Take a fresh look at your lifestyle.

ఈటల రాజేందర్‌కు హైకమాండ్ కీలక బాధ్యతలు!

0 13

ఈటల రాజేందర్‌కు హైకమాండ్ కీలక బాధ్యతలు!

హైదరాబాద్ జూన్ 10 : తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయా..? అంతే అవునని సమాదానం వస్తుంది .ఈ క్రమం లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ పెద్దలు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, ఉద్యమాకారుడు అయిన ఈటల రాజేందర్‌కు హైకమాండ్ కీలక బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

బీజేపీ ప్రచార కమిటి చైర్మన్‌గా ఈటల పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలుందని తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో బీసీ నాయకత్వాన్ని సీఎం అభ్యర్థిగా బీజేపీ జనాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. అందుకే రాష్ట్ర బీజేపీలో ఇప్పుటికిప్పుడు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడికి పెద్ద పీట వేశామన్న భావన జనాల్లోకి పెద్దఎత్తున తీసుకెళ్లడానికి కూడా ఈటలకు ఈ పదవి ఇస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాదు.. ఈటలతో పాటు డీకే అరుణకు కూడా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

గత కొంత కాలంగా బీజేపీలో వివాదాలకు కేంద్ర బిందువుగా ఈటల మారారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. ఈయన రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కూడా వార్తలు గుప్పుమన్నాయి. అసలు బీజేపీలో ఈయన ఇమడలేకపోతున్నారని.. అతి త్వరలోనే భవిష్యత్తు కార్యాచారణ ప్రకటించి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో అసంతృప్తితో ఉన్న ఈటలను బీజేపీ పెద్దలకు ఢిల్లీకి పిలిపించుకున్నారు. శుక్రవారం నాడు తన ముఖ్య అనుచరులతో ఈటల అస్సోం వెళ్లారు. అస్సోం సీఎం హేమంత్ బిశ్వశర్మను కలిసి ఢిల్లీ వెళ్లారు ఈటల. అనంతరం హస్తినలో బీజేపీ అగ్రనేతలను రాజేందర్ కలుసుకున్నారు. ఇవాళ అంతా వరుస భేటీలతో ఈటల బిజిబిజీగా గడుపుతున్నారు.

ఇవాళ తెల్లారేలోపు లేదా శనివారం ఉదయం ‘బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్‌’ గా ఈటల పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఈటల తన ప్రధాన అనుచరులకు ఈటల సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈటల పేరు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ వినిపిస్తోంది.

మొత్తానికి చూస్తే.. బీజేపీలో ప్రచార కమిటీ ఒకటి ఉందని.. చైర్మన్ అని ఎక్కడా లేదు. అయితే కర్ణాటక కాంగ్రెస్‌లో ప్రచార కమిటీ కీలక పాత్ర పోషించింది. అందుకే ఈ ఫార్ములాను తెలంగాణలో బీజేపీ అమలుచేయబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈటలకు ఈ పోస్ట్ ఇవ్వడం నిజమే అయితే రాష్ట్ర బీజేపీలో మరోసారి పొలిటికల్ హీట్ పెరడం పక్కా.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీలో ఈటల-బండి వర్గాల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈటలకు ప్రమోషన్ ఇస్తున్నారంటే కచ్చితంగా మరోసారి రచ్చ రచ్చయ్యే ఛాన్స్ ఉంది. వీటన్నింటినీ ఢిల్లీ పెద్దలు ఎలా హ్యాండిల్ చేస్తారో ఏంటో మరి.

Leave A Reply

Your email address will not be published.

Breaking