Take a fresh look at your lifestyle.

మోదీని 2002 నుంచి బీబీసీ వెంటాడుతోంది

0 355

మోదీని 2002 నుంచి బీబీసీ వెంటాడుతోంది : అమిత్ షా

న్యూఢిల్లీ ఫిబ్రవరి 14: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ 2002 నుంచి వెంటాడుతోందని కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా చెప్పారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అదానీ-హిండెన్‌బర్గ్ నివేదిక మోదీ-బీబీసీ డాక్యుమెంటరీ వివాదాలపై స్పందించారు.

ఏదైనా అంశంపై వేలాది కుట్రలు జరిగినప్పటికీ సత్యం కచ్చితంగా వెలుగులోకి వస్తుందని అమిత్ షా చెప్పారు. వారు(బీబీసీ) 2002 నుంచి మోదీని వెంటాడుతున్నారని, అయితే మోదీ ప్రతిసారీ మరింత బలపడి, మరింత ప్రజాదరణను పొందుతున్నారని తెలిపారు.

నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో (2002లో) గుజరాత్‌లో జరిగిన హింసాకాండపై దేశవిదేశాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ హింసాకాండకు సంబంధించిన అంశాలతో డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీని భారత దేశంలో అధికారికంగా ప్రసారం చేయలేదు. సామాజిక మాధ్యమాల్లో దీనిని ప్రసారం చేయవద్దని, దీనికి సంబంధించిన ట్వీట్లను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం జనవరి 21న ఆదేశించింది. ఇది కేవలం ప్రచారాస్త్రమని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది.

ఈ డాక్యుమెంటరీపై నిషేధం విధించడాన్ని ప్రతిపక్షాలు నిరసించాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఈ డాక్యుమెంటరీని సమర్థించారు. సత్యం ప్రకాశిస్తుందని తెలిపారు. వెలుగులోకి వచ్చే దురలవాటు సత్యానికి ఉందన్నారు. నిషేధాలు, అణచివేతలు, బెదిరింపులు వంటివేవీ సత్యం బయటపడకుండా, దానిని కప్పిపెట్టి ఉంచలేవన్నారు.

అదానీ గ్రూప్‌పై హిండెన్‌‌బర్గ్ నివేదిక దేశవిదేశాల్లో అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత లేదా న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్, టీఎంసీ, బీఆర్ఎస్ వంటి ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వల్లే గౌతమ్ అదానీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందారని ఆరోపించారు. ఆయన ప్రసంగంలోని కొన్ని భాగాలను రికార్డుల నుంచి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తొలగించారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసును కూడా జారీ చేశారు.

ఈ వివాదంపై అమిత్ షా స్పందిస్తూ, ప్రభుత్వం దాచవలసినది ఏమీ లేదన్నారు. ప్రస్తుతం దీనిని సుప్రీంకోర్టు విచారిస్తోందని, ఈ సమయంలో దీనిపై తాను మాట్లాడటం ఓ మంత్రిగా తనకు సరికాదని అన్నారు. అయితే ఈ విషయంలో దాచడానికేమీ లేదని, భయపడవలసినదేమీ లేదని తెలిపారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడాలని అనుకుంటున్నారో ఆయన లేదా ఆయన ప్రసంగాలను రాసేవారు ఆలోచించుకోవాలన్నారు. బీజేపీ క్రోనీ కేపిటలిజానికి పాల్పడుతోందని గాంధీ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, ఇప్పటి వరకు బీజేపీపై ఇటువంటి ఆరోపణలను ఎవరూ చేయలేదన్నారు. కాంగ్రెస్ పాలనా కాలంలో జరిగిన అవినీతిపై కాగ్ సీబీఐ కేసులను నమోదు చేశాయన్నారు.

డాక్యుమెంటరీపై కేంద్రం నిషేధం

గుజరాత్ అల్లర్లు, మోదీ పాత్రపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రసారం చేయవద్దని జనవరి 21న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రకారం ఈ అత్యవసర ఆదేశాలను జారీ చేసింది. యూట్యూబ్, ట్విటర్ల నుంచి ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులు, వీడియోలను తొలగించాలని ఆదేశించింది. ఈ డాక్యుమెంటరీ నిష్పక్షపాతంగా లేదని పేర్కొంది. వలసవాద ఆలోచనా ధోరణి కనిపించిందని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking