Take a fresh look at your lifestyle.

జాతీయ స్థాయి పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ

0 69

జాతీయ స్థాయి ఆద్మీ పార్టీ గుర్తింపు పట్ల కేజ్రీవాల్  హర్షం

న్యూఢిల్లీ ఏప్రిల్ 11 (వైడ్ న్యూస్) స్వల్ప కాలంలోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించడం అద్భుతమని ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. దేశంలోని కోట్లాది మంది ప్రజల ఆశలు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల విశ్వాసంగా మారాయన్నారు. ప్రజలు తమకు పెద్ద బాధ్యతను ఇచ్చారని తెలిపారు.

దేవుని ఆశీర్వాదంతో ఈ బాధ్యతను నిజాయితీగా నిర్వహిస్తామని చెప్పారు.ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ గుర్తింపును ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కేజ్రీవాల్ సంబరాలు చేసుకున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, జాతి వ్యతిరేక శక్తులతో పోరాడుతున్నందుకు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశ ప్రగతిని అడ్డుకోవాలని కోరుకునే దేశ వ్యతిరేక శక్తులంతా ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకమని చెప్పారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జైలులో ఉన్న ఆ పార్టీ నేతలు సత్యేందర్ జైన్, మనీశ్ సిసోడియాలను గుర్తు చేశారు. జైలుకు వెళ్లడానికి భయపడేవారు పార్టీని వదిలిపెట్టాలన్నారు. భారత దేశాన్ని ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు తమ పార్టీలో చేరాలని ప్రజలను కోరారు.

తమకు దేవుని మద్దతు ఉందన్నారు. నిఖార్సయిన నిజాయితీ, దేశభక్తి, మానవత్వం తమ పార్టీకి మూడు స్తంభాలని చెప్పారు.కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్ & అలాంట్‌మెంట్) ఆర్డర్, 1968లోని పారా 6 ప్రకారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్సీపీ,సీపీఐ,టీఎంసీ పార్టీలు జాతీయ హోదాను కోల్పోయాయని ప్రకటించింది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కి జాతీయ హోదాను ప్రకటించింది. మరోవైపు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా ప్రకటించిన కేసీఆర్‌కు ఈసీ షాకిచ్చింది.

ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును తొలగించింది. బీఆర్ఎస్ తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీగా కొనసాగుతుందని ఈసీ వెల్లడించింది.కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాభారత్‌కు స్వాతంత్ర్యం రాకముందే ఏర్పాటైంది. 1964లో సీపీఐ, సీపీఐ(ఎం) విడిపోయాయి. ఆ తర్వాత సీపీఐ(ఎం) పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళలో అధికారంలోకి రాగలింది. అయితే సీపీఐకి మాత్రం కొన్ని రాష్ట్రాల్లో ఉనికి ఉంది. సీపీఐ క్రమంగా ప్రాభవం కోల్పోయి చివరకు జాతీయ పార్టీ హోదాను కోల్పోయింది. సీపీఐకి డి.రాజా ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

నారాయణ సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉంది. మమతా బెనర్జీ టీఎంసీ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సభ్యులున్నా జాతీయ పార్టీ గుర్తింపును కాపాడుకునే స్థాయిలో లేరు.ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీతో పాటు పంజాబ్‌లో అధికారంలో ఉంది. గుజరాత్‌లో తక్కువ సీట్లు వచ్చినా ఓట్ షేర్ గణనీయంగా ఉండటంతో జాతీయ హోదా దక్కింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఆప్‌కు ఉనికి ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking