు రాబట్టడానికి కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరపు లాయర్లు కోర్టులో కోరారు. నిందితుడు సమీర్‌ మహేంద్రు, అరుణ్‌ పిళ్లై మధ్య నగదు లావాదేవీలు జరిగాయని వాదించారు. ఈ వ్యవహారంలో పిళ్లై, మరో నిందితుడు బుచ్చిబాబులను కూడా కలిపి విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. అయితే, అరుణ్‌ పిళ్లై తరఫు న్యాయవాదులు దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనను ఇప్పటివరకు 29 సార్లు ఈడీ, 10 సార్లు సీబీఐ అధికారులు విచారణ చేశారని, అయినా విచారణకు సహకరించలేదని అనడం ఏంటని ప్రశ్నించారు. చివరికి అరుణ్‌ రామచంద్ర పిళ్లైను కస్టడీకి ఇచ్చారు.

పిళ్లైను కెమెరా ఎదుట విచారించాలని ఈడీని ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేశారు.అరుణ్‌ రామచంద్ర పిళ్లైకు ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నందున కొన్ని వెసులుబాట్లు కల్పించారు. తన తల్లి అనారోగ్యంతో ఉన్నందున రోజూ తన తల్లితో ఫోన్‌లో మాట్లాడేందుకు, రోజూ భార్య, ఆయనను కలిసేందుకు అనుమతించారు. ఆయనకు వెన్ను నొప్పి ఉండడంతో బెల్టు, అనారోగ్య సమస్యలకు సంబంధించిన మందులు ఇచ్చేందుకు జడ్జి పర్మిషన్ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking