Take a fresh look at your lifestyle.

బీజేపీ స్పీడ్ కు బ్రేక్ వేసిన కేసీఆర్ వ్యూహం

0 106

 టెన్త్ లీకేజీ కేసులో బీజేపీ 
ఎవడు  తవ్వుకున్న గుంతలో వాళ్లే.. 

హైదరాబాద్, ఏప్రిల్ 6, (వైడ్ న్యూస్)  దూకుడు మీద ఉన్న తెలంగాణ బీజేపీ  ఒక్క సారిగా బోల్తా పడినట్లయింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ.. ఇప్పుడు టెన్త్ పేపర్ల లీకేజీల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని చేసిన ప్రయత్నాలు వికటించాయి. ఇప్పుడు ఈ గందరగోళం అంతటికి తామే కారణం అనే నిందను మోయాల్సి వస్తోంది. సాక్షాత్తూ తెలంగాణ  బీజేపీ అధ్యక్షుడే టెన్త్ పేపర్ లీకేజీకి కుట్ర పన్నినట్లుగా పోలీసులు కేసు పెట్టేశారు.

ఇందులో సాక్ష్యాలు ఉన్నాయా … లేవా అన్న సంగతి పక్కన పెడితే.. ఈ వ్యవహారం బీజేపీకి ఇబ్బందికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎమ్మెల్యేలతో చేసిన బేరాల్లా ఇది రాజకీయం కాదు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన అంశం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉద్యోగ పరీక్షల విషయంలో పేపర్ లీకేజీ వ్యవహారం అనూహ్యంగా బయటకు వచ్చింది.

ఆ లీకేజీలు చిన్నవి కావని సిట్ ఏర్పాటుతోనే స్పష్టమయింది. అప్పట్నుంచి బీజేపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేసుకుని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వాటికి ఆధారాలివ్వాలని సిట్ ద్వారా ఆయనకు నోటీసులు పంపించారు. కానీ ఆయన హాజరు కాలేదు. అదే సమయంలో టెన్త్ పశ్నాపత్రాలు పరీక్ష ప్రారంభమైన వెంటనే బయటకు వస్తూండటంతో ఆయన మరింత రాజకీయం చేశారు.

అసలు పరీక్షల్ని పెట్టడం చేత కాని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆ ప్రశ్నాపత్రాల లీకేజీలో తానే ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. రాజకీయాల్లో ఎప్పుడేమీ జరుగుతుందో చెప్పడం కష్డం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి  సంజయ్… తాను అధ్యక్ష బాధ్యతను చేపట్టినప్పటి నుండి కేసీఆర్ ను జైలుకు పంపుతాం.. కవిత కోసం ఢిల్లీలో జైలు రెడీ చేశామని ప్రకటనలు చేస్తూ ఉండేవారు.

అయితే అవన్నీ జరగలేదు కానీ..ఆయన మాత్రం జైలుకె్ళ్లిపోతున్నారు. మధ్యలో ఓసారి అరెస్ట్ అయి జైలుకెళ్లినా అది రాజకీయ పోరాటంగా మిగిలింది. కానీ ఇప్పుడు మాత్రం … టెన్త్ పేపర్ లీకేజీ కేసులో మరక పడింది. ఆయన రిమాండ్ రిజెక్ట్ చేయడానికి మెజిస్ట్రేట్ కూడా అంగీకరించలేదు. దీంతో   జైలుకు వెళ్లకతప్పలేదు.   నిజానికి ఈ కేసులో బండి సంజయ్ ప్రమేయం ఉందని చెప్పడానికి పోలీసులు చూపించిన ఒకే ఒక్క కారణం నిందితుడు ప్రశాంత్ బండి సంజయ్‌కు ఫోన్ చేయడమే. ఆయన మాజీ జర్నలిస్టు. చాలా మంది రాజకీయ నేతలతో సంబంధాలు ఉంటాయి. ఆయన పేపర్‌ను .. ఓ మీడియా గ్రూపుతో పాటు పలువురు బీజేపీ నేతలకు షేర్ చేశారు. అలా షేర్ చేసిన వారిలో ఈటల , బండి సంజయ్ ఉన్నారు.

ఈటలకు కాల్ చేయలేదు. కానీ సంజయ్ కు ఫోన్ చేశారు. దీంతో ఆయనే కుట్ర చేశారని పోలీసులు ఏ- 1 గా పెట్టారు. ఇది కుట్ర అని కిషన్ రెడ్డి అత్యవసరంగా మీడియా సమావేశం పెట్టి ఎదురుదాడి చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రభుత్వంపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో వ్యతిరేకత పెంచడానికి ఈ పేపర్ల లీకులు బాగా ఉపయోగపడతాయని విపక్షాలు అనుకోవడం సహజం.

అయితే వారిని కట్టడి చేయడానికి అధికార పార్టీ కూడా ప్రయత్నిస్తుందని ఈ విషయంలో వారికి దొరికిపోకూడదని జాగ్రత్తగా ఉండలేపోయారు. నిజంగా పేపర్ లీకేజీ చేయాలని బండి సంజయ్‌కు ఉండకపోవచ్చు. కానీ ఇలా బయటకు వచ్చిన పేపర్లతో వీలైనంత ఎక్కువగా రాజకీయం చేయాలనుకున్నారు. అక్కడే ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పోలీసులు బండి సంజయ్ కుట్ర చేశారని నిరూపించలేకపోయినా బీజేపీకి బండి సంజయ్‌కు జరిగిన నష్టం మాత్రం అలాగే ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking