Take a fresh look at your lifestyle.

ఆ తండ్రిని చూసి అసహ్యించుకుంటాను…

0 9

ఆ తండ్రిని చూసి అసహ్యించుకుంటాను…

‘తన కొడుకు శవాన్ని చూసేందుకు కూడా భయపడే ఆ కన్న తండ్రిని చూసి నేను అసహ్యించుకుంటాను’ అంటూ 1980ల చివరలో సృజన పత్రికలో వరవరరావు గారు అనువదించిన పెద్ద కవితను నా విద్యార్థి జీవితంలోనే చదివాను. ఎన్ కౌంటర్ లో పోయిన కుమారుడి శవాన్ని చూడటానికి కూడా ఇష్టపడని ఒక తండ్రి గురించి ప్రముఖ హిందీ కవి సర్వేశ్వర్ దయాల్ సక్సేనా (?) అనే హిందీ ప్రగతిశీల కవి రాసిన కవితకు వీవీ చేసిన గొప్ప అనువాదం అది. ఆ వాక్యం చాలా కాలం వెంటాడింది మమ్మల్ని.

ఇన్నేళ్లకు మార్కిస్ట్ స్టడీ సర్కిల్ వాట్సాప్ గ్రూపులో ఒక కథనం  చూశాను. కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కసితో బతికుండగానే కూతురు చావు ప్లెక్సీ కొట్టించిన ఒక తండ్రి మదంపై సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ రాసిన చిన్న కథనం ఇది.

“ఈ దేశంలోని మనుషులంతా ముఖ్యంగా మగజాతి, మగబుద్దిగల స్త్రీజాతి మొత్తం, స్త్రీకి చెందిన రహస్య అవయవం చుట్టూ కాపలాగా కూర్చుంది. అన్ని విలువలూ, తిట్లూ, మర్యాదలూ ఈ అవయవం నుండే మొదలవుతాయి.”

ఇటీవలికాలంలో ఇంత శక్తివంతమైన ప్రకటనను నేను చూడలేదు. అన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో ముఖ్యంగా కుల దురహంకారాన్ని పబ్లిక్‌గా ప్రదర్శిస్తున్న కులతత్వ గ్రూపుల్లో దీన్ని పనిగట్టుకుని షేర్ చేయాలి. కన్న తండ్రి దౌష్ట్యంపై ఇంత పటుత్వంతో ఈ చిన్న కథనంలో సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ ప్రకటించిన ఆ ధర్మాగ్రహానికి జేజేలు చెప్పాలి. దీన్ని పోస్ట్ చేసిన మార్కిస్ట్ స్టడీ సర్కిల్ వాట్సాప్ గ్రూపు‌నకు మన:పూర్వక అభినందనలు.

బతికుండగానే కూతురుకు చావు ప్లెక్సీ కొట్టించిన ఆ దౌర్భాగ్యపు తండ్రిపై పూర్తి కథనాన్ని ఇక్కడ చదవండి. ప్రతి సమాజంలో ఇలాంటి వెధవ తండ్రి వుంటాడు. వాడిని సమర్థించే వెధవలుంటారు కాబట్టి ధైర్యంగా ఇలా ప్రవర్తిస్తాడు.

నేను నా బిడ్డ శరీరాన్ని కన్నాను, కాబట్టి దాన్ని ఎవరివద్ద పడుకోబెట్టాలో నేనే నిర్ణయిస్తాననే కనీస నీతిలేని తనం ఇలాంటి జంతువులకుంటుంది. దొరికితే మచ్చుకత్తులతో నరికేయడం, బాత్రూముల్లో వురేయడం, నిద్రలో గొంతుపిసికి చంపడం వీళ్లకు అలవాటు. దొరకకపోతే ఇలా పిండప్రదానాలు చేయడం రివాజు.

చిత్రమేమంటే ఇదే పని కూతురు కాకుండా కొడుకు చేస్తే ఏ తండ్రీ చంపడు. పిండప్రదానాలు చేయడు. నిజానికి పెళ్ళిచేసుకోవడవం వల్ల భారం కొడుకుమీదనే పడుతుందని తెలిసినా.

విషాదం ఏమంటే, ఇలాంటి జంతువులని అభినందించే చదువుకున్న వెధవలుంటారు, వీళ్లకు సంఘాలూ వుంటాయి. ఇక్కడ సమస్య మారుతీరావులదే కాదు రెడ్డిజాగృతి సంస్థలది కూడా.సొంత శరీరమ్మీద హక్కుల గురించి మాట్లాడని ఈ వెధవలంతా ఇతర శరీరాలమీద పెత్తనాలని తండ్రి పేరుతో హక్కులుగా రుద్దుతుంటారు. ఈ దేశంలోని మనుషులంతా ముఖ్యంగా మగజాతి, మగబుద్దిగల స్త్రీజాతి మొత్తం, స్త్రీకి చెందిన రహస్య అవయవం చుట్టూ కాపలాగా కూర్చుంది. అన్ని విలువలూ, తిట్లూ, మర్యాదలూ ఈ అవయవం నుండే మొదలవుతాయి.

థూ.

– సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్

Leave A Reply

Your email address will not be published.

Breaking