Take a fresh look at your lifestyle.

పదవులు ఇవ్వరు సరే, ఫిరాయింపుల సంగతేంటి?

గతంలో కేసీఆర్ కూడా ఫిరాయింపుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. అప్పుడు ఒంటికాలి మీద లేచిన రేవంత్ ఇప్పుడు దగ్గరుండి మరీ కండువాలు కప్పుతున్నారు

0 44

నిర్దేశం, హైదరాబాద్ః మంత్రి పదవుల విస్తరణకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులు ఇస్తామని శుక్రవారం ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లో రేవంత్ స్పష్టం చేశారు. ఎన్నో ఆశలతో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఇతర పార్టీ నేతలకు బహుశా ఇంతకంటే చేదు వార్త ఉండదు కాబోలు. చాలా కాలంగా ఫిరాయింపు నేతలు ప్రభుత్వాల్లో మంచి పదవులు పొందుతూ వస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి నిర్ణయం దీనికి బ్రేక్ పడుతుందా? లేదంటే ఫిరాయంపులపై విపక్షాలు మండిపడుతున్న తరుణంలో ప్రస్తుత పరిస్థితిని చల్లబర్చడానికి ఈ ప్రకటన చేశారా చూడాలి.

అప్పుడలా.. ఇప్పుడిలా..

గతంలో కేసీఆర్ కూడా ఫిరాయింపుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. అప్పుడు ఒంటికాలి మీద లేచిన రేవంత్ ఇప్పుడు దగ్గరుండి మరీ కండువాలు కప్పుతున్నారు. ముఖ్యంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి వస్తున్న నేతలకు రేవంతే స్వయంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారడంపై ‘చచ్చే ముందు, ముసలి వయసులో పార్టీ మారి ఏం సాధిస్తావ్?’ అంటూ రేవంత్ చాలా ఘాటుగా స్పందించారు. వారం కింద పోచారం శ్రీనివాస్ రెడ్డికి కండువా కప్పి పార్టీలో చేర్చుకోవడంపై పెద్ద చర్చే సాగింది.

రేవంత్ నిర్ణయం ఫిరాయింపుల్ని ఆపుతుందా?
పార్టీ ఫిరాయించే నేతలకు చాలా కారణాలు ఉంటాయి. అధికార పార్టీలోకి వెళ్లే నేతలు ప్రధానంగా పదవుల కోసమే వెళ్తారు. కాగా, ఫిరాయింపులకు మంత్రి పదవుల్లో చోటుండదని రేవంత్ చెప్పడంతో.. ఇక ఫిరాయింపులు ఆగుతాయా అనే ప్రశ్న వస్తోంది. పదువులు రాని నేతలే ఎక్కువగా పార్టీలు మారుతుంటారు. పార్టీలు మారినా పదవులు రావని తెలిస్తే ఫిరాయించేందుకు వెనుకాడతారు.

ఫిరాయింపులపై పరోక్షంగా క్లారిటీ
ఫిరాయింపు నేతలకు పదవులు ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన హర్షణీయమే. కాకపోతే, మరి ఫిరాయింపుల్ని ఎందుకు సీఎం దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారనే ప్రశ్న వెలువడుతోంది. ఫిరాయింపులపై రేవంత్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మంత్రి పదవులపై ఇంత పెద్ద ప్రకటన చేసినప్పటికీ శుక్రవారం మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యను కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. అంతే, ఫిరాయింపులను ఆపేది లేదని చెప్పకనే చెప్పారని అర్థం చేసుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.

Breaking