Take a fresh look at your lifestyle.

అంబేడ్కర్ ఆలోచనల స్పూర్తితో..

0 37

అంబేడ్కర్ ఆలోచనల అమలే..

వారికి మనమిచ్చే ఘనమైన నివాళి

: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

 భారతీయులతోపాటు విదేశీయులకూ అంబేడ్కర్ గురించి తెలియజేసేందుకు.. అంబేడ్కర్ సర్క్యూట్ భారత్ గౌరవ్ ట్రైన్స్ ప్రారంభం.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 : భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ చేసిన బోధనల స్ఫూర్తిని కొనసాగించడమే ఆ మహనీయుడికి ఇచ్చే ఘనమైన నివాళి అని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం కృతనిశ్చయంతో కృషిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం అంబేడ్కర్ 133వ జయంతి సందర్భంగా.. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వేస్టేషన్ నుంచి.. బాబాసాహెబ్ అంబేడ్కర్ టూరిజం సర్క్యూట్ ను అనుసంధానం చేసే భారత్ గౌరవ్ రైలు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.

బాబాసాహెబ్ అంబేడ్కర్ చరిత్రను, వారి జీవితాన్ని, సందేశాన్ని భారతీయులతోపాటు, విదేశీయులకు కూడా చేరవేసేందుకు ఈ సర్క్యూట్ ఎంతో ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ పర్యాటకానికి ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు అంబేడ్కర్ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలకు వేదికలైన పంచతీర్థలను అభివృద్ధి చేయడం దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

మధ్యప్రదేశ్ లోని మౌ, మహారాష్ట్రలోని నాగ్ పూర్, ముంబైతోపాటుగా ఢిల్లీ తదితర అంబేద్కర్ జీవనంతో ముడిపడి ఉన్న ప్రాంతాలను.. కలుపుతూ ఈ యాత్ర కొనసాగుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

లండన్ లో అంబేడ్కర్ విద్యాభ్యాసం చేసిన.. లండన్ లోని ఇంటిని కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం కలిసి రూ.800 కోట్లు పెట్టి కొనుగోలు చేయడంతోపాటు దాన్ని అద్భుతమైన మ్యూజియంగా.. తీర్చిదిద్దిన విషయాన్ని కేంద్ర మంత్రి వెల్లడించారు.

అంబేడ్కర్ కు సంబంధించిన పలు ప్రాంతాల్లో.. స్మారక భవనాలు నిర్మించిన విషయాన్నీ కిషన్ రెడ్డి ప్రస్తావించారు. అంబేడ్కర్ పై పరిశోధనలను ప్రోత్సహించేందుకు 24 సెంట్రల్ యూనివర్సిటీల్లో రీసెర్చ్ కోసం ప్రత్యేకమైన చైర్‌లను ఏర్పాటు చేసిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. దళితులకు స్కాలర్ షిప్స్.. సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాల ఏర్పాటును ఆయన వెల్లడించారు.

ప్రధానమంత్రి మోదీ చొరవతో.. ఐక్యరాజ్యసమితిలో తొలిసారి 125వ జయంతిని ఘనంగా నిర్వహించుకున్న విషయాన్నీ కేంద్రమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. 2015 నుంచి నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారని.. అప్పటినుంచీ ఘనంగా ఆ రోజున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ కోసం తీసుకొచ్చిన యాప్ కు ‘భీమ్’ పేరును పెట్టామన్నారు. ఇలా ప్రతి సందర్భంలోనూ అంబేడ్కర్ పేరును, ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.

దీంతోపాటుగా రాజ్యాంగంలో సమసమాజ స్థాపనకోసం అంబేడ్కర్ చూపించిన మార్గంలో ప్రయాణిస్తూ.. పేదలకు ఇండ్లు,మహిళలకు గౌరవం ఇస్తూ టాయిలెట్ల నిర్మాణం, 9 కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఉజ్వల యోజనలో భాగంగా సిలిండర్లు, పారిశుధ్య కార్మికుల కోసం మెషినరీని అందుబాటులోకి తీసుకురావడం తదితర కార్యక్రమాలను కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ రైలును తీసుకొస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి, రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులకు, ఉద్యోగులందరికీ కిషన్ రెడ్డి ధన్యవాదములు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి శ్రీ వీరేంద్ర కుమార్, బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ ఈటల రాజేందర్, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking