Take a fresh look at your lifestyle.

రాలిపోతున్న గులాబీ రేకులు అటు కాంగ్రెస్… ఇటు బీజేపీలోకి వలసలు…

0 5

రాలిపోతున్న గులాబీ రేకులు
అటు కాంగ్రెస్… ఇటు బీజేపీలోకి వలసలు…
 

నిర్దేశం, హైదరాబాద్ :

పార్లమెంట్‌ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ అగ్ని పరీక్ష ఎదుర్కొంటొంది. 17 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్దులు కరువయ్యారు. మొన్నటి వరకు పోటీకి రెడీ అన్న నేతలు.. ఇప్పుడు ఒక్కొక్కరుగా పోటీకి ససేమిరా అంటున్నారు. నల్గొండ నుంచి బరిలోకి దిగుతానన్న శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్‌ పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఇప్పటికే పార్టీకి సంకేతాలు ఇచ్చాడు. గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్దిగా పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కూడా పోటీకి వెనుకడుగు వేస్తున్నారట.

ఎన్నికల ఖర్చు ఇస్తే ఆలోచిస్తాం..

మల్కాజిగిరిలో తన కొడుకు భద్రారెడ్డిని బరిలోకి దించుతానని.. నిన్న మొన్నటి వరకు చెప్పిన మాజీ మంత్రి మల్లారెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిసి.. తమ ఫ్యామిలీ నుంచి పోటీ చేయబోమని తేల్చి చెప్పేశారట. చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి తాను పోటీకి సిద్దంగా లేనని పార్టీకి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారట. ఇక వరంగల్‌, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌, భువనగిరి లాంటి నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, కానీ పార్టీయే ఖర్చులు భరించాలంటున్నారు నేతలు.

బీఆర్ ఎస్ కు గడ్డు రోజులు

ఇలాంటి పరిస్థితి వస్తుందని బీఆర్‌ఎస్‌ కలలో కూడా ఊహించి ఉండదు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు తొలిసారి ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది గులాబీ పార్టీ. దీనికితోడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొరొక్కరు రేవంత్‌ ఇంటికి క్యూ కడుతున్నారు. పార్టీలో ఉంటూనే మీకు తోడుగా ఉంటామని, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రేవంత్‌ను కలిసి వస్తున్నారు.

కేసీఆర్ సొంత జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు

మాజీ సీఎం కేసీఆర్‌ సొంత జిల్లా అయిన మెదక్‌ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇంటికి వెళ్లి కలిసొచ్చారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరకపోయినా.. ఆయన భార్య జెడ్పీ చైర్మన్‌ సునీతా రెడ్డి, తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు జెడ్పీ చైర్మన్‌ అనితారెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌, భద్రచాలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇటీవల రేవంత్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌ మాజీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌లు కాంగ్రెస్‌లోకి జంప్‌ అయ్యారు. వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి రేవంత్‌ను కలిశారు. రామగుండం, వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్‌ బాట పట్టారు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటిల్లో మెంబర్స్‌ అంతా జంప్ అవుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ప్రజలకు కొద్దిరోజుల్లోనే బీఆర్‌ఎస్‌ యాదికొస్తుందని పార్టీ శ్రేణులకు.. కేసీఆర్, కేటీఆర్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినా, కింద స్థాయి నుంచి పైస్థాయి వరకు తమ రాజకీయ భవిష్యత్తును చూసుకుంటూ కొంతమంది కాంగ్రెస్‌ బాట పడితే మరికొందరు బీజేపీ బాట పట్టారు.

సిట్టింగ్ సీట్లలో కూడా అభ్యర్థుల కరువు

జహీరాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ బిబి పాటిల్‌, నాగర్‌కర్నూల్‌ సిట్టింగ్‌ ఎంపీ రాములు ఆయన కొడుకు భరత్‌ కూడా కాషాయ కండువ కప్పుకోగా పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత కాంగ్రెస్‌లో చేరారు. దీంతో సిట్టింగ్ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ కొత్త అభ్యర్థులను వెతుక్కోవాల్సి వస్తోంది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ దెబ్బపడగా.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి ఊపిరిసలపనివ్వట్లేదు..! రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్‌ఎస్‌ నలిగిపోతోంది. జాతీయ పార్టీ అని టీఆర్‌ఎస్‌ను తీసేసి బీఆర్‌ఎస్‌ అని పెట్టుకుని అటు జాతీయ పార్టీకి ఇటు ప్రాంతీయ పార్టీకి కాకుండా పోయింది బీఆర్‌ఎస్‌. రెండు జాతీయ పార్టీల వ్యూహాలు ప్రతివ్యూహాల మధ్య ఇరుక్కుని విలవిలాడిపోతోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking