Take a fresh look at your lifestyle.

పరువు తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌

0 13

సీఎం కేసీఆర్‌కు ప్రైవేట్ సెక్రటరీగా శరద్ మర్కడ్ బాబాసాహెబ్

హైదరాబాద్ మే 6 : రాజకీయ పార్టీలే ప్రభుత్వాలను ఏర్పాటు చేసి నడిపిస్తున్నా పార్టీ వ్యవహారాలు, గవర్నమెంట్ కార్యకలాపాలు వేర్వేరు. అధికారం చేతుల్లో ఉంది కదా అని పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని ఉపయోగించుకోవడానికి వీల్లేదు. మరి సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటివల చేపట్టిన ఓ నియామకం విషయంలో పార్టీ కోసం ప్రభుత్వాన్ని ఉపయోగించుకున్నారా? అనే సందేహాలకు, విమర్శలకు తావిచ్చింది ఓ పరిణామం. ఇలా చేయడం సబబేనా? అనే ప్రశ్నలకు కారణమవుతోంది.

‘‘ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రైవేట్ సెక్రటరీగా శరద్ మర్కడ్ బాబాసాహెబ్‌ను ప్రభుత్వం నియమించింది. రెండేళ్లకాలానికి జరిగిన ఈ నియామకం 1 మే 2023 నుంచి అమల్లోకి వచ్చింది. అతడికి నెలకు రూ.1,50,000 వేతనం చెల్లించబడుతుంది. ఈ వ్యయం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి చెల్లించబడుతుంది’’ అని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు వెలువరించింది. సంబంధిత శాఖకు, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్‌కు విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి 2 మే 2023న ఈ సర్క్యూలర్ జారీ చేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. కేసీఆర్ ప్రైవేటు సెక్రటరీగా నియామకమైన వ్యక్తి శరద మర్కడ్ బాబాసాహెబ్ విషయంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణం ఏంటా అని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలిశాయి.

అసలు విషయం ఇదీ…

సీఎం కేసీఆర్‌కు ప్రైవేట్ సెక్రటరీగా నియమితుడైన శరద్ మర్కడ్ బాబాసాహెబ్.. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌కు చెందిన వ్యక్తి. ఏప్రిల్ 10న బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. అంటే బీఆర్ఎస్‌లో చేరిన 20 రోజులకే ప్రైవేటు సెక్రటరీగా అతడి నియామకం జరిగింది. దీంతో పార్టీ చేరిలో చేరిన వ్యక్తికి సీఎంవోలో ఉద్యోగం వచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తరపున నియమించుకొని పార్టీ వ్యవహారాలకు వాడుకుంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నియామకంపై టీపీసీసీ రేవంత్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. పక్క రాష్ట్రంలో పరపతి కోసం ఇక్కడ ఉద్యోగం ఇచ్చారని, రాష్ట్రానికి చెందిన యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదుగానీ పొరుగు రాష్ట్రాలవారికి ఉద్యోగాలు ఇస్తున్నారని మండిపడ్డారు.

కాగా మహారాష్ట్రకు చెందిన శరద్ మర్కడ్ బాబాసాహెబ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకొని మరీ బీఆర్‌ఎస్‌లో చేరారని బీఆర్ఎస్ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి. రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన శరద్ మర్కడ్.. రైతుల దోపిడిని చూస్తూ పెరిగారని, కేసీఆర్ విధానాలు నచ్చి బీఆర్ఎస్‌లో చేరినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. కాగా మహారాష్ట్రలో పార్టీని క్రియాశీలకంగా మార్చాలని బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ పలు మీటింగ్‌లు ఏర్పాటు చేయడంతోపాటు పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. అన్ని విధాలా అక్కడి జనాలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పార్టీలో చేరిన మహారాష్ట్ర వ్యక్తికి సీఎంవోలో ఉద్యోగం వచ్చిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విమర్శలకు బీఆర్ఎస్ ఎలాంటి సమాధానం చెబుతుందో వేచిచూడాలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking