Take a fresh look at your lifestyle.

గద్దర్ పాట శబ్దం కాదు ఒక యుద్దం – అవనీ శ్రీ కవి

0 28

అతడి పాట శబ్దం కాదు ఒక యుద్దం

ఉద్యమాలను నడిపిన పాట
జనాలను ఉర్రూతలూగించిన పాట
ప్రభుత్వాలను పడగొట్టిన పాట
అదే గద్దరన్న పాట
అదే మన గద్దరన్న నోట.

గద్దరన్న పాటంటే
గాలికి కొట్టుకొచ్చిన గాలివాటం కాదు
కాలిగోటి నుండి నడినెత్తి దాకా ప్రవహించే
పాటల తూటా.

గద్దరన్న పాట
కన్నతల్లులు బిడ్డల్ని పొగొట్టుకున్నప్పుడు పుట్టింది
కనికరంలేక పోలీసుల కాల్పులకు ఒరిగిపోయిన అమరుల రక్తం నుండి పుట్టింది
ఆకలికి నకనకలాడినప్పుడు భూములు కోల్పోయిన రైతుల కన్నీటి నుండి పుట్టింది.

దండు కట్టడానికి పాట కానీ
దండం పెట్టడానికి కాదు పాట
దౌర్జన్యాలకు వ్యతిరేకం పాట
దొరతనాలను కీర్తించడానికి కాదని
గద్దరన్న పాట దండయాత్ర చేసింది.

పాటకు ప్రాణంబోసిన గొంతుక
పాట లేకుంటే పాణం‌ ఆగిపోయేటంత మమేకమైనోడు
పాటంటేనే
గద్దరన్న గుర్తొచ్చేలా ముద్రవేసుకున్న జీరగొంతుక.

నక్సల్బరీలో పురుడోసుకున్న పాట
శ్రీకాకుళం ఉద్యమంలో గర్జించింది
గోదారి పోరాటాలలో గజ్జెకట్టి ఆడింది
తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దై
ఈ నేలతల్లిని ముద్దాడింది ఆ పాట.

గద్దరన్న పాటలో పోరాట బలముంది
ఆ పాటవిన్న ప్రజలకు పోరాడే సత్తువొచ్చింది.

శరీరంలో తూటాలను పెట్టుకొని
ప్రజల చేతులకు తుపాకులనిచ్చిన కవి
ఆ తుపాకుల గొంతులో పాటను నాటిన గాయకుడు.

గద్దరన్న పాటంటేనే ఒక విప్లవం
గద్దరన్న అంటే ఒక శబ్దం కాదు
ఈ నేలవున్నంత వరకు చేసే ఒక యుద్దం.

నీ గోసి నీ గొంగడి నీ పాట నీ గజ్జెలు
నీ లయ నీ రాగం నీ తాళం
నీ మాట నీ తూటా నీ పాట
ఈ తెలంగాణ సమాజం మర్చిపోదు
మరల నీవు వచ్చేదాకా.!

జోహర్లు పాటల తూటా గద్దరన్న కు.

– అవనీ శ్రీ కవి, 9985419424.

Leave A Reply

Your email address will not be published.

Breaking