Take a fresh look at your lifestyle.

అదానీ గ్రూప్ కు ఇచ్చిన రుణాల వివరాలను..

0 53

అదానీ గ్రూప్ కు ఇచ్చిన రుణాల వివరాలను తెలియజేయాలి
అన్ని బ్యాంకులను కోరిన భారతీయ రిజర్వు బ్యాంక్

ముంబై ఫిబ్రవరి 3 : అదానీ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాల వివరాలను తెలియజేయాలని భారతీయ రిజర్వు బ్యాంక్ అన్ని బ్యాంకులను కోరింది. ఈ గ్రూప్ కంపెనీల క్యుములేటివ్ మార్కెట్ వాల్యుయేషన్‌లో 100 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోవడంతో ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయాన్ని ప్రభుత్వ, బ్యాంకింగ్ వర్గాలు ధ్రువీకరించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది.

అయితే ఆర్బీఐ అధికారికంగా దీనిపై స్పందించలేదు.ఈ కంపెనీల యజమాని గౌతమ్ అదానీ పెట్టుబడిదారుల్లో ఆందోళనను తగ్గించేందుకు ఓ వీడియో స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు. అయినప్పటికీ, స్టాక్‌ మార్కెట్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం గురువారం కూడా కొనసాగింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ సెకండరీ షేర్ సేల్ ను ఉపసంహరించుకున్న తర్వాత ఈ గ్రూపులోని అత్యధిక లిస్టెడ్ కంపెనీలు 5 శాతం, 10 శాతం పతనమై, లోయర్ సర్క్యూట్స్‌ను తాకాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 8 శాతం మేరకు పతనమైంది. అదానీ పోర్ట్స్, ఎస్ఈజెడ్ 3 శాతానికి పైగా పతనమయ్యాయి. మిగిలిన అన్ని లిస్టెడ్ కంపెనీలు – అదానీ విల్మర్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ – లోయర్ సర్క్యూట్స్‌ను తాకాయి. ఎన్‌డీటీవీ కూడా ప్రారంభంలో లోయర్ సర్క్యూట్‌ను తాకింది.

అదానీ యాజమాన్యంలోని అంబుజ, ఏసీసీ మాత్రం ఈ ట్రెండ్‌కు విరుద్ధంగా 1-5 శాతం మేరకు పెరిగాయి.అమెరికన్ షార్ట్ సెల్లర్ ఫర్మ్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గత వారం విడుదల చేసిన నివేదిక అదానీ గ్రూప్‌ను పతనం చేసింది. ఈ గ్రూప్ అప్పులు విపరీతంగా ఉన్నాయని, స్టాక్ మేనిప్యులేషన్ జరుగుతోందని, పన్నుల చెల్లింపులో అక్రమాలకు పాల్పడుతోందని ఈ నివేదిక ఆరోపించింది.ఈ నివేదికను తోసిపుచ్చుతూ అదానీ గ్రూప్ చాలా స్టేట్‌మెంట్లను జారీ చేసింది. వీటితోపాటు హిండెన్‌బర్గ్ ప్రశ్నలకు స్పందనను 413 పేజీల్లో విడుదల చేసింది.

మరోవైపు అదానీ గ్రూప్ స్టాక్స్ కుప్పకూలడంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) పరిశీలన ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ విధంగా నియంత్రణ సంస్థల నిఘా పెరగడంతో అదానీ గ్రూప్ సమీప భవిష్యత్తులో తీవ్ర ఒత్తిళ్ళకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking