Take a fresh look at your lifestyle.

సమాజంలో మార్పు కోసం అంబేద్కర్ భావజాలం

0 76

సమాజంలో మార్పు కోసం అంబేద్కర్ భావజాలం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ 

హైదరాబాద్, ఏప్రిల్ 14, : హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున హుస్సేన్ సాగ‌ర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్‌తో క‌లిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల వ‌ర్షం కురిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడారు. దేశంలోనే అత్యంత భారీ విగ్రహం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు ధన్యవాదాలు చెప్పారు. అంబేద్కర్ కలలుగన్న ఆశయాలు సాధించినప్పుడే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు.

సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు అంబేద్కర్ భావాజాలం అవసరమని అభిప్రాయపడ్డారు.రూపాయి సమస్యపై 1923లోనే అంబేద్కర్ పరిశోధన పత్రం రాశారని గుర్తుచేశారు. తెలంగాణలో దళితుల అభివృద్ధికి తీసుకొచ్చిన దళిబంధు పథకం ఎంతో గొప్పదని కొనియాడారు. నిమ్న వర్గాల ఉన్నతి కోసమే అంబేద్కర్ పరితపించారని అన్నారు. అలాంటి మార్గాన్నే ఇవాళ దేశంలో కేసీఆర్ ఎంచుకున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణతో కేసీఆర్ కొత్త శకానికి నాంది పలికారని తెలిపారు.

పొట్టి శ్రీరాములు బలిదానంతో అంబేద్కర్ చలించిపోయారని, అందుకే రాష్ట్రాల ఏర్పాటు కోసం స్పష్టమైన విధానాన్ని రూపొందించారని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిందని అన్నారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించిన తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి వైపు విజయవంతంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు. అంతేగాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థను బలపర్చేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఆయనతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముందుకు రావాలని సూచించారు.

బీఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికీ ఆదర్శం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలంగాణ సీఎస్ శాంతికుమారి అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని రూ.146 కోట్లతో నిర్మించి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరింపచేసుకోవడం గొప్ప విషయం అన్నారు. ఓ అధికారిగా ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. బోధించు.. సమీకరించు.. పోరాడు అన్న అంబేద్కర్ సూక్తి ప్రతి ఒక్కరికీ ఆచరణీయమన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని సీఎస్ అన్నారు. ఇక సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని, అలాగే రైతు బంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్ వంటి అనేక స్కీములతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్లుతున్నారని అన్నారు. బౌద్ధభిక్షువులకు సీఎస్ ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking