Take a fresh look at your lifestyle.

ఆరు దశాబ్దాలు అలుపెరుగని పోరాటం : కేసీఆర్

0 14

ఆరు దశాబ్దాల పాటు అలుపెరుగని పోరాటం
   2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్బావం
అవరోధాలను అధిగమిస్తూ దేశంలోనే అత్యంత బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగాం
     ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపిడీకి గురైంది

– తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో ముఖ్య మంత్రి కెసిఆర్

హైదరాబాద్‌ జూన్ 2  : తెలంగాణ సమాజం ఆరు దశాబ్దాల పాటు అలుపెరుగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకుంది. ప్రజల ఆశయం జయించి, 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ఆవిర్భవించిన నాటి దృశ్యం గుర్తుచేసుకుంటే.. ఏ రంగంలో చూసినా విధ్వంసమే. అంతటా అలుముకున్నది గాఢాంధకారమే.

అస్పష్టతలను, అవరోధాలను అధిగమిస్తూ తెలంగాణ దేశంలోనే అత్యంత బలీయమైన ఆర్థికశక్తిగా ఎదగడం ఒక చారిత్రాత్మక విజయం.తెలంగాణ ఏయే రంగాలలో ధ్వంసం చేయబడిందో ఆ రంగాలన్నింటినీ మళ్లీ చక్కదిద్ది సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను ప్రభుత్వం నిజాయితీగా చేపట్టింది. సమైక్య పాలకులు అనుసరించిన వివక్షా పూరిత విధానాలను మార్చేయడానికి పూనుకున్నది. ‘తెలంగాణను పునరన్వేషించుకోవాలి, తెలంగాణను పునర్నిర్మించుకోవాలి’ అనే నినాదంతో ముందడుగు వేసింది.తెలంగాణ దృక్పథంతో నూతన విధానాలను రూపకల్పన చేసుకున్నది. తెలంగాణ ప్రజల తక్షణ అవసరాలు, వనరులు, వాస్తవాలు, అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా వివిధ చట్టాలు ప్రణాళికలు, మార్గదర్శకాలన్నింటినీ రూపొందించుకున్నాం.

ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపిడీకి గురైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని, మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు నివాళులు అర్పించారు.

ఒకసారి పోరాట చరిత్ర, అభివృద్ధి ప్రస్తానాన్ని తలచుకుందామని, భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందామన్నారు.‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభసందర్భంలో ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మనం స్వప్నించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏండ్ల పోరాట చరిత్రనీ, పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్నీ ఘనంగా తలుచుకుందాం. భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందాం.ప్రజల అభీష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్రాప్రాంతంతో కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ ప్రజలు తమ అసమ్మతిని నిరంతరం తెలియజేస్తూనే వచ్చారు. 1969లో ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైంది, దారుణమైన అణచివేతకు గురైంది.

1971 లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్ కు మద్దతుగా ప్రజాతీర్పు వెలువడినప్పటికీ.. దానిని ఆనాటి కేంద్ర ప్రభుత్వం గౌరవించలేదు. ఫలితంగా తెలంగాణ సమాజంలో నాడు తీవ్ర నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఉద్యమాన్ని రగిలించేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగినా.. నాయకత్వం మీద విశ్వాసం కలగకపోవడంవల్ల, సమైక్య పాలకుల కుట్రల వల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదు. 2001 వరకూ తెలంగాణలో నీరవ నిశ్శబ్దం రాజ్యమేలింది. ‘ఇంకెక్కడి తెలంగాణ’ అనే నిర్వేదం జనంలో అలుముకున్నది. ఆ నిర్వేదాన్ని, నిస్పృహని బద్దలు కొడుతూ 2001లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే చారిత్రాత్మక పాత్ర నాకు లభించినందుకు నా జీవితం ధన్యమైంది.

అహింసాయుతంగా.. శాంతియుత పంథాలో..

అహింసాయుతంగా, శాంతియుత పంథాలో వివేకం పునాదిగా, వ్యూహాత్మకంగా సాగిన మలిదశ ఉద్యమంలోకి క్రమక్రమంగా అన్ని వర్గాలు వచ్చి చేరాయి. ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మేధావులూ, విద్యావంతులూ, ఉద్యోగ ఉపాధ్యాయులూ, కవులూ, కళాకారులూ, కార్మికులూ, కర్షకులూ, విద్యార్ధులూ, మహిళలూ కులమత భేదాలకు అతీతంగా, సిద్ధాంతరాద్ధాంతాలకు తావివ్వకుండా ఏకోన్ముఖులై కదిలారు. వారందరికీ నేటి దశాబ్ది ఉత్సవ సందర్భంగా సవినయంగా తలవంచి నమస్కరిస్తున్నాను. స్వరాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన త్యాగధనులైన అమరులకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. 2014లో అధికారంలోకి వచ్చిన నాటినుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనసా వాచా కర్మణా అంకితమైంది.

ప్రతిరంగంలోనూ యావద్దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణ నేడు పదో వసంతంలో అడుగు పెట్టడం ఒక మైలురాయి. ఈ సందర్భంగా స్వరాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నేటినుంచి 21 రోజులపాటు ఈ ఉత్సవాలు వేడుకగా జరుగుతాయి. గ్రామస్థాయి నుంచి రాజధాని నగరం వరకూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని కోరుతున్నాను.అటు పోరాటంలోనూ, ఇటు ప్రగతి ప్రయాణంలోనూ ప్రజలు ప్రదర్శించిన అపూర్వమైన స్ఫూర్తినీ, అమరుల ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో చేసిన కృషినీ మననం చేసుకుందాం. దేశానికి దిక్సూచిగా నిలిచిన తెలంగాణ ప్రగతిని దశదిశలా చాటుదాం. భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకుందామన్నారు.

ఆ ఉక్కు సంకల్పాన్ని ఏ క్షణమూ విస్మరించలేదు..

2014 జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనొక వాగ్దానం చేశాను. తెలంగాణ రాష్ట్రాన్నిచూసి దేశం నేర్చుకొనే విధంగా, భారతదేశానికే తలమానికంగా ఉండే విధంగా తెలంగాణను తీర్చిదిద్దుతానని ఆనాడు నేను ప్రజలకు హామీ ఇచ్చాను. ఆ ఉక్కు సంకల్పాన్ని ఏ క్షణమూ విస్మరించలేదు. ఏమాత్రం చెదరనివ్వలేదు. తొమ్మిదేండ్ల అనతికాలంలోనే అనేక రంగాలలో మన తెలంగాణ దేశానికే స్ఫూర్తినిస్తున్న రాష్ట్రంగా అవతరించింది.తెలంగాణ ఉద్యమంలో ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణమైన అవగాహన ఉంది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వంవహించిన అనుభవం ప్రాతిపదికగా రాష్ట్ర ప్రజల ఆర్తిని ప్రతిబింబించే విధంగా మేనిఫెస్టోను రూపొందించుకొని చిత్తశుద్ధితో అమలు చేసింది.

ఇప్పుడిది నవీన తెలంగాణ..

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆనాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో ఒకసారి బేరీజు వేసుకొని చూస్తే, మనం సాధించిన ఆశ్చర్యకరమైన విజయాలు మన కళ్ళ ముందు కదలాడుతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ తొమ్మిదేళ్ళ వ్యవధిలో కరోనా మహమ్మారి వల్ల దాదాపు మూడేండ్ల కాలం వృధాగానే పోయింది. ఇక మిగిలిన ఆరేండ్ల స్వల్ప కాలంలోనే వాయువేగంతో రాష్ట్రం ప్రగతి శిఖరాలను అధిరోహించింది.ఇప్పుడు ఇది నవీన తెలంగాణ. నవనవోన్మేష తెలంగాణ. దేశంలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా తెలంగాణ మోడల్ అనే మాట మార్మోగుతున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి నమూనా మన్ననలందుకుంటున్నది. అనేక సవాళ్ళు, అవరోధాల మధ్య నెమ్మదిగా ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థానం నేడు పరుగులు తీస్తోందంటే, అందుకు అంకితభావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వోద్యోగులు, ప్రజా సహకారమే కారణమని సవినయంగా తెలియజేస్తున్నాను.

అభివృద్ధిని సాధించడమేకాదు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కూడా మన రాష్ట్రం నూతన ఒరవడిని దిద్దింది. మానవీయకోణంలో రూపొందించిన పథకాల పట్ల నేడు దేశమంతటా ఆదరణ వ్యక్తమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఆచరణీయంగా నిలవడమే కాదు, ఆయా రాష్ట్రాల ప్రజలు తమకు కూడా తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. మన రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు మన పథకాలపట్ల ఆకర్షితులై, తమ రాష్ట్రాలలో కూడా వీటిని అమలు చేస్తామని ప్రకటించినప్పుడు మనకు ఎంతో గర్వంగానూ ఆనందంగానూ అనిపిస్తున్నది.’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

మిషన్ భగీరథ ద్వారా నూటికి నూరు శాతం గృహాలకు నల్లాల ద్వారా శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధిచేసిన నీరు ఇవ్వలేకపోతే.. బిందెడు నీళ్ల కోసం మహిళలు పడే కడగండ్లను నివారించకుంటే, తాను ప్రజలను ఓట్లు అడగనని రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. తాను చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నట్లు చెప్పారు.

ప్రతీ ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు.‘దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్ అట్టడుగు స్థానంలో ఉండగా.. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ మూడోస్థానంలో ఉంది. మనం ప్రారంభించిన మిషన్ భగీరథను అనుకరిస్తూ కేంద్రప్రభుత్వం ‘హర్ ఘర్ జల్ యోజన’ అనే పథకాన్ని అమలుచేస్తోంది. కానీ, అదింకా నూటికి నూరుశాతం లక్ష్యాన్ని చేరుకోలేదు’ అని సీఎం అన్నారు.కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ భగీరథ నీటిని పరీక్షలు నిర్వహించి రూపొందించిన వాటర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం.. ఒక్క తెలంగాణలోనే 99.95 శాతం నల్లానీళ్లలో కలుషిత కారకాలు లేవని నిర్థారించిందని సీఎం ఈ సందర్భంగా తెలిపారు.

నేషనల్ వాటర్ మిషన్ అవార్డు, జల్ జీవన్ అవార్డులతో సహా, పలు అవార్డులు, ప్రశంసలు మిషన్ భగీరథకు లభించాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ‘మిషన్‌ భగీరథ పథకంతో నేడు తాగునీటి కోసం ప్రజలు మండుటెండలో బిందెలు నెత్తిన పెట్టుకొని మైళ్ళకుమైళ్ళ దూరం నడిచే దృశ్యాలు లేవు. ఖాళీ బిందెలతో ప్రజల ధర్నాలు లేవు. ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల ఫ్లోరోసిస్ బారినపడి ప్రజలు వికలాంగులుగా మారిన దృశ్యాలు మచ్చుకు కూడా నేడు కానరావు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా ఫ్లోరైడ్ బాధలు లేవన్నది కేంద్రంతో సహా అందరూ అంగీకరించిన వాస్తవం’ అని సీఎం వివరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking