Take a fresh look at your lifestyle.

కర్ణాటకలో మే 24కు ముందే ఎన్నికలు

0 167

మే 24కు ముందే ఎన్నికలు.. వెల్లడించిన సీఈసీ

బెంగళూరు మార్చ్ 11 : కర్ణాటక అసెంబ్లీ గడువు 2023 మే 24తో ముగియనుందని, ఈలోపుగానే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతను సమీక్షించేందుకు బెంగళూరు వచ్చిన రాజీవ్ కుమార్ శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడారు. 

సీనియర్ సిటిజన్లు, పీడబ్ల్యూడీ ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ స్టేషన్లలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తొలిసారి 80 ఏళ్లు పైబడిన 12.15 లక్షల మందికి, 5.55 లక్షల మంది బెంచ్‌మార్క్డ్ పీడబ్ల్యూడీ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు. కర్ణాటకలో 100 ఏళ్ల పైబడిన ఓటర్లు 17,000 మందికి పైగానే ఉన్నట్టు ఆయన తెలిపారు.

కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికలు 2018 మేలో జరిగాయి. ఎన్నికల అనంతరం జనతాదళ్ (సెక్యులర్), కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ తర్వాత పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌, జేడీఎస్ సభ్యులు పలువురు అసెంబ్లీకి రాజీనామా చేయడంతో కూటమి ప్రభుత్వం కుప్పకూలింది.

బీఎస్ యడియూరప్ప సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. 2021 జూలై 26న యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జూలై 28న బసవరాజ్ బొమ్మై సీఎంగా పగ్గాలు చేపట్టారు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 222 స్థానాలకు గాను బీజేపీ 104 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 78 సీట్లు సాధించింది జనతా దళ్ (సెక్యులర్) 37 సీట్లు కైవసంచేసుకుంది. కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ చెరో సీటు గెలుచుకున్నాయి. ఒక ఇండిపెండెంట్ సైతం గొలుపొందారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking