Take a fresh look at your lifestyle.

‘కాళేశ్వరం’పై కాగ్‌ రిపోర్టు కళ్లు బైర్లు కమ్మేలా అక్రమాలు

0 24

బాప్‌రే.. అంతా అవినీతే!

‘కాళేశ్వరం’పై కాగ్‌ రిపోర్టు
కళ్లు బైర్లు కమ్మేలా అక్రమాలు
గంపగుత్తగా కాంట్రాక్టర్లకు పనులు
ఒకే కంపెనీకి అధిక భాగం కేటాయింపులు
కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నిర్ధారణ
168 పేజీలతో డ్రాఫ్ట్‌ నివేదిక

(వయ్యామ్మెస్ ఉదయశ్రీ)

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం.. ఆశ్చర్యకరమైన రీతిలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయం.. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని స్వయంగా కాగ్‌ ఎండగట్టింది.

కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్‌ పాలకులకు ఏటీఎం మిషన్‌ గా మారిందనడానికి కాగ్‌ నివేదికే నిలువెత్తు సాక్ష్యం. ఇప్పుడు కాళేశ్వరం అవినీతి అఫీషియల్‌ గా నిజమని నిర్ధారనైంది. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ తన 168 పేజీల డ్రాఫ్ట్‌ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలను పేర్కొంది.

సీడబ్ల్యూసీ సూచనలకు విరుద్ధంగా 2019 జూన్‌ నుంచి 2020 ఫిబ్రవరి మధ్య కాలంలో మూడో టీఎంసీని ఎత్తిపోసే మోటార్లు, పంపులను సమకూర్చాలంటూ రూ.28వేల151 కోట్ల కాంట్రాక్టును నిర్మాణ సంస్థలకు ఇచ్చారని కాగ్‌ పేర్కొంది. దీనికి ఏ మాత్రం శాస్త్రీయత, సహేతుకత కానీ లేదని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయినా నిర్మాణవ్యయం మాత్రం భారీగా పెరిగినట్లు కాగ్‌ గుర్తించింది. ఈ మూడో టీఎంసీ నిర్మాణ ప్యాకేజీల్లో అత్యధిక భాగాన్ని ఒకే కంపెనీ దక్కించుకోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఇఫ్పుడు కాళేశ్వరం అవినీతి మొత్తం ఆ కంపెనీ చుట్టే తిరుగుతోంది.

రూ.లక్షా రెండు వేల కోట్లకు వ్యయం..

అవసరం లేకపోయినా చేపట్టిన వివిధ పనుల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం లక్షా రెండు వేల కోట్ల రూపాయలకు చేరిందని కాగ్‌ నివేదికలో పేర్కొంది. అయితే డీపీఆర్‌ లో మాత్రం ప్రాజెక్టు వ్యయం కేవలం 63 వేల కోట్లుగానే నిర్ధారించారు.

అవసరం లేని పనుల వల్లే ప్రాజెక్టు వ్యయం భారీగా పెంచారని కాగ్‌ గుర్తించింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం లక్షా 49 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని కాగ్‌ రిపోర్టులో పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో 73 శాతం వరకు రుణాల రూపంలోనే ప్రభుత్వం సమకూర్చుకుందని కాగ్‌ తన రిపోర్టులో వెల్లడించింది.

వివిధ సంస్థలకు కాంట్రాక్టులు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వివిధ దశల్లో మొత్తం 56 వర్క్‌ కాంట్రాక్టులను వివిధ సంస్థలకు ఇచ్చారు. ఇందులో ఇపీసీ ప్రాతిపదికన ఇచ్చిన 17 పనుల విలువ 30 వేల కోట్ల రూపాయలు మాత్రమే. మిగిలిన 39 పనులను గంపగుత్తగా యూనిట్‌ ప్రైస్‌ ప్రాతిపదికన ఇచ్చేశారు. దీని విలువ ఏకంగా 52 వేల కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

యూనిట్‌ ప్రైస్‌ ప్రాతిపదికగా ఇచ్చిన పనులకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇరిగేషన్‌ శాఖ వెల్లడించలేదని కాగ్‌ పేర్కొంది. ఇక ఈ మొత్తం కాంట్రాక్టుల్లో 21 కాంట్రాక్టులు లిఫ్ట్‌ పంపుసెట్ల సరఫరాకు సంబధించినవే కాగాం ఇందులో అత్యధిక భాగం పనులను ఒకే సంస్థ దక్కించుకుంది. ఇందులోని నాలుగు ప్యాకేజీల్లో పంపుసెట్లకు సంబంధించి అయా కాంట్రాక్టర్లకు ప్రభుత్వరంగ బీహెచ్‌ఈఎల్‌ సంస్థ సరఫరా చేసిన ధరలకి, ప్రభుత్వం చెల్లించిన ధరకు మధ్య 300 శాతం వ్యత్యాసం ఉండటాన్ని కాగ్‌ ఆక్షేపించింది.

బిల్లులు చెల్లించే ముందు ఆయా కాంట్రాక్టుర్లు వివిధ సంస్థల నుండి కొనుగోలు చేసిన ఎక్విప్మెంట్‌ ఇన్వాయిస్‌ లను ఇరిగేషన్‌ శాఖ అధికారులు అసలు పరిశీలించారా..లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఓ వైపు ఇరిగేషన్‌ కార్యాలయాలపై విజిలెన్స్‌ దాడులు జరుగుతుండటం మరోవైపు కాళేశ్వరంపై ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తుండటం ఆసక్తిరేపుతోంది.

ఇప్పటికే మూడు బ్యారేజీల నిర్మాణాల్లో అవకతవకలపై జ్యూడిషియల్‌ విచారణకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వంంతాజాగా ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking