Take a fresh look at your lifestyle.

కేసీఆర్ కు ఏమైంది..?

0 2

కేసీఆర్ కు ఏమైంది..?
– కన్న కూతురు జైలులో..
– నామ్ కే వస్తే లోక్ సభ ఎన్నికల్లో పోటీ
(ఈదుల్ల మల్లయ్య)
ఔను.. మీరు చదివింది అక్షరాల నిజమే.. కేసీఆర్ మానసికంగా కుంగి పోతున్నాడు. లోక్ సభ ఎన్నికల గురించి ఆలోచన చేయలేక పోతున్నాడు. కారణం..? ముద్దుల కూతురు కవిత కళ్ల ముందే జైలు గోడల వెనక్కి వెళ్లడమే. పదేళ్ల పాలనలో కోట్లు ఆర్జించిన కేసీఆర్ ఫ్యామిలీ ఊహాలో కూడా కవిత జైలుకు వెళుతుందని ఊహించలేరు. ఢిల్లీ ఈడీ ఆఫీస్ లో విచారణ ఎదుర్కొంటున్న ఆమెను కోర్టు ద్వారా విడిపించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. కవితకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉండటంతో ఇప్పట్లో ఆమె జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు న్యాయనిపుణులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శల దాడి చేసిన బీఆర్ఎస్ పెద్దలు ఇప్పుడు కవిత అరెస్టు బిజీలోనే ఉన్నారు.
కవిత అరెస్టుకు పార్టీలో సైతం సానుభూతి లేదని మీడియా గొంతెత్తి అరుస్తుంటే ఇగో.. శుక్రవారం ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు… రాజ్యసభ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు.
మా కవితమ్మ ఆణిమూత్యంలా బయటకు వస్తుందని విలేకరుల ముందు విన్నవించుకున్నారు. అయితే.. ఈడీ కస్టడిలో ఉన్న కవిత బెయిల్ గురించి ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరంతరం ప్రయత్నిస్తున్నారు.

జోష్ తగ్గడానికి కారణం..?

అయితే.. మారిన రాజకీయ పరిణామాల మధ్య తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్‌కు ఏమైంది..? లోక్‌సభ ఎన్నికల వేళ నేతల్లో జోష్‌ ఎందుకు తగ్గింది..? అనే టాక్ సర్వత్ర వినిపిస్తోంది. 24 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న ఉద్యమ పార్టీ ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారింది. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలన చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ డబుల్‌ డిజిట్‌ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుస్తామని.. అందుకు తగ్గుట్లుగా వ్యూహాలు రచిస్తూ దూసుకెళ్తోంది. అయితే బీఆర్ఎస్‌ పార్టీలో మాత్రం ఆ జోష్‌ కనిపించట్లేదు. ఇప్పటివరకు 11 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించారు అధినేత కేసీఆర్.

కేసీఆర్ కు అన్నీ కష్టాలే..

క్షేత్రస్థాయి పరిస్థితుల కారణంగా ప్రచారంలో దూకుడు కనిపించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు, పోలీసులు ఎంత నిర్బంధం చేసిన ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపించిన కేసీఆర్‌కు ప్రస్తుతం ఎప్పుడూ లేని కష్టాలు ఎదురవుతున్నాయి. 2014లో అధికారంలోకి రాగానే కారు డోర్లు బార్లా తెరిచారు కేసీఆర్. కెపాసిటీకి మించి వరదలా వలసలు వచ్చి పార్టీలో చేరి పోయారు. ఇక 2018 ఎన్నికల తర్వాత రికార్డు మెజారిటీ సాధించిన మళ్లీ చేరికలను ప్రోత్సహించారు. కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఓడిన ప్రత్యర్థి, మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థి కూడా గులాబీ కండువాలు కప్పుకున్నారు. దీంతో తెలంగాణలో తిరుగులేని పార్టీ అంటూ ప్రచారం చేసుకుంది బీఆర్ఎస్. 2019 పార్లమెంటు సీట్లలో కూడా 9 స్థానాలను గెలుపొందింది. మరోవైపు జాతీయ పార్టీగా మారెందుకు వ్యూహాలను రచించుకుంది. ఏకంగా పార్టీ పేరును కూడా మార్చుకున్నారు కేసీఆర్.

సీన్ రివర్స్..

కానీ ఇప్పుడు సీన్ రివర్స్. మొన్నటివరకు ఓవర్ క్రౌడ్ తో ఉన్న కారు ఖాళీ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కొక్కరుగా కారు దిగి సైలెంట్‌గా వెళ్ళిపోతున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వదిలి వేయడం బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలోకి మారిపోయారు. ఇక ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌తో సహా, నలుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. వరుసగా ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకా పార్టీని వీడే నేతల సంఖ్య పెరుగుతుందని అంచనాలు ఉన్నాయట.

నిదుర లేకుండా చేస్తున్న కవిత కేసు

ఒకవైపు పార్టీ బలహీనపడుతుంటే మరోవైపు కవిత కేసుతో మరో తలనొప్పి మొదలైంది కేసీఆర్‌కు. ఢిల్లీ లిక్కర్ కేసులో పార్టీ నేత, కూతురు కవితను అరెస్ట్ చేయడం మరో దెబ్బ. ఇంకోవైపు రాష్ట్రంలో మాజీ మంత్రి మల్లారెడ్డితో సహా ఎమ్మెల్యేలు, పలువురు బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాలుగా దాడి చేస్తోంది. ఇది కూడా ఇబ్బందిగా మారిందట. గతంలో టికెట్ల కోసం పార్టీలో పొటాపోటీ ఉండేది. కానీ ఇప్పుడు టికెట్‌ ఇస్తామన్నా పోటీ చేసేందుకు నేతలు సిద్ధంగా లేరు. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కేంద్రం ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ కూడా విడుదల చేసింది. కానీ ఫీల్డ్‌లో మాత్రం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అభ్యర్థులు కూడా అంతగా ప్రచారంలో కనిపించట్లేదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking