Take a fresh look at your lifestyle.

అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో పీహెచ్ డీ

0 46

అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో పీహెచ్ డీ (Ph.D)

బ్రోచర్ విడుదల చేసిన మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి

సికింద్రాబాద్ : హైదరాబాద్ శివారు ములుగులో నెలకొల్పిన అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో పీహెచ్ డీ(Ph.D) కార్యక్రమం మొదలైంది. దీనికి సంబంధించిన బ్రోచర్ ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో తన ఛాంబర్ లో విడుదల చేశారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత 2016లో స్వయంగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు చొరవతో ఏర్పాటైన ఫారెస్ట్ కాలేజీ దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతోంది. ఉన్నతమైన ప్రమాణాలు, అన్ని వసతులతో కూడిన క్యాంపస్ ఫారెస్ట్ కాలేజీకి అదనపు ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. వీటి సహాయంతో ఇక్కడ చదువుతున్న విద్యార్థులు అటవీ నిపుణులుగా తయారవుతున్నారు. బీఎస్సీ ఫారెస్ట్ కోర్సుతో ప్రారంభమై, ఎమ్మెస్సీ కోర్సును కూడా మొదలు పెట్టిన తర్వాత, తాజాగా పీహెచ్ డీ కూడా ప్రారంభమౌతోంది.

అటవీ విద్యలో దేశంలోనే పేరెన్నిక గల సంస్థగా ముఖ్యమంత్రి మానస పుత్రికైన ఫారెస్ట్ కాలేజీ ఎదగటం చాలా సంతోషాన్ని ఇస్తోందని, త్వరలోనే పూర్తి స్థాయి యూనివర్సిటీ హోదా పొందబోతోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు అటవీ విద్యలో సాంకేతిక నిపుణులుగా ఎదగటంతో పాటు, దేశ స్థాయిలో పోటీ పరీక్షల్లో కూడా రాణించటం గొప్ప విషయమని ఫారెస్ట్ కాలేజీ డీన్ ప్రియాంక వర్గీస్ అన్నారు.

సిల్వికల్చర్ & అగ్రోఫారెస్ట్రీ, ఫారెస్ట్ బయోలజీ & ట్రీ ఇంప్రూమెంట్, ఫారెస్ట్ రిసోర్స్ మేనేజ్ మెంట్, ఫారెస్ట్ ప్రోడక్ట్స్ & యుటిలైజేషన్ ఇలా నాలుగు విభాగాల్లో ప్రత్యేక అధ్యయనానికి వీలుగా పీహెచ్ డీ కార్యక్రమం మొదలుకానుంది. నెలకొల్సిన దగ్గర నుంచి యూనివర్సిటీ హోదా పొందేదాకా నిరంతరం ఫారెస్ట్ కాలేజీ ఎదుగుదలకు వెన్నంటి ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రికి అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కాలేజీ డీన్ ప్రియాంక వర్గీస్ కృతజ్జతలు తెలిపారు.

బ్రోచర్ విడుదల కార్యక్రమంలో పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్, పీసీసీఎఫ్ (ఎఫ్ ఏసీ) ఎం.సీ.పర్గెయిన్, ఫారెస్ట్ కాలేజీ జాయింట్ డైరెక్టర్ పీ. శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ ఏ. వెంకటేశ్వర్లు, ఫ్యాకల్టీ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రీజా, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking