Take a fresh look at your lifestyle.

ధరణి పోర్టల్ పై సీఎం మాటలు పచ్చి అబద్దాలు : షర్మిల

0 15

ధరణి పోర్టల్ పై సీఎం మాటలు పచ్చి అబద్దాలు

– రెవెన్యూ వ్యవస్థలో కొత్త సమస్యలకు సృష్టికర్త కేసీఆర్

– వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల

హైదరాబాద్, జూన్ 10 : కొండ నాలుకకు మందెయ్యబోతే ఉన్న నాలుక ఊడిందనే సామెత లెక్కనే ఉంది కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి వెబ్ సైట్. ఎన్నికలు సమీపించే సరికి బయటకు వచ్చిన కుంభకర్ణుడు ధరణి వెబ్ సైట్ పై మాయ మాటలు చెప్తున్నాడు. ఉంచాల్నా.. తీసెయ్యాల్నా అంటూ రెచ్చగొట్టే మాటలు చెప్తున్నాడఅని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు.

భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యిందట.. 99 శాతం రైతులకు మేలు జరిగిందట.. దళారి,పైరవీకారుల వ్యవస్థ బంద్ అయ్యిందని,తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పిందని వేదాలు వల్లిస్తున్నాడు. మళ్లీ అధికారం ఇవ్వకపోతే ధరణిని ఆపేస్తారని, అప్పుడు రైతుబంధు,రైతుబీమా రాదంటూ అబద్దాలను అందంగా వర్ణిస్తున్నాడు. వాస్తవానికి ధరణి పేరు చెప్పి పేదల భూములను మళ్లీ దొరలపరం జేస్తున్నాడు. వేల ఎకరాలను కావాల్సిన వాళ్లకు కట్టబెడుతున్నాడు.

రైతుబంధు, రైతుబీమా పథకాలు మొదలైన రెండేండ్ల తర్వాత ధరణి వచ్చింది. మరి ఆ రెండేండ్లు రైతుబంధు, రైతుబీమా ప్రజలకు అందలేదా? తెలంగాణలో సగం గ్రామీణ కుటుంబాలకు భూమే లేకపోగా, భూమి ఉన్న వారిది గుంటకో సమస్య. ధరణి రాకముందు గ్రామంలో 10 సమస్యలుంటే ఇప్పుడవి 150 అయినయి. 2014 కంటే ఈ 9 ఏళ్లలోనే కేసీఆర్ తెచ్చిన ధరణి పుణ్యాన భూ సమస్యలు వెయ్యి రెట్లు పెరిగాయి. గత ప్రభుత్వాలు ఇచ్చిన పట్టా పాసుబుక్కులకు కలర్లు మార్చి ఇచ్చారు తప్పితే ధరణితో కొత్తగా ఒరిగిందేమి లేదు. పైగా పక్కా పారదర్శకంగా ఉన్న రైతుల భూములను వివాదస్పద జాబితాలోకి నెట్టివేశారు.

వందేళ్ల నుంచి సాగు చేసుకుంటున్నభూములపై హక్కులు లేవని.. అవి వివాదాస్పద భూములని కొత్త రికార్డులు తెచ్చారు. ప్రతీ సోమవారం జిల్లాల కలెక్టరేట్లలో జరిగి ప్రజావాణికి వచ్చే సమస్యల్లో 90 శాతం ధరణి సమస్యలే ఉంటున్నాయ షర్మిల అన్నారు.. ధరణి సర్వర్ భద్రత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రైవేటు కంపెనీ చేతిలో పెట్టారు. ధరణి డీపీఆర్ ఎవరు రెడీ చేశారు? ఎక్కడుంది? దేనీ ఆధారంగా చేశారో ఇప్పటి వరకు బయటపెట్టలేదు. 50 రకాల భూ సమస్యలపై 20 లక్షల మంది రైతులు అర్జీలు పెట్టుకుంటే.. పరిష్కరించే దిక్కు లేదు. స్వయంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసినా పట్టింపు లేదు. 20 రకాల సమస్యలు ఉన్నాయని 2 లక్షల మంది కోర్టు మెట్లు ఎక్కినా ధరణిలో లోపాలు లేవని కేసీఆర్ గారు చెప్పడం హాస్యాస్పదం.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking