Take a fresh look at your lifestyle.

డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి ప్రస్థానం..

0 66

కష్ట పడ్డాడు..  సక్సెస్ అయ్యాడు..

  • డాక్టర్ లే శతృవులయ్యారు..

  • అవమానించిన చోటే గెలుపు..

  • ఆ ఇంట్లో అప్పట్లో ఒక్కరే.. నేడు నలుగురు వైద్యులు..

  • మల్టీపుల్ హాస్పిటల్ నెలకొల్పి..

  • వెలుగు స్వచ్ఛంద సంస్థతో పేదలకు వైద్య సేవలు..

  • ఇదీ డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి ప్రస్థానం

కష్టం వస్తే బాధ పడుతారు.. బాధలు వస్తే భయ పడుతారు.. సంతోషం వస్తే ఎగిరి గంతెస్తారు.. కానీ.. అతను మాత్రం అన్నిటినీ సమానంగా స్వీకరించారు. గిఫ్ట్ లుగా వచ్చిన అవమానాలను సవాల్ గా తీసుకున్నాడు. ఎక్కడైతే అవమాన పడ్డాడో అక్కడే తాను గెలిచి ఔరా అనిపించుకున్న డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి సక్సెస్ స్టోరీ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుంది.   

ఇష్టంతో కష్టపడితే సక్సెస్ సాధ్యం..

ఔను.. సక్సెస్ కావాలంటే కష్ట పడాలి.. ఇష్టంతో కష్ట పడాలి.. ఆ కష్టాన్ని అధిగమించినప్పుడే సక్సెస్ వంగీ సలాం చేస్తుంది. డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి జీవితం కూడా అంతే. కష్ట పడ్డాడు.. బాధ పడ్డాడు.. చివరకు మెడికల్ వైద్య, నర్సింగ్ వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందారు. పేదలకు వైద్య సేవలు అందించాలనే సంకల్పమే తన సక్సెస్ కు కారణమంటున్నారు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి.

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి – రాంచందర్ రెడ్డి దంపతులకు 6 మే 1955లో జన్మించారు పరమేశ్వర్ రెడ్డి. అతని తండ్రి రాంచందర్ రెడ్డి ఆర్మూర్ తహీశీల్ ఆఫీస్ లో రికార్డు అసిస్టెంట్ గా సుదీర్ఘ కాలం పాటు పని చేశారు. పరమేశ్వర్ రెడ్డి విద్యభ్యాసం అంతా ఆర్మూర్ లోనే సాగింది. విద్యార్థి దశలోనే అతనికి నాయకత్వ లక్షణాలు అధికం. అందుకే ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి 1970 – 71లో అడిసినల్ జాయింట్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు.

రోగుల బాధలను చూసి డాక్టర్ కావాలని..

ఆర్మూర్ ప్రాంతంలో బీమారి వస్తే చికిత్స అందించే వైద్యులు లేక పోవడంతో తాను డాక్టర్ ను కావాలని విద్యార్థి దశలోనే కలలు కన్నాడు పరమేశ్వర్ రెడ్డి. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు హోమియో మెడికల్ కాలేజీలో చేరారు. హోమియో (బీహెచ్ఎంఎస్) వైద్య విద్యనభ్యసిస్తునే కోఠి మెటర్నిటి హాస్పిటల్ లో గైనిక్ ఆప్షన్స్ తో లేడీస్ డెలివరీలలో నిష్ణాతులయ్యారు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి. నాలుగున్నరేళ్లు వైద్య విద్యను అభ్యసించిన అతను 1977లో (బీహెచ్ఎంఎస్) డాక్టర్ గా పట్టా తీసుకున్నారు.

దోస్త్ కోసం వేల్పూర్ కు..

డాక్టర్ పరమేశ్వర్ రెడ్డిని ఇప్పటికీ వేల్పూర్ డాక్టర్ గా పిలుస్తారు జనం. డాక్టర్ పట్టా చేతికి రాగానే మూడు వేల రూపాయలను తండ్రి రాంచందర్ రెడ్డి నుంచి తీసుకుని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కు వెళ్లాడు అతను. బాల్య మితృడు శ్యాం సుందర్ రెడ్డి (నిజామాబాద్ – మెడికల్ షాపు) కోరిక మేరకు వేల్పూర్ లో 1979లో ‘ప్రజా నర్సింగ్ హోం’ ఏర్పాటు చేశారు. చుట్టు పక్కల ముప్పై గ్రామాలకు ఒక్కరే డాక్టర్ కావడం వల్ల డెలివరీ కేసులు ఎక్కువగా చేసే వారు అతను. 14 ఏళ్లు అక్కడే వైద్య సేవలందించిన తాను ఐదు వేల డెలివరీలు చేయడం తనకు ఎంతో తృప్తినిచ్చిందంటున్నారు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి. 1981లో పద్మావతిని పెళ్లి చేసుకోవడంతో తన కష్టాలలో.. విజయాలలో షేర్ చేసుకోవడం ఈ సక్సెస్ కు కారణమంటారు అతను.

జిల్లాలో మొదటి మల్టీపుల్ హాస్పిటల్

ఆర్మూర్ లో 1993లో స్నేహితులతో కలిసి ‘శ్రీ సాయి హాస్పిటల్’ ఏర్పాటు చేసి దానికి ఎండీగా వ్యవహరించారు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి. జిల్లాలో మొదటి మల్టీపుల్ హాస్పిటల్ కావడం విశేషం. ఆ తరువాత 1996లో ఆర్మూర్ లోనే తానే సొంతంగా 100 పడకల తిరుమల నర్సింగ్ హోం నెలకొల్పారు. ఆత్మహత్య యత్నం, పాము కాటుల చికిత్స అందించడం వల్ల ఈ ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

డాక్టర్ లే శతృవులయ్యారు..

ఆర్మూర్ లో తిరుమల నర్సింగ్ హోం నెలకొల్పడంతో కొందరు వైద్యులు ఈర్ష్యంతో తనకు శతృవులయ్యారని నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి. హోమియోపతి డాక్టర్ నైనా తాను ఆసుపత్రిలో అల్లోపతి వైద్యం ఎలా చేస్తారని అవమానించిన వైద్యులు తలదించుకునే విధంగా తాను ఎదిగినట్లు చెప్పారు. ఆ అవమానంతోనే తన కూతురు ప్రియాంక, కుమారుడు ఆశిష్ రెడ్డిలను ఇద్దరిని ఎంబీబీఎస్ చదివించడం జీవితంలో తాను సాధించిన విజయాలలో ఒక్కటని వివరించారు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి. తన కుమారుడు దేశంలోనే అరుదైన ‘ఎండోక్రినాలాజీ’ ప్రత్యేక వైద్యుడిగా పట్టా తీసుకోవడం గర్వంగా ఉందంటున్నారు ఆయన.

వెలుగు స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు

ప్రజలకు ఉచితంగా వైద్య సేవలందించాలని నిర్ణయించారు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి. వెలుగు స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలలో ఉచిత వైద్య సేవలందించారు అతను. పుట్టిన మిట్టపల్లిలో.. వైద్య వృత్తిలో తనకు అండగా నిలిచిన వేల్పూర్ లో.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వేలాది మంది వృద్దులకు అన్నీ తానై ఉండాలనే కోరికను అంచెలంచెలుగా తీర్చుకుంటున్నట్లు పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2016లో తిరుమల సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్ ను నెల కొల్పారు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ యేతర ప్రాంతాలలో 16 మంది వైద్యులు, 150 నర్సులతో ఏర్పాటు చేసిన హాస్పిటల్ కావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందంటున్నారు ఆయన.  హాస్పిటల్ లో పని చేసే డాక్టర్ లు, నర్సుల వేతనాలే నెలకు 30 లక్షలు ఇచ్చానని చెబుతున్నారు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి.

ఆ ఇంట్లో నలుగురూ వైద్యులే..

ఒకప్పుడు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి ఇంట్లో ఒక్కరే వైద్యుడు. కానీ.. ఇప్పుడు కూతురు డాక్టర్ ప్రియాంక, అల్లుడు డాక్టర్ వినీల్, కుమారుడు డాక్టర్ ఆశిష్ రెడ్డి, కోడలు డాక్టర్ అభిషిక్తా నలుగురు వైద్యులున్నారు. డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి నెలకొల్పిన తిరుమల నర్సింగ్ కాలేజ్ లో విద్యనభ్యసించిన నర్సులు ప్రపంచలోని అమెరికా, లండన్, అస్ట్రేలియా, జర్మనీ విదేశాలతో పాటు గల్ఫ్ దేశాలలో వేలాది మంది పెద్ద పెద్ద వేతనాలతో స్థిర పడటం తనకు తృప్తిని ఇస్తుందంటున్నారు ఆయన. నర్సింగ్ అండ్ పారా మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి కొనసాగుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదటిది..

1997లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నర్సింగ్ కాలేజ్ ప్రకటన రాగానే 50 లక్షల కార్ఫస్ ఫండ్ చెల్లించడానికి ప్రముఖ కార్పోరేట్ హాస్పిటల్స్ కూడా ముందుకు రాలేదు.అప్పులు చేసి నర్సింగ్ కాలేజ్ ను గ్రామీణ ప్రాంతమైన ఆర్మూర్ లో ఏర్పాటు చేస్తే పిచ్చిలేసిందని తోటి వైద్యులే హేళన చేశారు. ఆ నర్సింగ్ కాలేజ్ లో మన వారికి అవగాహన లేక పోవడం వల్ల ఆరుగురు మాత్రమే చేరారు. కేరళ నుంచి చాలా మంది విద్యార్థులు చేరడంతో వేలాది మందికి నర్సింగ్ లో విద్యబోధన చేసి వారికి ఉపాధికి తోడ్పడినందుకు గర్వంగా ఉందంటున్నారు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి. నిజామాబాద్  (ధర్మారం)లో  తిరుమల మెడికల్ అకాడమీ ఏర్పాటు చేసి బీ ఫార్మాసీ, ఫిజియో థెరాపీ, బీఎస్సీ నర్సింగ్, ఎంఎల్ టీ, తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ (హైదరాబాద్, నిజామాబాద్) డెంటల్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడంతో తన కల నెరవేరిందంటున్నారు ఆయన.

కరోనా కాలంలో మరిచి పోలేని..

కరోనా కాలంలో తాను ప్రజలకు అందించిన వైద్యం జీవితంలో మరిచి పోలేని సంఘటనలంటున్నారు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా అక్సిజన్ కొరతతో కరోనా రోగులు ఇబ్బందులు పడుతుంటే తాను ముందుగా బుక్ చేసుకున్నందున రోజుకు మూడు వందల సిలిండరులు ఉపయోగించామన్నారు. కరోనా సమయంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించిన బంధువులే ఆ రోగి మరణిస్తే వదిలి పోవడం తనను కలిచి వేసిందంటున్నారు అతను. కరోనా పేషేంట్లు మరణిస్తే అనాధలుగా వదిలి వెళ్లి పోవడంతో తామే అంత్యక్రియలు నిర్వహించిన విషాదకర సంఘటనలు మరిచి పోలేనివన్నారు ఆయన. కరోనా కాలంలో ఏఐజీ కార్పొరేట్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కాల్ చేసి తనకు నర్సులు కావాలని అడిగితే 90 మందిని పంపినట్లు ఆయన వివరించారు.

కష్టాలకు కుంగి పోకుంటే సక్సెస్ సలాం..

కష్టాలు వచ్చినప్పుడు కుంగి పోవద్దంటున్నారు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని గుర్తించాలంటున్నారు ఆయన. వైద్య వృత్తిపై ఇష్టంతో ముందుకు వెళ్లడం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ వ్యవస్థలో తాను మొదటి వరుసలో ఉంటానని గర్వంగా చెబుతున్నారు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి.

మల్లేష్ యాటకర్ల

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking