Take a fresh look at your lifestyle.

కుట్రలో భాగమే పుట్టుకొస్తున్న జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలు

0 25

కుట్రలో భాగమే పుట్టుకొస్తున్న జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలు
– సుప్రీంకోర్టు తీర్పుకే విలువలేదు…
– కొత్త జర్నలిస్టులను మభ్యపెడుతున్న తెలంగాణ సర్కార్   
– హైదరాబాద్ జర్నలిస్టులకు మొండి చెయ్యి

తెలంగాణ రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలు పుట్టుకొస్తున్నాయి. ఆయా సొసైటీలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తాయని నమ్మకం జర్నలిస్టులకు ఉందా..? నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందా..? ఉంటే సీనియర్ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలను ఎందుకు విస్మరిస్తున్నాయి. పాత సోసైటీలు ప్రభుత్వానికి డబ్బులు కట్టి కొనుగోలు చేసిన భూములను వారికి ఎందుకు అప్పగించడం లేదు..? సుప్రీం కోర్టు తీర్పును కూడా ఎందుకు అమలు చేయడం లేదు.
నిర్దేశం, హైదరాబాద్ :

‘‘ద తెలంగాణ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ’’ పేరిట ప్రభుత్వ లోగోతో ముందుకు వచ్చింది. అంటే ప్రభుత్వ పెద్దలు వెనుక ఉండి ఈ సొసైటీని పెట్టుమన్నట్లుగా ఉంది. అయితే మిగతా సొసైటీలకు ప్రభుత్వం ఎగనామం పెడుతుందా…? ఇదేం సంస్కృతి…? జర్నలిస్టులను ఇలా వర్గాలుగా విభజిస్తారా…? వాని అనైక్యతను పాలకులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారా.? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ సొసైటీలో చేరితే ఖచ్చితంగా ఇళ్ళ స్థలాలు వస్తాయని చెప్పుకుంటున్నారు.  జర్నలిస్టులను చీల్చి చెండాడుతున్నారా..? దీనికి ఎవరు ఆజ్యం పోస్తున్నారు. పాత సొసైటీలకు దిక్కులేదు. కొత్త వారికి ఇస్తటర..  కొంత మంది జర్నలిస్టులను భయపెట్టి దారికి తెచ్చుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం

సొసైటీల మధ్య ప్రభుత్వం చిచ్చు..

ఇప్పటికే  జర్నలిస్టు హౌసింగ్ సొసైటీల మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో భాగంగానే కొత్త సొసైటీల ఏర్పాటు అంశాలు ఉదాహరణగా చెపుతున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఇప్పటికే ‘‘ది గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ’’ , ‘‘దక్కన్ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ’’ ఉన్నాయి. వీటిలో దాదాపు1700 మందికి పైగా జర్నలిస్టులు సభ్యత్వాలు కలిగి ఉన్నారు. ఏ సొసైటీలో సభ్యులు కాని జర్నలిస్టులు దాదాపు 1200 మంది వరకు ఉన్నారు. తాజాగా వెలిసిన ప్రభుత్వ అనుకూల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ మాత్రం అంతా తమదే సాగుతుందని గొప్పలకు పొతోంది.

అడ్డా కూలీల కంటే అధ్వాన్నం :

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులంటే పాలకులకు లెక్కే లేనట్లుగా ఉంది. 30 ఏళ్ళ నుంచి హైదరాబాద్ లో కలాన్ని నమ్ముకుని చాలీచాలని జీతంతో కాలం వెల్లబుచ్చుతున్నవారి కుటుంబాలు పడుతున్న రోదన వర్ణనాతీతం. చెప్పుకుంటే పరువు పొతది.. చెప్పకుంటే ప్రాణం పోతది అన్నట్లుగా తయారైంది.. తిన్నా, తినకున్నా కడుపు చేతపట్టుకుని అందరి ముందు గాంభీర్యం ప్రదర్శించే జర్నలిస్టులు తమ కుటుంబాలను పోషించుకునే స్థితిలో లేకపోవడం బాధాకరం. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు హైదరాబాద్ నగరంలో పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు లేక అలమటిస్తూ కాలం గడుపుతున్నారు. అడ్డమీది కూలీలు సైతం తమకు నచ్చిన తనఖా ఇస్తే ఆ పూటకు పనికి వస్తారు. లేకుంటే లేదు. వారికున్న కనీస డిమాండ్ కష్టించి పని చేసే జర్నలిస్టులకు లేకుండా పోయింది.

జర్నలిస్టులకు కెటాయించిన భూములపై..

హైదరాబాద్ సీనియర్ జర్నలిస్టులకు (జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ) 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 70 ఎకరాల ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఇందులో నిజాంపేట బండలు, గుట్టలు ఉన్న 32 ఎకరాల స్థలంతో పాటు పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాల భూములను కేటాయించింది. ఇందుకు గానూ ఒక్కో జర్నలిస్టు రూ. 2 లక్షల చొప్పున వేసుకుని రూ. 12.30 కోట్లను ప్రభుత్వానికి ఆనాడే 1100 మంది జర్నలిస్టులు కట్టారు. కొన్ని కారణాల వల్ల అది కాస్త సుప్రీం కోర్టుకు చేరింది.

అక్కడ 16 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2022 ఆగస్టులో జర్నలిస్టులకు సంబంధించి తుది తీర్పు వచ్చింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని జర్నలిస్టులకు ప్రభుత్వం అప్పగించలేదు. ఎందుకు…? ఆ భూమిపై ప్రభుత్వం కన్నేసిందా..? రూ. వేల కోట్ల విలువైన భూములను బిచ్చగాళ్లైన జర్నలిస్టులకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారా..? అనే విషయాలు అంతుపట్టనివిగా ఉన్నాయి. ప్రభుత్వం జర్నలిస్టులను విడగొట్టడానికి హౌజింగ్ సోసైటీలు పెట్టిస్తుందన్నారు ది గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య. అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన కోరారు.
– ఏఆర్ మీడియా సౌజన్యంతో..

Leave A Reply

Your email address will not be published.

Breaking