Take a fresh look at your lifestyle.

తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే ప్రథమ స్థానం

0 11

ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం

: హోమ్ మంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్, జూన్ 1 : తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోచారంలో ఏర్పాటు చేసిన నూతన ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవం తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి శ్రీ మహమూద్ అలీ గారి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణా పోలీస్ శాఖ శాంతి భద్రతల నిర్వహణలో అద్భుతంగా పని చేస్తోందని, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. నగరంలోని మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన   సిసిటివి కెమెరాల ద్వారా నేరాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు.  ప్రజా శ్రేయస్సు కోసం మరిన్ని పోలీస్ స్టేషన్ల ఏర్పాటు జరుగుతుందని, పోలీసు శాఖకు అవసరమైన అన్ని రకాల తోడ్పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తామని తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని అన్ని సిసిటివి కెమెరాలు అనుసంధానం చేయడబడతాయని, తద్వారా నేర పరిశోధన వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.
తెలంగాణా రాష్ట్ర మంత్రి శ్రీ మల్లా రెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లా పరిధిలో కొత్తగా తొమ్మిది పోలీస్ స్టేషన్ల ఏర్పాటు జరిగిందని తద్వారా నేరాలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. పోచారం ఐటి కారిడార్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా పోలీసు శాఖ వారి కృషి వల్ల నేర నియంత్రణ సాధ్యం అయ్యిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజని కుమార్ ఐపిఎస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని శాంతి భద్రతల పరంగా ఉన్నత స్థానంలో ఉంచడానికి రాష్ట్ర పోలీసులు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారని తెలిపారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్తగా 70 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. గతంలో ఉన్న హైదరాబాద్ మరియు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లతో కలిపి ప్రస్తుతం తొమ్మిది కమిషనరేట్ లు తెలంగాణలో పనిచేస్తున్నాయని తెలిపారు.
రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఐపిఎస్ మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేస్తున్న  పోచారం  ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ ద్వారా ఈ ప్రాంతంలో నేర శాతం తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. పోచారం  ఐటి కారిడార్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచ స్థాయి కార్పోరేట్ కంపెనీలు, ప్రముఖ ఐటి కంపెనీలు ఇక్కడ పని చేస్తున్నాయని తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాచకొండ జాయింట్ కమిషనర్ సత్యనారాయణ ఐపిఎస్, ఎస్ఓటి డీసీపీలు గిరిధర్, మురళీధర్, అదనపు డీసీపీ అడ్మిన్  నర్మద, జిల్లా చైర్మన్ శరత్ చంద్రా రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ దయాకర్ రెడ్డి, పోచారం స్థానిక చైర్మన్ కొండల రెడ్డి, వైస్ చైర్మన్ నాయక్, కౌన్సిలర్ ధనలక్ష్మి, ఎసిపిలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking