Take a fresh look at your lifestyle.

కబడ్డీ టోర్నమెంట్‌లో హర్యానా జ‌ట్టు విన్న‌ర్‌

0 275

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌

కబడ్డీ టోర్నమెంట్‌లో
హర్యానా జ‌ట్టు విన్న‌ర్‌ – బి.ఎం.టి.సి. ర‌న్న‌ర్‌

విజేత జ‌ట్ల‌ను అభినందించిన‌ టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌

హైదరాబాద్ : హైదరాబాద్‌ శివారు హకీంపేట ట్రాన్స్‌పోర్ట్‌ అకాడమీలో నిర్వ‌హించిన‌ అఖిల భార‌త ర‌వాణా సంస్థ‌ల క‌బ‌డ్డీ టోర్న‌మెంట్‌లో హర్యానా జట్టు విజేతగా నిలిచింది. మూడు రోజుల పాటు జ‌రిగిన ఈ టోర్నమెంట్‌ శనివారం సాయంత్రంతో ముగిసింది.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్టీయూ) ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్‌ నిర్వహించగా.. ఈ పోటీలకు టీఎస్‌ఆర్టీసీ ఆతిథ్యం ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్ర‌జా ర‌వాణా సంస్థ‌ల‌కు చెందిన 9 జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనగా.. తుది పోరులో హర్యానా రోడ్ వేస్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ ఫోర్ట్ కార్పొరేషన్ (బి.ఎం.టి.సి) జట్లు తలపడ్డాయి. ఈ పోటీలో హర్యానా జట్టు ఛాంపియన్‌గా .. బెంగళూరు జట్టు రన్నర్‌గా ప‌త‌కాలు అందుకోగా మూడో స్థానంలో మ‌హ‌రాష్ట్ర ఆర్టీసీ జట్టు నిలిచింది.

ముగింపు వేడుకలకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై మొద‌ట మూడు స్థానాల్లో నిలిచిన హ‌ర్యానా (బంగారు), బెంగ‌ళూరు (ర‌జ‌తం), మ‌హ‌రాష్ట్ర (కాంస్యం) జట్ల సభ్యులకు ట్రోపీలు, మెడ‌ల్స్‌, ప్రశంసాపత్రాలను బ‌హూక‌రించి అభినందించారు. టోర్న‌మెంట్‌లో పాల్గొన్న టీం స‌భ్యుల‌కు స‌ర్టిఫికెట్ల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ, ప్ర‌జా ర‌వాణా సంస్థ‌లలో ప‌ని చేసే ఉద్యోగులు క్రీడ‌ల్లోనూ ప్రావీణ్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం గొప్ప విష‌య‌మ‌ని కొనియాడారు. ఆయా రాష్ట్రాల టీంల‌ మ‌ధ్య మంచి వాతావ‌ర‌ణంలో జ‌రిగిన ఈ టోర్న‌మెంట్ క్రీడా స్ఫూర్తిని మ‌రింత రెట్టింపు చేసింద‌ని తాను భావిస్తున్న‌ట్లు చెప్పారు.


ఆట‌లో గెలుపు, ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని, ప‌ట్టుద‌ల‌, కృషి ఉంటే క్రీడ‌ల్లో రాణించ‌వ‌చ్చ‌న్నారు. ఆట‌ల్లో రాణింపుతో రాష్ట్ర‌, జాతీయ స్థాయిలో పేరు ప్ర‌ఖ్యాత‌లు గ‌డించ‌వ‌చ్చ‌ని, ఆ స్ఫూర్తితో క్రీడ‌ల్లో నైపుణ్యాన్ని సాధించాల‌ని చెబుతూ స్థానికంగా జ‌రిగే టోర్న‌మెంట్‌ క్రీడ‌ల్లోనూ పాల్గొని సంస్థ‌ల‌కు మ‌రింత గౌర‌వాన్ని ఇనుమ‌డింప‌జేయాల‌ని సూచించారు. 9 రాష్ట్రాల ర‌వాణా సంస్థ‌ల ఉద్యోగులు క‌బ‌డ్డీ టోర్న‌మెంట్‌లో జ‌ట్లు పోటీగా ఆడినా ఉద్యోగులు సోద‌రాభావాన్ని చాటుకోవ‌డం మంచి ప‌రిణామ‌న్నారు. ఎ.ఎస్‌.ఆర్టీయు నిర్వ‌హించే ఏ టోర్న‌మెంట్‌కైనా టి.ఎస్‌.ఆర్టీసీ ఆతిథ్యం ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉంటుంద‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావ‌డంలో త‌న‌వంతుగా కృషి చేసిన చీఫ్ ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్ కృష్ణ‌కాంత్ గారిని ప్ర‌త్యేకంగా ఎండీ అభినందించారు. అలాగే, యోగాపై స‌త్త‌య్య రూపొందించిన బ్రోచ‌ర్‌ను ఆయ‌న ఆవిష్క‌రించారు. ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఏఎస్‌ఆర్టీయూ డైరెక్టర్ కిషోర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్య కిరణ్, టీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం, సీపీఎం కృష్ణకాంత్, సికింద్రాబాద్ ఆర్ఎం వెంకన్న, స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకట నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking