Take a fresh look at your lifestyle.

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ లపై ప్రభుత్వం సీరియస్

0 14

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ లపై ప్రభుత్వం సీరియస్

  • 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం కోసం..
  • సీబీఐతో విచారణ చేయకుండా కుట్ర..
  • టీఎస్ పీఎస్ సీ కమిటీ రాజీనామాపై..
  • కాన్ఫిడెన్షియల్ పేరుతో తప్పించుకుని..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో టీఎస్ పీఎస్ సీ పరీక్షల పేపరుల లీకేజీ కేసుమరోసారి తెరపైకి వచ్చింది. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఈ పేపరు లీకేజీ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటున్నట్లు విశ్వాషనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో నిరుద్యోగుల పాత్ర కీలకంగా ఉంది. బీఆర్ ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిరుద్యోగులు బస్సు యాత్ర కూడా నిర్వహించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న పేపర్ లీకేజీ వ్యవహరంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేయడానికి లోతుగా విచారణ జరిపించాలనే డిమాండ్ నిరుద్యోగుల నుంచి వచ్చింది.

నిర్దేశం, హైదరాబాద్ :

https://epaper.nirdhesham.com/view/86/nirdhesham-e-paper

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ (టీఎస్ పీఎస్సీ) లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీ వ్యవహరం తెలంగాణలో కలకలం రేపింది. పరీక్ష పేపరుల లీకేజీ వల్ల మెరిట్ నిరుద్యోగులు అన్యాయానికి గురయ్యారు. ప్రధానంగా టీఎస్ పీఎస్ సీ పరీక్షల పేపరుల లీకేజీ కేసులో ప్రభుత్వ తీరు ప్రకారం సిట్ అధికారులు విచారణ చేశారు.

సిట్ అధికారుల విచారణకు పెద్దల అడ్డంకి..

టీఎస్ పీఎస్ సీ పరీక్షల పేపరుల లీకేజీ కేసు విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి, బీఎస్పీ చీఫ్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొపెసర్ కొదండరాంలు ఈ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీరియస్ గా స్పందించారు.

టీఎస్ పీఎస్ సీ ఆఫీస్ వద్ద నిరుద్యోగులతో ఆందోళన కూడా చేశారు. సిట్ అధికారులతో కాకుండా సీబీఐ అధికారులతో పేపర్ లీకేజీ కేసు విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ పేపరు లీకేజీ వ్యవహరంలో అప్పటి సీఎం కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కేటీఆర్, కవిత, హరీశ్ రావుల పాత్రతో పాటు కొందరు మంత్రుల పాత్ర ఉందని వారు ఆరోపణలు చేశారు.

సీబీఐతో విచారణ చేయకుండా కుట్ర

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ వ్యవహరంలో సీబీఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ అప్పట్లో పెరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో నిరుద్యోగులు కేసులు వేశారు. ప్రభుత్వం ఆఘమేఘాల మీద ప్రాథమిక సమాచారంతోనే సిట్ అధికారులు హైకోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకోలేక పోయింది.

ఇప్పటికే ముగ్గురు నిరుద్యోగులు వేసిన కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉంది. అయితే.. అప్పుడు బీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం.. సీఎం ఫ్యామిలీపై పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో సిట్ అధికారులు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా విచారణ జరిపించారు. పేపర్ లీకేజీ కేసులో ఆరోపణలు చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిట్ ఆఫీస్ కు పిలిపించి విచారణ చేశారు పోలీసు అధికారులు.

టీఎస్ పీఎస్ సీ కమిటీ రాజీనామాపై…

పేపర్ లీకేజ్ కేసు వ్యవహరంలో పాత్ర ఉన్న టీఎస్ పీఎస్ సీ కమిటీని రద్దు చేయాలని ప్రతి పక్షలు డిమాండ్ చేశాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్ల కోసం టీఎస్ పీఎస్ సీ కమిటీని రద్దు చేస్తామని నిరుద్యోగులకు హామి ఇచ్చారు కేటీఆర్. అయితే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ‘‘టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ కేసు’’ వ్యవహరంపై ఎలా స్పందిస్తోందననే చర్చా ప్రారంభమైంది. అప్పట్లో ఈ పేపర్ లీకేజీపై సీరియస్ గా స్పందించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఈ కేసును పర్సనల్ గా తీసుకుని విచారణ చేపిస్తే టీఎస్ పీఎస్ సీ కమిటీ సభ్యులతో పాటు ప్రభుత్వ పెద్దల పాత్ర బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కాన్ఫిడెన్షియల్ పేరుతో తప్పించుకుని..

పేపర్ లీకేజీ వ్యవహారంలో టీఎస్ పీఎస్ సీ కమిటీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నిర్లక్షం వల్లనే పేపర్ లీకేజీ జరిగినట్లు టీఎస్ పీఎస్ సీ కమిటీ పేర్కొని విచారణ నుంచి వారు తప్పుకున్నట్లు తెలుస్తోంది.

కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకర్ లక్ష్మీ కేంద్రంగా విచారణ జరిపి సిట్ అధికారులు టీఎస్ పీఎస్ సీ కమిటీ, ఆరోపణలు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ ఫ్యామిలీని విచారణ చేయలేక పోయారు. కేసీఆర్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి బామ్మర్ది ప్రొపెసర్ బండి లింగారెడ్డి టీఎస్ పీఎస్ సీ సభ్యుడు కావడం.. అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూతురు శ్రీహర్షిత గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడం.. ఇంటర్ బోర్డ్ సెక్రటరీగా జనార్ధన్ రెడ్డి ఉన్నప్పుడు తన వద్ద పని చేసిన జూనియర్ అసిస్టెంట్ లింబాధర్ ను టీఎస్ పీఎస్ సీ లోకి తెప్పించుకుని సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ ఇవ్వడం లాంటి విషయాలపై సిట్ అధికారులు లోతుగా విచారణ చేయలేక పోయారు.

అందుకు ప్రభుత్వ పెద్దల నుంచి అడ్డంకులు ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా పేపర్ లీకేజీ కేసులో అరెస్టు అయిన వారి కాల్ డిటైల్స్.. ఆన్ లైన్ లో చేసిన బ్యాంక్ లావాదేవీలు గురించి లోతుగా విచారణ చేస్తే ఈ వ్యవహారంలో పెద్దల హస్తం దొరికేదంటున్నారు.

మౌన వ్రతంలో ఈ డీ అధికారులు

టీ ఎస్ పీ ఎస్ సీ పేపర్ లీకేజీ పై ఈ డీ అధికారులు విచారణ చేశారు. ప్రాథమిక సాక్షాల ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ కేసు ఇన్ ఫర్ మేషన్ రిపోర్ట్ ప్రకారం కేసు (ECIR)నమోదు చేశారు. కొంత కాలం హడావుడి చేసిన ఈ డీ అధికారులు ఆ తరువాత మౌన వ్రతం పట్టారు. ఇప్పటికీ ఆ కేసులో ముందుకు వెళ్ళలేక పోయారు.

బీజేపీ మరో అడుగు ముందుకు వేసి పేపర్ లీకేజీ కేసులో విచారణ జరిపి సంభందం ఉన్న వారిని ఈ డీ అధికారులు అరెస్ట్ చేస్తారని నిరుద్యుగులకు భరోసా ఇచ్చారు. కానీ… ఆచరణలో మాత్రం ఈ డీ అధికారులు ఎందుకు మౌనం పాటించారో అర్థం కాలేదు. ఇప్పటి వరకు ఆ కేసులో ముందుకు వెళ్ళలేక పోయారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే..

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని లోతుగా విచారణ జరిపిస్తే ప్రభుత్వ పెద్దలతో పాటు టీఎస్ పీఎస్ సీ కమిటీ పాత్ర కూడా తెలుస్తోందంటున్నారు నిరుద్యోగ యువత. అయితే…. పేపర్ లీకేజ్ వ్యవహారంపై అప్పట్లో ఆందోళన చేసిన రేవంత్ రెడ్డి యే ముఖ్యమంత్రి కావడంతో ఈ వ్యవహరంను సీరియస్ గా తీసుకుని లోతుగా విచారణ జరిపించి లీకేజీలో తెర వెనుక పాత్ర ఎవరిదో బహిర్గతం అవుతుందని వారు పేర్కొంటున్నారు.

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking