Take a fresh look at your lifestyle.

ప్రమాదంలో నేవీ కమాండో గోవింద్ మృతి

0 118

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో విషాదం

పారాచూట్ ట్రైనింగ్‌లో కిందపడి కమాండో గోవింద్ మృతి

విజయనగరం, ఏప్రిల్ 6 : చీపురుపల్లి మండలం పర్ల గ్రామంలో విషాదం నెలకొంది. నేవీ ఉద్యోగి మరణంతో ఆ మండలం ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంటోంది. దేశ రక్షణలో భాగమవుతాడనుకు బిడ్డ ఇలా తిరిగి వస్తారనుకోలేదంటున్నారు బంధువులు.

పారాచూట్ ట్రైనింగ్లో జరిగిన ప్రమాదంంలో చీపురుపల్లి నేవీ ఉద్యోగి చందక గోవింద్ దుర్మరణం చెందారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామానికి చెందిన నేవీ ఉద్యోగి చందక గోవింద్ విశాఖ నేవల్ బేస్లో ఉద్యోగం చేస్తున్నారు. పారాచూట్ విభాగంలో పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ట్రైనింగ్లో భాగంగా చేసిన కార్యక్రమంలో ప్రమాదం జరిగింది.

ట్రైనింగ్లో భాగంగా గోవింద్ కోల్ కత్తాలో హెలికాఫ్టర్ నుంచి దూకి కొంత దూరం వెళ్లిన తర్వాత పారాచూట్ను ఓపెన్ చేయాలి. అయితే దూకేంతవరకు అంతా బాగానే ఉన్నప్పటికీ మార్గ మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ.. పారాచూట్ తెరుచుకోలేదు. అంతే అతి వేగంగా కిందిపడిపోయారు గోవింద్.

ప్రమాదానికి సంబంధించిన వీడియోను కూడా నేవీ విడుదల చేసింది. హెలికాఫ్టర్లో సహచరులతో హుషారుగా కనిపించారు గోవింద్. ట్రైనింగ్లో భాగంగా ముందు ఒక్కొక్కరు హెలికాఫ్టర్ నుంచి బయటకు దూకారు. రెండో దశలో వారి ఇద్దరిద్దరు కలిసి దూకి కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత విడిపోవాలి. ఆ క్రమంలో పారాచూట్ ఓపెన్ చేయాలి.

రెండోదశ ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలోనే ప్రమాదం జరిగింది. తన సహచరుడు చేతులు పట్టుకున్న వీడియోను నేవీ విడుదల చేసింది. అలా కాసేపు ఇద్దరూ చేతులు పట్టుకొని కొంత టైం తర్వాత గోవింద్ చేతులను సహచరుడు వదిలేశారు. అలా వదలేసిన తర్వాత గోవింద్ పారా చూట్ సాయంతో సేప్ల్యాండ్ అవుతారని అంతా అనుకున్నారు.

మార్గ మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ.. గోవింద్ క్రాష్ ల్యాండింగ్ అయ్యారు. పారాచూట్ తెరుచుకోకపోవడంతో వేగంగా నేలపై పడి గాయలపాలయ్యారు. తీవ్ర గాయాలపాలైన ఆయన్ని బార్జోరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.

బుర్ద్వాన్ జిల్లాలోని పనాగడ్ ఎయిర్పోర్స్ స్టేషన్లో పారా ట్రూపర్స్ ట్రైనింగ్ టీంలో గోవింద్ విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పారా ట్రూపర్స్ బృందంలో సభ్యుడైన గోవింద్… హెలికాఫ్టర్ నుంచి సాధారణ డ్రాప్ సమయంలో అదృశ్యమైనట్టు ఇండియన్ నేవీ తెలిపింది. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు పేర్కొంది.

గోవింద్ మృతితో పర్ల గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా బోరున విలపిస్తున్నారు. స్నేహితులు, బంధువులు వారిన ఓదారుస్తున్నారు. రేపు (శుక్రవారం) సాయంత్రానికి కమాండో గోవింద్ మృతదేహం స్వస్థలానికి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking