Take a fresh look at your lifestyle.

మేధోమథన సదస్సు వద్దు అంతర్మధన సదస్సులు కావాలి

0 21

మేధోమథన సదస్సు వద్దు

అంతర్మధన సదస్సులు కావాలి

  • ముదిరాజ్ ల విద్యా, ఉద్యోగ ,స్వయం ఉపాధి..?
  • నామ్ కే వస్తే ముదిరాజ్ అద్యాయన వేదిక
  • ముదిరాజ్ పేరుతో లబ్ది పొందాలనే ఆలోచనతోనే..
  • కాంగ్రెస్ పాలకులా మెప్పు కోసం మేధో మథన సదస్సు..?
  • పిట్టకథలు చెప్పుతూ లాభ పడేవారి పట్ల జాగ్రత్త..

కీర్తిశేషులు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారు 1920లో ముదిరాజ్ మహాసభను  స్థాపించి 1941లో కాచిగూడ లోని తుల్జా భవన్లో నిర్వహించిన నిజాం రాజ్య ముదిరాజ్ మహాసభ ప్రథమ సమ్మేళనంలో హైదరాబాదులో ముదిరాజ్ విద్యార్థి వసతి గృహం ఏర్పాటు చేయాలని, ముదిరాజుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని తీర్మానించారు. ముదిరాజ్ కుల సంఘాన్ని ఆదర్శంగా తీసుకొని ఏర్పడ్డ ఇతర కుల సంఘాలు తమ విద్యార్థుల కొరకు హైదరాబాదులో హాస్టల్స్ నిర్మించుకున్నారు. ఆబిడ్స్ లో రెడ్డి హాస్టల్, కాచిగూడ లో వైశ్య విద్యార్థి వసతి గృహం, మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం, హైదర్   గూడలో పద్మశాలి హాస్టల్, ఖైరతాబాద్ లో పెరిక విద్యార్థి వసతి గృహం ఈ విధంగా ఏర్పడ్డవే.

ముదిరాజ్ జాతి ఐక్యతను తుంగలో తొక్కి ఏర్పడ్డ ఇరువై కి పై చిలుకు ముదిరాజ్ సంఘాలు,ముదిరాజ్ యువజన సంఘాలు నేటికీ ప్రతిభావంతులైన పేద ముదిరాజ్ విద్యార్థుల కొరకు ముదిరాజ్ విద్యార్థి వసతి గృహం యొక్క ఆవశ్యకతను గుర్తించ లేకపోవడం,ముదిరాజుల విద్యాభివృద్ధి కొరకు కృషి చేయాలనే కనీస స్పృహను కలిగి ఉండకపోవడం కడు శోచనీయం. ముదిరాజ్ సంఘం పేరు చెప్పి పూట గడుపుకునే వారు కొందరైతే, అత్యధిక జనాభా కలిగిన ఈ జాతి పేరు చెప్పి నాయకులుగా ఎదగాలని ప్రయత్నించేవారు మరికొందరు. లక్ష్య శుద్ధి లేని ఈ సంఘాల మరియు సంఘ నాయకుల అవగాహన రాహిత్యం వలన విద్యా, ఉద్యోగ ,స్వయం ఉపాధి రంగాలలో ముదిరాజ్ జాతి వెనక బడింది.

అచేతనంగా ముదిరాజ్ అధ్యయన వేదిక..

ముదిరాజుల చిరకాల డిమాండ్ అయిన BC-D నుండి BC -A ను సాధించ లేకపోయింది. గత రెండు దశాబ్దాలుగా రాజకీయంగా వెనకబడి రాజ్యాధి కారంలో ముదిరాజ్ జాతి తన వాటాను నిలుపుకోలేక పోయింది. దినదినాభివృద్ధి చెందుతున్న ఇతర కులాలలో ఉన్న అభివృద్ధి సంస్కృతి (Development Culture)ను ముదిరాజ్ జాతి అలవర్చుకోలేకపోయింది. ఈ వైఫల్యాలకు కారణాలను అధ్యయనం చేసి జాతిని ప్రగతి పథాన నడిపించే లక్ష్యంతో ఏర్పడ్డ ముదిరాజ్ అధ్యయన

వేదిక చేష్టలుడికి అచేతనంగా కాలం వెళ్లబుచ్చింది.

ముదిరాజ్ అధ్యయన వేదిక వ్యవస్థాపక సభ్యులు గత దశాబ్ద కాలంగా తమ మేధస్సును జమ్మి చెట్టు ఎక్కించి పొద్దు గడిపి ఇప్పుడు మేధో మథన సదస్సు ఏర్పాటు చేయడం కొత్త పాలకుల వద్ద తమ ఉనికిని చాటుకోవడం కొరకు కాదని, ముదిరాజ్ జాతి ప్రయోజనాల కొరకే అని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించాలి. సందర్భోచితం కాని సన్మాన కార్యక్రమాలకు స్వస్తి పలికి పేద ముదిరాజుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రణాళిక బద్ధమైన కార్యాచరణ గురించి ఆలోచనలు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించాలి.

పిట్టకథలతో ముదిరాజ్ జాతీకి లాభం సున్నా…

ముదిరాజ్ అధ్యయన వేదిక గాని ఇతర ముదిరాజ్ సంఘాలు గాని ముదిరాజులు యయాతి చక్రవర్తి శర్మిష్ఠ ల పుత్రుడు  అయిన పురు మహారాజు వారసులు అని ఒక కథ, పాండవుల వంశస్తులు అని ఇంకొక కథ ఇలా ఒకదానికి ఒకటి పొంతన లేని స్పష్టమైన ఆధారాలు లేని పిట్టకథలు చెప్పడం వలన ముదిరాజ్ జాతికి ఇసుమంత కూడా  ప్రయోజనం ఉండదని గ్రహించాలి. తెలంగాణ ప్రాంతంతో సంబంధంలేని తెలుగు భాషతో సంబంధం లేని ఇతర ప్రాంతాల ప్రాచీన రాజవంశాలతో ముదిరాజులకు చుట్టరికం అంటగట్టే ప్రయత్నాలకు స్వస్తి పలకాలి.

మనతోపాటు మత్స్యకార వృత్తిలో కొనసాగుతున్న మన తోటి తెలుగు వారైనా గంగ పుత్రులు మరియు గూండ్ల కులం వారికి మన ముదిరాజులకు కులపరంగా ఎలాంటి సంబంధం లేదని భావిస్తున్న మనము ఇదే వృత్తి ఆధారంగా ఉత్తర భారత దేశంలోని కోలీ సమాజంతో కులపరంగా అంటకాగే ప్రయత్నం చేయడం రాజకీయ ఆరాటం కాకపోతే ఏమనుకోవాలి?.అందువలన చారిత్రక ఆధారాలు లేని జాతి మూలాల గురించి శోధించడం వలన ఉపయోగం ఉండదని తెలుసుకొని ముదిరాజ్ జాతి ప్రగతికి దోహదపడే భవిష్యత్ కార్యాచరణ గురించి మాత్రమే మేధో మథనం చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించాలి.

చీలి పోయిన సంఘాలు జాతీకి ఇచ్చే సందేశం..?

ఒకవైపు ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి అని, ముదిరాజులు రాజకీయంగా ఏకం కావాలి అని గొంతు చించుకొని నినాదాలు ఇస్తూ,ఇంకోవైపు ముదిరాజ్ జాతిని చీలికలు పేలికలుగా విడగొట్టి లెక్కకు మించి ఏర్పడ్డ ముదిరాజ్ సంఘాలు ఈ జాతికి ఇస్తున్న సందేశం ఏమిటి? ముదిరాజుల రాజకీయ ఐక్యత గురించి ఊక దంపుడు ఉపన్యాసాలతో ఊదరగొడుతున్న ముదిరాజ్ సంఘ నాయకుల్లారా…. మీ గ్రామంలోని, మీ పట్టణంలోని ముదిరాజులను రాజకీయంగా ఏకం చేయగలరేమో ప్రయత్నం చేసి చూడండి. మన సొంత గ్రామంలోని ముదిరాజులను రాజకీయంగా ఏకం చేయలేని మనము మొత్తం రాష్ట్రంలోని ముదిరాజులను రాజకీయంగా ఏకం చేయగలమా?.

పుర్రె కో బుద్ధి, జిహ్వ కో రుచి అన్నట్టు ఎవరి రాజకీయ పంథా వారిది. భిన్న రాజకీయ భావాలు కలిగిన ముదిరాజులు ప్రతిభావంతులైన పేద ముదిరాజ్ విద్యార్థులకు చేయూతనందించే కార్యాచరణ కొరకు ఏకం కావాలి. హైదరాబాదులో ఇందిరా పార్కు దగ్గర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షల కొరకు చదువుకునే విద్యార్థుల కొరకు విద్యార్థి వసతిగృహం నిర్మించడం కొరకు ఐక్యత సాధించాలి.BC-D నుండి BC-A ను సాధించడం కొరకు ఏకం కావాలి. పేద ముదిరాజులకు చేయూతనందించడం కొరకు ఏకం కావాలి. అంతే గాని రాజకీయ ఏకీకరణ అసాధ్యం అని గత రెండు దశాబ్దాల ఎన్నికల ఫలితాలు రుజువు చేసినాయి కదా.

ఉన్నత చదువులు లేని పేద ముదిరాజ్ యువతకు స్వయం ఉపాధి రంగంలో రాణించే దిశగా మార్గ నిర్దేశం చేయాలి. తాపీ మేస్త్రీలుగా, సెంట్రింగ్ మేస్త్రీలుగా, ప్లంబర్ లుగా, పెయింటర్లుగా, ఎలక్ట్రీషియన్లుగా నిర్మాణ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలను వినియోగించుకునేలాగా అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఫ్యాబ్రికేషన్ రంగంలో వెల్డర్లుగా అపారమైన స్వయం ఉపాధి అవకాశాలు ఉన్నాయి.క్యాటరింగ్(cooking)రంగంలో, చిన్నచిన్న హోటల్ల నిర్వహణలో ఉన్న స్వయం ఉపాధి అవకాశాల గురించి, పెళ్లిళ్లు మరియు ఫంక్షన్లలో డెకరేషన్ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాల గురించి తెలియజేయాలి.ప్రతి ముదిరాజ్ భవనము ఒక స్టడీ సెంటర్ కావాలి. ముదిరాజ్ యువతలో క్రమశిక్షణ ను పెంచే ధ్యాన మందిరం కావాలి.

ముదిరాజ్ సంఘాలు స్వచ్ఛంద సేవా సంస్థలుగా పని చేయాలి. సంఘ నాయకులు పేద ముదిరాజుల సంక్షేమం కొరకు స్వచ్ఛంద సేవకులుగా పనిచేయాలి. ఒకరో ఇద్దరో రాజకీయంగా ఎదిగిన నాయకుల పల్లకీలు మోసే బోయిల లాగా కాకుండా పేద ముదిరాజులను ప్రగతి ప్రథాన నడపడంలో దిక్సూచిగా నిలవాలి. గత దశాబ్ద కాలంగా ముదిరాజ్ సంఘాల మరియు ముదిరాజ్ అధ్యయన వేదిక యొక్క వైఫల్యాలను సమీక్ష చేయుట కొరకు అంతర్మధన సదస్సులు నిర్వహించాలి.

రవికాంత్ ముదిరాజ్

మోర రవికాంత్ ముదిరాజ్

9848318183

Leave A Reply

Your email address will not be published.

Breaking