Take a fresh look at your lifestyle.

వేద మంత్రోచ్ఛారణలతో భద్రాద్రి రాముడి కళ్యాణం

0 112

వేద మంత్రోచ్ఛారణల మద్య 

భద్రాద్రి రాముడి కళ్యాణం

భద్రాచలం మార్చి 30  (వైడ్ న్యూస్) ‘శ్రీరామ.. జయ రామ.. జయ జయ రామ..’ అని భక్తుల హర్షధ్వానాల నడుమ.. పండితుల వేద మంత్రోచ్ఛారణలు.. మంగళ వాద్యాల ప్రతిధ్వనుల మధ్య భద్రాచలంలోని మిథిలా ప్రాంగణంలో అభిజిత్‌ ముహూర్తాన శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

గురువారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాతసేవ అనంతరం భక్తుల కోలాహలం ప్రారంభమైంది.  అనంతరం నివేదన, షాత్తుమురై, మూలవరులకు అభిషేకం నిర్వహించారు. మంగళశాసనాలు పఠించారు. గర్భగుడిలోని మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేపట్టారు.భక్తుల కోలాహలం, మంగళవాద్యాలు, కోలాట నృత్యాల నడుమ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి తీసుకువచ్చారు.

స్టేడియంలోని కల్యాణ పీఠంపై ఉత్సవమూర్తులను ఉంచి రామయ్య గుణగణాలు, సీతమ్మ అణకువ, అంద చందాలను వర్ణించారు. భక్త రామదాసు సీతారాముల కోసం చేయించిన ఆభరణాలు, ఆలయ క్షేత్ర ప్రాశస్త్యం, కల్యాణ మహోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. అభిజిత్‌ ముహూర్తాన అర్చకులు సీతారాముల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచారు.

సీతమ్మకు మాంగళ్యధారణ చేశారు. సీతారాములను వధూవరులుగా చూసి భక్తులు తరించారు. సీతా రామచంద్రులకు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.తొలుత భద్రాద్రి రామునికి దేవాలయంలో ద్రువమూర్తుల కల్యాణం చేశారు.

తరువాత మంగళవాయిద్యాలు మార్మోగుతుండగా.. భక్తుల జయజయ ధ్వానాల మధ్య పల్లకీలో కల్యాణ మండపానికి స్వామివారు తరలివచ్చారు. ముందుగా తిరుకల్యాణానికి సంకల్పం చేసి సర్వ విజ్ఞాన శాంతి కోసం విశ్వక్సేన పూజ నిర్వహించారు. విష్ణు సంబంధమైన అన్ని పూజా శుభ కార్యక్రమాలకు విశ్వక్సేణుడి పూజ చేయడం ఆనవాయితీ. ఈ తంతు జరిగాక పుణ్యహవచనం చేశారు. మంత్ర పూజల్లో కల్యాణానికి వినియోగించే సకల సామాగ్రికి ప్రోక్షణ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking