Take a fresh look at your lifestyle.

మాలిక్ జీవితాన్ని మార్చిన చదువు

0 10

సక్సెస్ స్టోరి

మాలిక్ జీవితాన్ని మార్చిన చదువు
– పశువుల కాపారిగా, హెయిర్ కటింగ్ షాప్ లో వర్కర్ జీవితం..
– పిడిఎస్ యు ఆధ్వర్యంలో ఉద్యమాలు..
– బహుజన ఉద్యమానికి దిక్సూచి
– అక్రమ అరెస్టు చేస్తే కదిలిన జనం..
– ఇంటర్ లో టాపర్.. డిగ్రీలో గోల్డ్ మెడల్..
– లంచాలు వద్దనుకుని ఎసీటీవో జాబ్ వదిలి..
– మంగళి షాపు వర్కర్ నుంచి అసోషియేట్ ప్రొఫెసర్ వరకు

కష్టాలను చూసి కన్నీళ్లు పెట్టలేదు అతను.. బాధలను చూసి భయ పడలేదు.. సమస్యలను చూసి సవాల్ విసిరాడు.. అన్నిటికి మూలం చదువు అని గుర్తించాడు. కష్ట పడుతునే ఇష్టంతో చదివాడు.. జీవితంలో ఎదురైనా సవాల్ లను అధిగమించి అసోషియేట్ ప్రొఫెసర్ గా ఎదిగిన సాయిలు అలియాస్ డాక్టర్ మహ్మద్ అబ్దుల్ మాలిక్ సక్సెస్ స్టోరీ ఇది.
పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్లుగా సాయిలు చిన్నతనం నుంచే భిన్నంగా థింక్ చేసి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన అతను 1973లో తల్లిదండ్రులు కిష్టవ్వ – బాలయ్యలకు ఐదుగురు సంతానంలో అందరికంటే చిన్నవాడుగా జన్మించారు.పశువులను మేపుతూ, వ్యవసాయంలో సహాయం చేస్తారని తండ్రి బాలయ్య చదువు ప్రాధాన్యత తెలియక సాయిలుతో అర్ధాంతరంగా బడి మానిపించారు.

పశువులా కాపారిగా..

ప్రాథమిక పాఠశాల చదువుకు స్వస్తి చెప్పిన సాయిలు తండ్రి కోరిక మేరకు పశువులను మేపడానికి అడవి బాట పట్టాడు. నా ఈడు పిల్లలు బడికి వెళ్లి చదువుతుంటే తాను పశువులు మేపడం ఏమిటనే ప్రశ్న ఆ చిన్నోడి హృదయాన్ని ప్రశ్నించింది. కానీ.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేది ఎవరు..? బాల కార్మికుడిగా పని చేస్తూనే ఏడవ తరగతి ప్రైవేట్ గా పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యారు. పదవ తరగతి పరీక్షలు ప్రైవేట్ గా రాయడానికి కామారెడ్డికి వెళ్లిన సందర్భంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యు)కార్యకర్తలతో పరిచయం అతని జీవితంలో మరో మెట్టు.

 

పల్లెలకు తరలి వెళ్లిన సాయిలు

కామారెడ్డిలో పిడిఎస్ యు కార్యకర్తలతో ఏర్పడిన పరిచయంతో విప్లవోద్యమం బాట పట్టాడు. పదవతరగతి పరీక్షలు కాగానే పీడీఎస్ యు ఆధ్వర్యంలో ‘విలేజ్ క్యాంపియన్’కు విద్యార్థులతో సాయిలు వెళ్లాడు. పల్లెలలో పేద ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ప్రత్యక్షంగా చూశాడు అతను. దోపీడి లేని సమాజం రావాలంటే విద్యార్థి శక్తి విద్యుత్ శక్తిలా పని చేయాలని విద్యార్థి దశలోనే నిర్ణయించుకున్నారు.

పిడిఎస్ యు ఆర్గనైజర్ గా..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ లో చేరిన సాయిలుకు పిడిఎస్ యు ఆర్గనైజర్ గా బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ పట్టణంలోని హాస్టల్ విద్యార్థుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళుతూనే ప్రజల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు అతను. నవీపేట్ మండల కేంద్రంలో రోడ్ పక్కన నిరుపేదలు వేసుకున్న గుడి సెలను పోలీసులు బలవంతంగా తొలగించే ప్రయత్నం చేశారు. ఆ పేదలకు అండగా నిలిసిన విద్యార్థులకు సాయిలు నాయకత్వం వహించారు. ఆ సమయంలో పోలీసులు సాయిలును అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

సాయిలు విడుదల కోసం రాస్తారోకో..

నవీపేట్ పోలీసులు అరెస్టు చేసిన సాయిలును విడుదల చేయాలని ప్రజలు రహదారిపై భైఠాయించారు. అక్రమంగా అరెస్టు చేసిన సాయిలును విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ప్రజల ఆందోళనకు దిగి వచ్చిన పోలీసులు సాయిలును వదిలి వేశారు. అలాగే రోడ్ పక్కన పేదలు వేసుకున్న గుడిచెలను తొలగించమని హామి ఇచ్చారు పోలీసు అధికారులు. అలాగే మండల్ కమిషన్ కు అనుకూలంగా పిడిఎస్ యు ఆధ్యర్యంలో జిల్లా బంద్ లో పాల్గొన్న సాయిలును అరెస్టు చేశారు పోలీసులు.

ఇంటర్ లో టాపర్..

పీడిఎస్ యు ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలలో పాల్గొంటూనే ఇంటర్ లో స్ట్రగుల్ ఎదుర్కొన్నాను అంటారు సాయిలు. ఇంటి నుంచి డబ్బులు పంపక పోవడం.. తినడానికి తిండికి కష్టమైన నాటి రోజులను మరిచి పోలేనంటారు అతను. అప్పటికే తాను నేర్చుకునే టైపింగ్ ఫీజు.. కరాటే ఫీజు.. ఇంటర్ ఎగ్జామ్ ఫీజులు.. ఫ్రెండ్ ద్వారా హాస్టల్ వార్డెన్ కు తెలిసి 200 రూపాయలు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అయినా.. తాను ఇంటర్ లో టాపర్ గా నిలువడంతో వెనక్కి చూడకుండా ముందుకు వెళ్లాను అంటారు సాయిలు. అదే తన జీవితంలో టర్నింగ్ ఫాయింట్ కూడా అంటారు.

హెయిర్ కటింగ్ వర్కర్ గా..

నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో చేరాడు సాయిలు. అయినా.. ఆర్థిక సమస్యలను అధిగమించడానికి తాను హెయిర్ కటింగ్ షాపులో పార్ట్ టైమ్ వర్కర్ గా పని చేయడం ప్రారంభించారు. మంగళి షాపులో వర్కర్ గా పని చేస్తూ డిగ్రీ కాలేజ్ వరకు కాలినడుకతో వెళ్లడం సమస్యగా మారింది. రెండు వందల రూపాయలకు పాత సైకిల్ తీసుకోవాలని భావించాడు సాయిలు. ఎవరిని అడిగినా Rs 200 లు ఇవ్వలేదు. రాత్రింబగళ్లు హెయిర్ కటింగ్ షాపులో పని చేస్తూ ఆ డబ్బులు సంపాదించారు. డిగ్రీ కాలేజ్ లో తనదైన ఫ్రెండ్స్ గ్రూప్ ను ఏర్పటు చేసుకున్నారు సాయిలు. మదనం గంగాధర్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, దేవన్న, సత్యశోదక్ స్కూల్ నర్సయ్య, రాజారాం యాదవ్ వీళ్లంతా డిగ్రీ కాలేజ్ లో క్లాస్ మెంట్స్. పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సాయిలు డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏలో సీటు సంపాదించారు. ‘నేను హిందువుగా పుట్టిన, హిందువుగా మాత్రం చని పోను.’ అని ఆలోచించిన సాయిలు ముస్లిం అభ్యుదయవాదియైన మోహిత్ భాయ్ తో పరిచయం వలన ఇస్లాం గురించి తెలుసుకుని హిందువు నుంచి సాయిలు ముస్లింగా మారి తన పేరును మహ్మద్ అబ్దుల్ మాలిక్ గా మార్చుకున్నారు.

ఏసీటీవో జాబ్ వదిలి..

అక్రమ సంపాదన అంటే అసహ్హించుకునే సాయిలు అలియాస్ మహ్మద్ అబ్దుల్ మాలిక్ రెండేళ్లు తప్పనిసరి హైదరాబాద్ లోని బేగం బజార్ లో అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. కానీ.. లంచాలు తీసుకోకుండా విధులు నిర్వహించడం కష్టమని భావించిన మహ్మద్ అబ్దులు మాలిక్ తన జాబ్ కు రాజీనామా చేసి లెక్చరర్ గా చేరి పిహెచ్ డి చేసి ఆ తరువాత అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, ప్రస్తుతం అసోషియేట్ ప్రొఫెసర్ గా విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నారు.

చదువే మార్గం చూపుతుంది..

సమాజంలోని అసమానతల కుల వ్యవస్థపై తిరుగుబాటు చేసి సామాజిక న్యాయం కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ బహుజన ఉద్యమంలో క్రీయశీలకంగా పాల్గొంటున్నారు డాక్టర్ మహ్మద్ అబ్దుల్ మాలిక్. మహత్మా జ్యోతిరావ్ ఫూలే, బాబా సాహేబ్ అంబేద్కర్ ఆశయాలతో సామాజిక న్యాయం సాధించడమే లక్ష్యంగా అతను అడుగులు ముందుకు వేస్తున్నారు. విద్య బోధన ద్వారా తన శిష్యులు వివిధ ప్రభుత్వ జాబ్ లు సంపాదించడం సంతోషంగా ఉందంటారు మాలిక్.
ప్రజల సమస్యల పై అతను పరిశోధన లు చేశారు. ఉపాధి హామీ పథకం పైన జాతీయ సదస్సు, పరిశోధన, చైల్డ్ లేబర్ పైనా కల్యాణ లక్ష్మి ప్రభావం, ప్రాజెక్ట్. నీటి ప్రాజెక్ట్ నిర్వాసితులకు జరిగిన అన్యాయం పైన పరిశోధన, ఆడ పిల్లలలో రక్త హీనత పైన పరిశోధన, కేంద్రం – రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ పైన పరిశోధన, జిల్లాల పునర్విభజన తదితర 26 ఆంశాల పైన పరిశోధనలు చేశారు మాలిక్. పోటీ పరీక్షలకు సంబందించిన 20 పుస్తకాలను మాలిక్ ప్రచురించారు. పోటీ పరీక్షలపై చాలా ఏళ్లుగా గైడెన్స్ ఇస్తున్నారు అతను.

సాయిలు అలియాస్ మాలిక్ ప్రస్థానం

– 1989లో పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడిగా..
– 1993లో బహుజన విద్యార్థి ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడిగా..
– 1994లో ఇంటర్ లో కాలేజ్ ఫస్ట్ ర్యాంక్..
– 1997లో డిగ్రీలో గోల్డ్ మెడల్..
– 1999లో పీజీలో ఆరవ ర్యాంక్
– 2000లో సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పటు
– 2002లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా..
– 2005లో ఏసిటిఓగా..
– 2008లో సామాజిక రంగంపై ఆర్థిక సంస్కరణల ప్రభావంపై పిహెచ్ డి..
– 2010 లో గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా..
– 2015లో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు..
– ప్రస్తుతం కూకట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో అసోషియేట్ ప్రొఫెసర్ గా..

యాటకర్ల మల్లేష్

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking