Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ?

0 23

కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ?
– ఇప్పటకే కొందరితో సంప్రదింపులు పూర్తి
– పార్లమెంట్ ఎన్నికల తర్వాత కార్యాచరణ

బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోడానికి ముఖ్యమంత్రి పావులు కదుపుతున్నారా ? పార్లమెంట్ ఎన్నికల తర్వాత విలీనం తప్పదా ?, అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మణుగూరు లో జరిగిన సభలో మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, నలుగురే మిగులుతారని అనడం, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు సభకు హాజరుకావడం బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం చేసుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనడానికి బలం చేకూరుతోంది.

ఇతర పార్టీ ఎమ్మెల్యేలను వీలైనంత త్వరగా పార్టీలో చేర్చుకోడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేసీఆర్ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండబోదని వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ నే ఖాళీ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ ప్రభుత్వం ఉండదని వ్యాఖ్యానించారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధాని అయితే ముప్పు తప్పదని గ్రహించి రేవంత్ అప్రమత్తమవుతున్నారని తెలుస్తోంది. వీలైతే బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా గాలం వేయాలని భావిస్తున్నారు. ఇదివరకే సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రేవంత్ రెడ్డిని కలిశారు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముహూర్తం

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే అవకాశముంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అత్యధిక స్థానాలు వస్తాయని, రెండోస్థానంలో బీజేపీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ కు తక్కువ సీట్లు వస్తే పార్టీలో అనేక మంది ఎమ్మెల్యేలు ఉండే పరిస్థితి లేదు. ఇప్పటికే దుబ్బాక, నర్సాపూర్, జహీరాబాద్, పటాన్ చెరు, రాజేంద్ర నగర్, చేవెళ్ల, ఎల్బీనగర్ ఎమ్మల్యేలు సీఎం ను కలిశారు. మరికొందరు కలువడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అత్యధిక మంది అధికారం కోసం పార్టీలోకి వచ్చిన వారే. జంట నగరల్లో పద్మారావు మినహా మిగతా వారంతా ఇతర పార్టీ ల నుంచి వచ్చినవారే. వీరు మళ్లీ అధికారం వైపు వెళ్లే అవకాశం లేక పోలేదు. బీఆర్ఎస్ కు 38 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ లో విలీనం కావాలంటే 26 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఈసంఖ్య ఉంటే ఫిరాయింపుల చట్టం వర్తించదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టే అవకాశముంది.

పార్లమెంట్ ఎన్నికల్లో సైలెంట్

పార్లమెంట్ ఎన్నికల్లో చాలా మంది ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉండే అవకాశముంది. ప్రచారంలో నామ్ కే వాస్తే పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. లోపాయికారిగా కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని అంతర్గతంగా ఒప్పందం జరిగినట్లు తెలిసింది. మాజీ మంత్రి మల్లారెడ్డి పూర్తిగా సైలెంట్ అయి పోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీ చేయాల్సి ఉండగా ప్రభుత్వం కబ్జాలను తెరమీదకు తేవడంతో పోటీ నుంచి విరమించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking