రాజకీయాల్లో విలువలకు పాతర

రాజకీయాల్లో విలువలకు పాతర
– సిద్ధాంతాలు గాలికి…
– ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీలోకి వలసలు
– అప్రజాస్వామిక చర్యలను ప్రోత్సహిస్తున్న పార్టీలు

రాజకీయాల్లో నైతిక విలువలకు నాయకులు పూర్తిగా పాతరేస్తున్నారు. పదవులకోసం పాకులాడడం తప్ప సిద్ధాంతాలకు కట్టుబడిన నాయకులు కరువైపోయారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి నిస్సిగ్గుగా జంప్ చేస్తున్నారు. పార్టీలు సైతం ఇలాంటి అనైతిక, అప్రజాస్వామిక ఫిరాయింపులను ప్రోత్సహించడం విచారకరం. పార్టీలు సిద్ధాంతాలను పక్కన బెట్టాయి. పార్టీ ఫిరాయింపులు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువయ్యాయి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ వ్యవహార శైలిని విభేదించి చివర్లో కాంగ్రెస్ కు అనుకూలంగా మారారే తప్ప కండువా కప్పుకోలేదు. 2014 లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనైతికంగా పార్టీలో చేర్చుకోవడమేగాక ఏకంగా మంత్రి పదవులిచ్చింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగు దేశం పార్టీ తరఫున గెలుపొందిన వెంటనే బీఆర్ఎస్ లో చేరారు. ఆ వెంటనే ఆయనకు ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు. ఆ ఎన్నికల్లో తెలుగు దేశం తరఫున గెలుపొందిన 15 మందిలో ఒక్కరు మినహా అందరూ పార్టీ మారారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారిన వారే కావడం గమనార్హం. 2018 లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారి మంత్రి అయ్యారు.

ప్రస్తుతం కాంగ్రెస్ లోకి…

బెల్లం ఉన్న చోట ఈగలు వాలుతాయన్న చందంగా నాయకులు అధికార పార్టీలో చేరడం ఆనవాయితీగా మారింది. పార్టీ మారితే ప్రజల్లో చులకన అవుతామనే భావన కూడా లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నించిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి పిలిచి మంత్రి పదవి ఇవ్వడంతో బీఆర్ఎస్ లోనే కొనసాగారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువగానే సతీ సమేతంగా ముఖ్యమంత్రిని కలిశారు. త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకున్నా, పార్టీ కోసం పనిచేయకున్నా వెంకటేష్ నేతకు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇవ్వగా గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కండువా మార్చేశారు. రాజయ్య, బొంతు రామ్మోహన్, బాబా ఫసియొద్దిన్, శ్రీలతా రెడ్డి, తీగల అనితా రెడ్డి, పట్నం సునీతా రెడ్డి లకు బీఆర్ఎస్ అవకాశాలు ఇచ్చింది. వీరంతా పార్టీ మారడానికి సిద్ధమయ్యారు. వీరే గాకుండా రంజిత్ రెడ్డి, రాములు, మర్రి జనార్ధన్ రెడ్డి తదితరులు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది.

నీతులు వల్లిస్తున్న నేతలు

నిస్సిగ్గుగా విలువలకు పాతరేసిన నేతలు ప్రస్తుతం నీతులు చెబుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని మోసం చేసి వెళ్లిపోయి, మళ్లీ అదే పార్టీ లో టికెట్ సాధించడం విస్మయం కలిగిస్తోంది. 2018 లో మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన రాజగోపాల్ రెడ్డి పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో ఆయన బీజేపీ నుంచి పోటీ చేయగా, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో డిపాజిట్ కోల్పోయింది. ఆ సమయంలో కాంగ్రెస్ మీద రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని డ్యామేజీ చేసిన నాయకుడిని మళ్లీ పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పార్టీ ప్రభంజనంలో ఆయన గెలుపొంది ప్రస్తుతం అసెంబ్లీలో నీతి మాటలు మాట్లాడుతున్నారు.

– వయ్యామ్మెస్ ఉదయశ్రీ

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!