Take a fresh look at your lifestyle.

గెలుపు గుర్రాలకే టిక్కెట్లు.. అన్నీ పార్టీలు ఇదే సూత్రం

0 17

గెలుపు గుర్రాలకే టిక్కెట్లు.. అన్నీ పార్టీలు ఇదే సూత్రం

హైదరాబాద్, మే 30 : తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించి మళ్లీ అధికారాన్ని చేపట్టాలని భావిస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ క్రమంలో ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా ఎన్నికలకు ఎలా వెళ్లాలి అన్న దానిపై అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో ఈసారి టికెట్లు ఎవరికి ఇస్తే గెలుస్తారు అన్న దానిపైన కూడా సర్వేలు చేయించి, గెలుపు గుర్రాల కు మాత్రమే టికెట్లు ఇవ్వాలని కెసిఆర్ నిర్ణయించారు.

ఈసారి ఎన్నికలలో కొత్త, యువ అభ్యర్థులను బరిలోకి దింపి ప్రయోగాలు చేయడం సీఎం కేసీఆర్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. ప్రజాక్షేత్రంలో మంచి పేరు, అనుభవం ఉన్న నాయకులకు పెద్దపీట వేసి టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ పార్టీలో చాలామంది నేతలకు మింగుడు పడడం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు ప్రజలు ఆదరించారు.

ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి చాలామంది కీలక నాయకులు తమ వారసులకు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి వారికి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరగా, కెసిఆర్ ఈసారికి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రమే పోటీ చేయాలని తేల్చి చెప్పారని సమాచారం. ఈసారి వారసులకు టిక్కెట్లు ఇచ్చే ఆలోచన లేదని ఆయన స్పష్టంగా చెప్పడంతో తమ పిల్లలకు టికెట్ కావాలని ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖంగు తిన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు ఈ సారి తమ వారసులకు టికెట్ ఇవ్వాలని అధినేత దృష్టికి తీసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పలువురికి సీఎం కేసీఆర్ వారసులకు ఈ సారి ఎన్నికల్లో నో ఛాన్స్ అని తేల్చి చెప్పేసినట్టు సమాచారం. కెసిఆర్ నిర్ణయంతో ఈసారి ఎన్నికలలోనైనా తమ వారసులని రాజకీయాల్లోకి దింపాలని ప్రయత్నం చేస్తున్న పలువురు కీలక నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది.

ఆ 15 మంది ఎవరు…?

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి.. హ్యాట్రిక్ ను అందుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తూ ఉంది. ముఖ్యంగా అభ్యర్థుల విషయంలో చాలా ప్రణాళికలను రచిస్తూ ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. సర్వేలు, నిఘా వర్గాల సమాచారం తీసుకుని సీఎం కేసీఆర్ అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేయాలని భావిస్తూ ఉన్నారు.

‘మీ అంతట మీరు పొర పాట్లు చేస్తే తప్ప.. ఈసారి ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్యే లెవరినీ మార్చే ఉద్దేశం లేదు’ అంటూ సీఎం ఇటీవల చెప్పారని తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారాన్ని కూడా సీఎం కేసీఆర్ పరిశీలిస్తూ ఉన్నారు. పనితీరు సరిగా లేని వారిని ఆయన పిలిచి హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి పెట్టని వాళ్లపై కేసీఆర్ ఓ కంటకనిపెడుతూ ఉన్నారు. నియోజకవర్గంలో ఉండకుండా.. ఎక్కువ కాలం బయటే గడుపుతున్న వాళ్లను ఆయన పిలిచి మరీ మందలించినట్లు తెలుస్తోంది.

తీరు మార్చుకోకుంటే నిర్ణయం మరోలా ఉంటుందని సీఎం ఇప్పటికే కొందరికి పిలిపించి చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఓ15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో ప్రజలు ఏ మాత్రం ఆసక్తి కనబరచలేదని కేసీఆర్ కు సమాచారం రావడంతో వాళ్లను పక్కన పెట్టేయాలని కేసీఆర్ భావిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి సారించక పోవడంతో ఆయన్ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కొందరి విషయంలో కూడా కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. స్థానికంగా పట్టు లేకపోతే కష్టమే అని ఆ నాయకులకు కేసీఆర్ సూచించారు.

వచ్చే ఎన్నికల్లో కొందరు నాయకులు తమ కుమారులకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పలువురు బడా నాయకులు తాము మాత్రమే కాకుండా.. తమ కుమారులకు కూడా టికెట్లు ఇవ్వాలని కోరారని.. అందుకు కేసీఆర్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ ఆయా నాయకులు తప్పుకుని తమ కుమారులను గెలిపించుకోవాలని అనుకుంటే మాత్రం ఆలోచించి నిర్ణయం చెబుతామని చెప్పినట్లు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుమారుడి కోసం ప్రయత్నించగా.. కుదరదని అధినేత చెప్పినట్లు తెలిసింది. ఇలా పలువురు నాయకులు తమ వారసుల విషయంలో బీఆర్ఎస్ అధినేత వద్ద చెప్పుకొన్నారు.. కానీ ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking