Take a fresh look at your lifestyle.

బాధవడకురా… కాలమే జవాబిత్తది

0 325

జర్నలిస్ట్ సతీష్ జ్ఞాపకాలు..

డిగ్రీ ఫస్టియర్ హాల్‌టిక్కట్ కోసం ఎంత కత జర్గిందో “బాధవడకురా… కాలమే జవాబిత్తది” అనే ఆర్టికళ్ల సదివిర్రు గదా? ఇంతకు ఆ పరీచ్చలళ్ల నేను పాసయిన్నో, ఫేలయిన్నోనని మస్తు మందడిగిర్రు. 2004ల మొదలైన నా డిగ్రీ 2007లనే అయిపోయింది. గనీ…


*
సిమాంట సిమాంట అనిల్‌గాడు నా హాల్‌టిక్కట్ వాణినికేతన్ మేడంకు సూపిచ్చి నన్ను పరీచ్చకు పంపిండు. మళ్లా హాల్‌టిక్కట్ ఆనితోనే తీస్కవోయిండు. ఆ రోజు రాసిన ఇంగ్లీష్ పరీచ్చ కాడికి వద్దాం. ఆ రోజు హాళ్లకు వొయి ప్రశ్న, జవాబుల పేపర్ల తీస్కునేసరికి గంటన్నర లేటయింది. ఇంకో గంటలెక్కడ రాత్త పరీచ్చ. అందుకని శేఖర్, అనిల్ గాండ్ల మీదికి పన్లు కొర్కుడే ఆ రోజు పరీచ్చ హాళ్ల నేన్జేసిన పని. నా పేరు రాసి, నెంబరేసి ఉత్త పేపరే సారుకిచ్చిన. ఆ సార్ నోర్దెర్సిండు. “నువ్వచ్చుడే లేటచ్చినవ్ రా అంటే ఉత్త పేపర్ చేతిలవెట్టి పెద్ద ఫోజులు గొడ్తున్నవ్… పో ఇంకద్దగంటుంది ఏమన్న రాయిపో..” అని గద్దరాయించి పేపర్ మళ్లా నా చెయ్యిలనే వెట్టిండు. నేను సిన్నోన్నా..? అద్దగంటాగినంక వొయి మళ్లా ఉత్త పేపరే సారుకిచ్చి ఇంటికచ్చిన.

పట్టా ముక్కెం గని, మార్కులు ముక్కెమా? అందుకే ఏటా ఏడు పరీచ్చలుంటే మూడు ముందుగాల పాస్ గావాలె, తర్వాత నాల్గు పాస్ గావాలె” అని ఆ రోజే డిసైడైన. మూడేండ్లు నేననుకున్నట్టే జేసిన. మూడు ముందుగాళ్ల పాసవుడు, తర్వాత నాల్గు సంప్లమెంటరీ పరీచ్చళ్లల్ల పాసవుడు. అట్లా 2007 కల్లా ఇయర్ వేస్టు గాకుండా డిగ్రీ పట్టా సంపాయించిన. కొన్ని కొన్ని పేపర్లయితే కరెస్టు 35 మార్కుల మందమే రాసచ్చేటోన్ని. దిద్దినోళ్లు గూడా నేన్ వెట్టిన పరీచ్చల పాసయ్యేటోళ్లు. అట్లా నా డిగ్రీ మార్కుల మెమోరాండంల ఇప్పుడు జూసినా నాలుగైదు సబ్జెక్టులు 35 మార్కులే ఉంటయి. ఇది నా ఓవర్ కాన్ఫిడెన్సని మీరనుకోవచ్చు. కనీ వందకు వంద మార్కులొచ్చినా ఉపయోగపడేదేముండదని నేననుకుంటా.. అయినా సదువాల్సింది సమాజాన్ని గదా..?

అట్లా… 2007 మే కల్లా డిగ్రీ అయిపోయింది. అప్పటికే ఐసెట్ రాత్తే ర్యాంకు గూడొచ్చింది. కనీ ఏడాదికి 3 వేలు గట్టడానికే ముప్పుతిప్పల వడ్డోళ్లం, ఏటా ముప్పై వేల కౌన్సిలింగ్ ఫీజంటే మాతోనేడైతది… దేనికైనా డిగ్రీ అర్హత కావట్టి, అది బల్మీట్టికి జేసిన.
*
ఆరు వందలకు శ్రీగ్రాఫిక్స్‌ల ప్రింటింగ్ పన్జేసినా అని మొన్న జెప్పిన గదా? అప్పట్నుంచే మనకు రాసుడంటే మస్తిట్టం. అన్లనే కంప్లీటర్ (మా అజ్జిరం కంప్యూటర్‌ను కంప్లీటరే అంటది) పన్గూడ నేర్సుకున్న. శ్రీ గ్రాఫిక్స్‌ల నాతోని సర్వర్ అని ఓ తుర్కయిన గూడ పన్జేసేది. ఆయన ముస్లిం అయినప్పటికీ అప్పటికే తెల్గు మస్తు ఫాస్టు, మంచిగ టైప్ జేసేది. నేనో రోజు ఆయ్ననడిగిన… “అన్నా.. తెలుగు టైప్ గొట్టుడు నేర్పియ్యే” అని… “నువ్వు ఫస్టు ఇంగ్లీషు టైప్ జేసుడు నేర్సుకో, తెలుగు తర్వాత నేర్సుకుంటువు” అని ఎట”కారం”గా మాట్లాడిండు. ఆ ఎటకారం ఎనుక భయం గూడ ఉన్నది. ఎవ్వల పొట్టతిప్పల వాళ్లది. నేను తెలుగు టైపింగ్ నేర్సుకుంటే ఆయ్న నౌకరేడవోతదోననే భయం సర్వర్ భాయ్ ది.

కనీ మనం అనుకున్నది జేసుట్ల ఎన్కకువోం గదా..? ఆహా నాకే తెలుగు టైప్ జేసుడు కట్టం అంటడా..? ఛల్ ఇయ్యాళ్ల నాత్రికి నాత్రి నేర్సుకోవాల్నని కసితోని మొదలువెట్టిన తెల్గు టైప్ జేసుడు. కనీ నాకు వారం బట్టింది కంప్లీటర్ మీద తెలుగు గొట్టుడు నేర్సుకోవడానికి. అదీ సర్వర్ భాయ్ కన్నా ఫాస్టుగా.. నేను తెలుగ్గొడితే సర్వర్ భాయ్ సర్వర్ డౌనయ్యేంతా.. తెలుగు టైప్ జేసుడే గాదు, 2008ల ఓ పెద్దమన్షి జరిగిపోతే ఆయ్న మీద ఏకంగా ఓ పాటనే రాసిన. అందరూ రాసుడు పెన్నుతోని షురూ జేత్తే, నేనేమో కీ బోర్డుతోనే షురూ జేసిన. అదే శ్రీ గ్రాఫిక్స్ కంప్లీటర్ల. సో అట్లా శ్రీ గ్రాఫిక్స్‌కు ఫుల్‌స్టాఫ్ పెట్టి. చెల్లోజు రాజన్న సహకారంతో విశాలాంధ్రల అడుగు వెట్టిన.

విశాలాంధ్రల ఏడాది టీపీ ఆపరేటర్‌గా పన్జేసి అట్నుంచి అటు 2009ల వార్తలకొచ్చిన. శ్రీ గ్రాఫిక్స్ టు వార్త వయా విశాలాంధ్ర.

నెలకు ఆరు వందల నుంచి నెలకు నలభై రెండు వందల జీతం. ఇంటికాడ జెప్తే మావోళ్లు మస్తు కుషీ అయిర్రు. ఏడాదిపాటు ఎన్కకువోకుండా సక్కగ జీతమిచ్చిన సంఘీ సాబ్ ఏడాది తర్వాత మూణ్ణెళ్లకోసారి జీతం ఇచ్చుడు షురూ జేసిండు. ఆ జీతాన్ని నమ్ముకొని చిట్టీ మొదలువెట్టుడు నేను జేసిన తప్పు అని ఏడాది తర్వాత తెలిసింది. అప్పుడు మానకొండూర్ నుంచి అల్గునూరు ఆటో ఛార్జి మూడు రూపాలు. జేబులకెల్లి ఆటోచార్జిలు వెట్టుకొని వార్తల పన్జేసిన, మూణ్ణెళ్లకైనా ఒక్క నెల జీతం అత్తది గదా అనే ఆశతోని. ఒక్కోసారి ఆటో చార్జి లేకుంటే లిఫ్ట్ అడుక్కొని ఇల్లు జేరేటోన్ని ఏ నాత్రయినా…

ఓ రోజు నాత్రి పన్నెండు గొట్టంగ ఆపీసయిపోయింది. ఒంటిగొట్టే రాత్రిదాన్క ఎదిరిజూసిన లిఫ్ట్ కోసం.. ఒక్కలుగూడ ఆపలే. ఇగ నాకు వశపల్లే… “అందుట్లుచ్చవోత్తే అల్గునూరు దాన్క వోతద”ని జెప్పే జవ్వాజి ప్రతాత్ తాత మాట యాదికొచ్చింది. అడుగు ముందుకువడ్డది. నన్నుజూసి కుక్కలు మొర్గుతనే ఉన్నయి. ఎంబడి వడే కుక్కల్ని చెయిలున్న సద్దిగిన్నెతోని “హడి… హడి..” అని గొడ్తాంటే అవి పక్కకు జర్గుతనే ఉన్నయి. నా నడ్క ముందుకుసాగుతనే ఉంది. కరెస్టు దుర్గమ్మ గడ్డ దాటిన..

“కీస్… కీస్… కీస్…” అని సప్పుడినవడ్తున్నది. అగ్గొ మా బాపు సైకిల్ సప్పుడు లెక్కనే ఇనవడ్తున్నది. రోడ్డు మీద పురుగు వూశి ఉండేదిక్కా అని రోడ్డు కిందిమొకాన సూత్తున్న తలికాయ ఒక్కసారి పైకెత్తిజూసిన. బాపు సుట్టకున్న అగ్గి కాగడా లెక్కనే ఎర్రగ మెరుస్తున్నది. కొంచెం కింది దిక్కుజూసిన దోతి తెల్లగ్గనవడ్డది. ఇగ పక్క బాపే నా కోసం అత్తుండనుకొని అక్కన్నే ఆగిన. నా దాన్క అచ్చిన బాపు నన్ను జూసి మళ్లా ఎన్కకుజూసిండు, ఏమన్న బండ్లు గినా అత్తున్నయా అని. ఏం రాంది జూసి నా దిక్కు మల్గనే మల్గిండు.

“ఏమైందే బాపు, పండుకోపోయినవ్..?, నేను రాకవోతునా..”
“నువ్వచ్చే యాళ్ల దాటిందని నీ కోసం జూత్తున్నరా, నాగ్గూడ నిర్ద వడ్తలేదు, నీకెదురుంగత్తే పోంగ మనం గల్సివోవచ్చు గదా..? అని అచ్చిన్రా” అన్నడు.
ఆ మాటతోని అప్పటిదాన్క నడుస్కంటొస్తే అచ్చిన శెమ్టలన్ని పెయ్యిల్నే ఇంకిపోయినయి.
“సరే బాపు నువ్వెన్క గూసో… నేన్ సైకిల్ దొక్కుతా…”
“సరేరా నువ్వే దొక్కు…” అని నా చెయ్యిలున్న సద్దిగిన్నె దీస్కొని, సైకిల్ నా చెయ్యిల వెట్టిండు బాపు.
అట్లా బాపు ముందుగాళ్ల మూడు కిలో మీటర్లు సైకిల్ దొక్కుతే, తర్వాత నాల్గు కిలో మీటర్లు దొక్కిన.
“అరేయ్.. పోంగ పోంగ కరెంటు వెట్టి పోదాం పా…”అన్నడు బాపు.. అట్లా ఆ రోజు మా తొవ్వ మా పొలం కాడికి సాగింది.

– గడ్డం సతీష్, జర్నలిస్ట్ 

99590 59041

Leave A Reply

Your email address will not be published.

Breaking