Take a fresh look at your lifestyle.

బిహార్ లో అల్లర్లు చేసే వారి భరతం పడుతాం

0 99

భాజపా అధికారంలోకి రాగానే

హింసకు పాల్పడిన వారి భరతం పడుతాం.

  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరిక

బిహార్, ఏప్రిల్ 3 (వైడ్ న్యూస్ ) భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే.. రాష్ట్రంలో హింసకు పాల్పడిన వారందరినీ తలకిందులుగా వేలాడదీస్తామని కేంద్ర హోంమంత్రి అమితా హెచ్చరించారు. బిహార్లోని పలు జిల్లాల్లో ఇటీవల రామనవమి సందర్భంగా తలెత్తిన అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అమిత్ షా బిహార్ పర్యటించారు. నవాదాలో ఓ బహిరంగ సభలో మాట్లాడారు. “అశోకచక్రవర్తి జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు నేను సాసారామ్ వెళ్లాలి.

కానీ అక్కడ మనుషులు చనిపోతున్నారు. తుపాకులు మోగుతున్నాయి. అందుకే వెళ్లలేకపోయా. ఇందుకు ప్రజలకు క్షమాపణ చెబుతున్నా, మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అల్లర్లకు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీసి సరిచేస్తాం” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నీతీశ్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవినీతి, అరాచకాలకు మారుపేరైన ఈ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని అన్నారు. బిహార్లో 40 లోక్ సభ స్థానాలనూ తామే గెలుచుకుంటామని చెప్పారు.

లాలూ, నీతీశ్ కలలు కల్లలే..

తన తనయుడు తేజస్వీ యాదవ్ ను బిహార్ సీఎంగా లాలూ ప్రసాద్ యాదవ్ చూడాలనుకుంటున్నారని, అలాగే నీతీశ్ కూడా దేశ ప్రధాని అవుతానన్న తప్పుడు భావనలో ఉన్నారని.. వీరిద్దరి కలలూ నెరవేరవని అమిత్ షా తెలిపారు. “నీతీశ్ దేశ ప్రధానైతే బిహార్కు తన తనయుడు ముఖ్యమంత్రి అవుతాడని లాలూ భావిస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే దేశ ప్రధాని పదవి ఖాళీగా లేదు. అక్కడ మూడోసారి మోదీయే ప్రధాని అవుతారు” అని షా పేర్కొన్నారు. మళ్లీ నీతిశ్ను ఎన్డీఏలోకి తీసుకోబోమని కూడా ఈ సందర్భంగా షా స్పష్టం చేశారు. పర్యటనకు బయల్దేరేముందు అమిత్ షా.. బిహార్లో జరుగుతున్న మత ఘర్షణలపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking