Take a fresh look at your lifestyle.

కవితకు సానుభూతి కరువు – స్పందించని జాతీయ పార్టీల నేతలు

0 8

కవితకు సానుభూతి కరువు
– స్పందించని జాతీయ పార్టీల నేతలు
– పార్టీ నేతలూ అంతే..
– ఆందోళనకు పిలుపునిచ్చినా పాల్గొనని క్యాడర్

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్లకుంట్ల కవిత దిల్లీ మద్యం కేసులో అరెస్టు చేస్తే ఇంటా, బయటా ఒక్కరు కూడా స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. దేశ రాజధానిలో కేసు నమోదై అక్కడే విచారణ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రచారం పొందినప్పటికీ కవిత అరెస్టును విపక్షపార్టీల వారు ఖండించ లేదు. సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాత్రమే కవిత అరెస్టును ఖండించారు.

ఎన్ డీఏ కు వ్యతిరేకంగా పాతిక పైన చిన్నాచితక పార్టీలతో ఇండియా కూటమి ఏర్పాటైంది. బీజేపీ కక్షపూరితంగా అక్రమంగా కేసులో ఇరికించిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. విపక్షపార్టీల నేతలెవరూ బీఆర్ఎస్ నేతలో గొంతు కలప లేదు. కనీసం ఫోన్ చేసి కూడా సానుభూతి తెలపలేదు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామితో కలిసి పనిచేస్తామని గతంలో ప్రకటించారు. కుమారస్వామి కూడా కవిత అరెస్టుపై స్పందించలేదు. జాతీయ స్థాయి నాయకులెవరూ స్పందించకపోవడంపై వివిధ రకాలుగా చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ వివిధ పార్టీలను పట్టించుకోలేదని, ఒంటెత్తు పోకడలకు పోయారని, అంతేగాక కవితకు మద్యం కుంభకోణంలో పాత్రపై అనుమానాలుండడంవల్లే జాతీయ నాయకులు స్పందించడం లేదని అభిప్రాయపడుతున్నారు.

సొంత పార్టీలోనూ…

కవితకు సొంత పార్టీలో సైతం సానుభూతి కరువైంది. అరెస్టుకు నిరసనగా ధర్నాలు చేయుమని అధిష్ఠానం పిలుపునిస్తే అనేక చోట్ల క్యాడర్ ముందుకు రాలేదు. చేసిన చోట మొక్కుబడిగా కొద్దిసేపు చేసి మనకెందుకులే అన్నట్లు వెళ్లిపోయారు. కవిత ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లాలోనూ స్పందన కనిపించలేదు.

ప్రజల్లో ఆసక్తి..

దిల్లీ మద్యం కేసులో కవితను అరెస్టు చేస్తారా అని ప్రజలు చాలా రోజుల నుంచి ఆసక్తి కనబరిచారు. ఇంట్లో సోదాలు జరుగుతుంటే ఎప్పటికప్పుడు సమాచారం కోసం టీవీల ముందు కూర్చున్నారు. అరెస్టు చేసి తీసుకెళ్తుంటే మహిళలు సైతం అయ్యో అనలేక పోయారు.

ఎన్నికల వేళ పార్టీకి దెబ్బ

దిల్లీ మద్యం కేసు ఎన్నికల్లో పార్టీకి నష్టం చేస్తుందని ఆపార్టీ నేతలు అంటున్నారు. ఈకేసు వల్ల వలసలు మరింత ఎక్కువయ్యాయని అభిప్రాయపడుతున్నారు. కవిత అరెస్టు వల్ల సానుభూతితో ఓట్లు వచ్చే పరిస్థితి లేదని, నానాటికి మరింత బలహీనమవుతోందని వాపోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking