Take a fresh look at your lifestyle.

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టు బిగిస్తున్న ఉచ్చు

0 189

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి 

మూసుకు పోయిన దారులు..?

కడప, మార్చి 18, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి దారులు మూసుకు పోయాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన అరెస్టు ఇక అనివార్యం అన్న భావనే సర్వత్రా వ్యక్తమౌతోంది. వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వివేకానందరెడ్డికి తెలంగాణ హై కోర్టులో చుక్కెదురైంది.  

సీబీఐ విచారణకు సంబంధించి ఆయన హైకోర్టులో దాఖలు చేసిన రెండు పిటిషన్లనూ కోర్టు కొట్టేసింది. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆ మేరకు సీబీఐను ఆదేశించలేమని స్పష్టం చేసింది. సీబీఐ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలనీ, విచారణపై స్టే ఇవ్వాలనీ అవినాష్ రెడ్డి కోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే.అయితే ఆ రెండు అంశాలలోనూ కూడా కోర్టులో అవినాష్ కు ఎలాంటి ఊరటా లభించలేదు.

విచారణ సందర్భంగా న్యాయవాది హాజరుకు అనుమతించినా, విచారణలో ఎటువంటి జోక్యం కలుగ జేసుకోకూడదని స్పష్టంగా కోర్టు ఆదేశించింది.దీంతో ఈ కేసులో అరెస్టు కాకుండా అవినాష్ రెడ్డికి ఉన్న దారులన్నీ మూసుకుపోయినట్లేనని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.   దీంతో ఇప్పటి వరకూ నాలుగు సార్లు సీబీఐ విచారణను ఎదుర్కొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఐదోసారి కూడా విచారణకు హాజరు కాకతప్పని పరిస్థితి ఏర్పడింది. గతంలో సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరైన ప్రతి సారీ ఆయన అరెస్టు తప్పదన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు కోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురైన నేపథ్యంలో ఆయన అరెస్టుకు ఇక ఎలాంటి అడ్డంకులూ లేవన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది

తరువాత ఏంటీ…??

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచనుంది. ఈ కేసులో ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని నాలుగు సార్లు విచారించింది. మరోవైపు సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ .. హైకోర్టులో పిటిషన్ చేశారు అవినాష్‌రెడ్డి. సీబీఐ విచారణపై స్టే ఇవ్వటంతో పాటు మూడు అంశాలు ప్రస్తావిస్తూ హైకోర్టులో వాదనలు వినిపించారు.

ఇందులో రెండింటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ తన విచారణను యధావిధిగా కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలన్న అవినాష్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అరెస్టు విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. విచారణ జరిపే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ తప్పనిసరని ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరుగుతున్న తీరు న్యాయవాదికి కనిపించేలా అనుమతించాలని పేర్కొంది.

హైకోర్టు తీర్పు తర్వాత సీబీఐ ఎలా వ్యవహరిస్తుందన్నది కీలకంగా మారింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు అవినాష్‌రెడ్డి అప్పీల్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే సీబీఐ విచారిస్తోందని.. ఈ కేసుతో తనకుఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి చెబుతున్నారు. తనను ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని భావిస్తోందన్నది ఆయన వాదన.

మరి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ నెక్ట్స్‌ స్టెప్ ఏంటి? అవినాష్ రెడ్డికి సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇస్తుందా? విచారణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంపై అవినాష్ రెడ్డి అప్పీల్‌కు వెళ్తారా? మొత్తానికి ఈ కేసులో అటు సీబీఐ, ఇటు అవినాష్‌రెడ్డి ఎలా వ్యవహరిస్తారన్నది ఉత్కంఠను రేపుతోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking