Take a fresh look at your lifestyle.

స్వడబ్బా, పర డబ్బా, పరస్పర డబ్బా

రేవంత్ రెడ్డి అనుకూల మీడియా ఒకటి.. రేవంత్ చక్రం తిప్పడం వల్లే రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడి అవకాశం వచ్చిందంటూ ప్రత్యేక స్టోరీ ఇచ్చింది.

0 176

– ఎలివేషన్స్ లో సినీ హీరోలను మించిపోతున్న నాయకులు
– లాజిక్ లేకుండా ప్రచారం.. జనాల్ని ఏమర్చేందుకు విశ్వ ప్రయత్నాలు
– అనుకూల మీడియా, సోషల్ మీడియాలో మారుమోగుతున్న స్వడబ్బా
– ఎన్నికల ముందు ఒకలా.. ఎన్నికల తర్వాత మరొకలా
– ఆదరించిన జనాలే ఛీపో అంటున్నారు

నిర్దేశం, హైదరాబాద్ః మన డబ్బా ఎవరూ వాయించనక్కర్లేదు. మన డబ్బా మనమే కొట్టుకోవాలి. స్వడబ్బా, పర డబ్బా, పరస్పర డబ్బా.. రాజకీయం అంతా ఈ మూడు పదాలతో నిండిపోయింది. ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి అవసరాలు ఏంటి అనేది ఏ నాయకుడికి అక్కర్లేదు. తాము అనుకున్నదే సమస్య, తాము చెప్పిందే సిద్ధాంతం, తాము నిర్దేశించేదే పరిష్కారం.. ఇలా ఎవరికి వారి సొంత ఎజెండాతో ఉన్నపళంగా జనాల మీద పడిపోతున్నారు. ఈ ప్రచారం మామూలుగా ఉండదు. తామేదో ఆకాశం నుంచి ఊడిపడ్డ దైవ దూతల్లా ఒక్కో రాజకీయ నాయకుడు వేసే ఫీట్లు చూస్తుంటే సినిమాల్లో హీరోలు కూడా వీరి ముందు ఎందుకూ పనికిరారు అనిపిస్తుంటుంది. ఒకవైపు అనుకూల మీడియా, మరొకవైపు సోషల్ మీడియా, ఇక ఎప్పటికప్పుడు ఓవర్ ఎలివేషన్స్ ఇచ్చేందుకు వందిమాగధులు.. అబ్బో.. మన నాయకులతో మామూలుగా ఉండదు మరి.

లాజిక్ లేని ప్రచారం..
దున్నపోతు ఈనిందని అంటే, దూడను కట్టేయమన్నట్లు ఉంటుంది నాయకుల ప్రచారం. గ్రౌండ్ రియాలిటీకి వీరు చేసే ప్రచారానికి అస్సలు సంబంధం ఉండదు. సమస్య ఒకటైతే వీరు చేసే ప్రచారం ఇంకోలా ఉంటుంది. చాలా కాన్ఫిండెట్ గా అబద్దాలు చెప్పడం, అసాధ్యమైన హామీలు ఇవ్వడం ఇందులో భాగం. అన్న గెలిస్తే అంతే.. ఆకాశం విరిగి నేల మీద పడుతుంది, అమృతం అరచేతిలోకొస్తుందని అంటారు. ఉదాహరణకు మోదీని తీసుకుంటే.. స్విస్ బ్యాంకులో దాచిన మొత్తం డబ్బును వెనక్కి తెచ్చి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో 15 లక్షలు వేస్తామనే దగ్గరి నుంచి నిన్నీమధ్య ఏకంగా తాను దైవదూతనని చెప్పుకునే వరకు ఇలాంటి ఆణిముత్యాలు అనేకం. ఒక్క మోదీనే కాదు సుమా.. ఈ విషయంలో ఏ నాయకుడూ తక్కువ తినలేదు.

అనుకూల మీడియా, సోషల్ మీడియా..
డబ్బా కొట్టుకోవడానికి తాళం, తబలా కావాలి. అనుకూల మీడియా, సోషల్ మీడియా ఇలాగే పని చేస్తున్నాయి. ‘అన్నతోపు దమ్ముంటే ఆపు’ లాంటి కొటేషన్స్ తో విస్తృత ప్రచారం సాగుతుంటుంది. రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి అనుకూల మీడియా ఒకటి.. రేవంత్ చక్రం తిప్పడం వల్లే రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడి అవకాశం వచ్చిందంటూ ప్రత్యేక స్టోరీ ఇచ్చింది. చంద్రబాబు విషయంలో పసుపు మీడియా ఇలాగే ప్రచారం చేస్తుంటుంది. ఈ మధ్య ప్రతి రాజకీయ పార్టీకి సొంత మీడియా సంస్థలు వచ్చాయి. అగ్నికి పెట్రోల్‌ తోడయినట్టు.. అనుకూల మీడియాకు సోషల్ మీడియా తోడైంది.

అప్పుడలా.. ఇప్పుడిలా..
ఎన్నికల ముందు ఆకాశాన్ని అరచేతిలో చూపించి హౌరా అనిపించే నాయకులు.. ఆ తర్వాత వాటి మీద మాటైనా మెదపరు. పైగా గతంలోని ప్రచారాన్ని కప్పిపుచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 50 లక్షల ఉద్యోగాలు అంటూ ప్రచారం చేసిన కేసీఆర్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో తాను అలాంటి హామీ ఎప్పుడూ ఇవ్వలేదని నిర్మొహమాటంగా దాటవేశారు. 10 ఏళ్ల పాలనలో ఉద్యోగం అనే మాటనే కేసీఆర్ ప్రభుత్వం రానీయలేదు. బంగళాలు, రోడ్లు, రంగులు చూపిస్తూ ఇలాంటి హామీలను కప్పిపుచ్చేందుకు బీఆర్ఎస్ వేసిన ఫీట్లు ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు.

అయితే ఇలాంటి సినీమాటిక్ ప్రచారం వల్ల తాత్కాలికంగా సత్వర ప్రయోజనం జరిగినా కొంత కాలానికి జనాల్లో వ్యతిరేకత ప్రారంభై అది పతనానికి తావు తీస్తుంది. నిన్నటి వరకు నిరుద్యోగుల పక్షాన హీరోగా కనిపించిన బల్మూరి వెంకట్ విషయంలో జరిగింది ఇదే. ఎంత వెర్రికి అంత కర్రుకాల్చి జనాలు వాతలు పెడుతూనే ఉంటారు. అయినా నాయకులు మాత్రం ఈ పంథా వీడడం లేదు. పైగా నానాటికీ పెరిగిపోతుండడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.

Breaking