నిర్దేశం, న్యూఢిల్లీః బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ప్రధాని పదవి ఆఫర్ వచ్చిందట. అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇండీ కూటమికి కన్వినర్ గా నితీశ్ ను కాంగ్రెస్ ఒప్పుకోలేదు. అప్పుడు కూటమి అధికారంలోకి వస్తుందని అనుకున్నారేమో. అయితే అంచనాలు తలకిందులు కావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా బీజేపీని అడ్డుకునే క్రమంలో నితీశ్ కుమార్ కు ఈ ఆఫర్ ఇచ్చారా?
వాస్తవానికి దీనిపై కూటమి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ, నితీశ్ పార్టీ నేత కేసీ త్యాగి మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ‘‘నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి నుంచి ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చింది. నితీశ్‌ను ఈ కూటమికి కన్వీనర్ అయ్యేందుకు ఎవరైతే అనుమతించలేదో, ఇప్పుడు ఆ వ్యక్తుల నుంచే ఈ ఆఫర్ వచ్చింది. కానీ తాను ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతానని చెప్పి, ఆ ఆఫర్‌ని నితీశ్ తిరస్కరించారు’’ అని చెప్పుకొచ్చారు.
అయితే, నితీశ్ ను సంప్రదించిన ఈ ఆఫర్ ఇచ్చిన నాయకులు ఎవరని ప్రశ్నించగా.. జవాబు ఇచ్చేందుకు త్యాగి నిరాకరించారు. ప్రధాని పదవి ఆఫర్‌తో కొందరు నాయకులు నేరుగా నితీశ్‌నఉ సంప్రదించాలని అనుకున్నారని చెప్పారు. కానీ, వారి పేర్లేంటో చెప్పలేదు. తాము ఇండియా కూటమిని విడిచిపెట్టి ఎన్డీఏలో చేరామని, ఇకపై వెనుదిరిగి చూసే ప్రసక్తే లేదని త్యాగి తేల్చి చెప్పారు. అయితే త్యాగి వ్యాఖ్యలను కాంగ్రెస్ కొట్టిపారేసింది.