Take a fresh look at your lifestyle.

కవిత అరెస్టు తప్పదా..?

0 17

కవిత అరెస్టు తప్పదా..?
– లిక్కర్ స్కాం విచారణలో వేగం పెంచిన దర్యాప్తు సంస్థలు
– దిద్దుబాటు చర్యలు చేపట్టిన బీజేపీ
దిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి దర్యాప్తు సంస్థలు విచారణలో వేగం పెంచిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత అరెస్టు అవుతుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 26 న తమ ముందు హాజరు కావాలని సీబీఐ కవిత కు నోటీసులు జారీ చేసింది. ఒకే నెలలో కవిత కు ఈడీ, సీబీఐ నోటీసులు జారీ చేయడం, మరోవైపు ఇదే కేసులో ఈడీ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈనెల 26నే తమ ముందు హాజరు కావాలని నోటీసు జారీ చేయడంతో ఎన్నికల ముందు అరెస్టులు తప్పవన్న అనుమానులు వ్యక్తమవుతున్నాయి. కేజ్రీవాల్ కు ఇప్పటి వరకు ఆరు సార్లు నోటీసులు జారీ చేసినా హాజరు కాలేదు. మహిళను ఈడీ కార్యాలయానికి పిలువొద్దని, ఇంట్లోనే విచారించాలని సుప్రీం కోర్టులో గతేడాది పిటిషన్ దాఖలు చేయగా, విచారణలో ఉంది. దీంతో ఆమె ఈడీ నోటీసుకు హాజరు కాలేదు.ప్రస్తుతం కూడా సీబీఐ ముందు హాజరయ్యేందుకు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. 2022 డిసెంబర్ 11 న సీబీఐ అధికారులు హైదరాబాద్ లోని కవిత ఇంట్లోనే ఏడు గంటల పాటు విచారించారు. ఈడీ గతేడాది మార్చిలో మూడు సార్లు దిల్లీలోని ప్రధాన కార్యాలయంలో విచారించింది. ఈ సమయంలో కవితను అరెస్టు చేస్తారనే ప్రచారం బాగా జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీస్ సిసోడియా, మాగుంట రాఘవ, బుచ్చిబాబు, శరత్ చంద్రా రెడ్డి, రాంచంద్రన్ పిళ్లై, బోయిన్ పల్లి అభిషేక్ లను అరెస్టు చేశారు.
ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు
లిక్కర్ స్కాంలో నిందితులుగా ఉన్న వారందరిని అరెస్టు చేయగా, కవితను అరెస్టు చేయకపోవడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. వాస్తవానికి అప్పటికే కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ప్రజల్లో వ్యతిరేక భావం ఉంది. దిల్లి లిక్కర్ దందాలో ఇరుక్కుని తెలంగాణ మహిళల గౌరవానికి భంగం కలిగించారని, ఆమె అరెస్టు కావాలని ప్రజలు కోరుకున్నారు. కానీ ఆమె అరెస్టు కాకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని భావించారు. అప్పటి వరకు బీజేపీకి అనుకూల పరిస్థితి ఉండేది. కవితను అరెస్టు చేయకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక గాలి కాంగ్రెస్ వైపు మళ్లింది. అప్పటి వరకు రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమనుకున్న బీజేపీ డీలా పడిపోయింది. ఈ విషయాన్ని బీజేపీ ఆలస్యంగా గుర్తించింది. ప్రధాని మోదీ అంతర్గత చర్చలను బయట పెట్టినా ప్రజలు కాంగ్రెస్ కే జై కొట్టారు.
దిద్దుబాటు చర్యలు
అసెంబ్లీ ఎన్నికలలో నష్టం జరిగినందున బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ముందు దిద్దుబాటుకు ఉపక్రమించింది. దర్యాప్తు సంస్థలు విచారణలో వేగం పెంచి మిగతా వారిపై చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదని, వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండబోదని చాటి చెప్పినట్లవుతుంది. అంతేగాక పార్లమెంట్ ఎన్నికల సర్వేలలో కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు వస్తాయని, బీజేపీకి మూడు, నాలుగు స్థానాలే వస్తాయని తేలుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ను దెబ్బ కొడితే కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు సాధించవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీకి ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ తో అవగాహన ఉందన్న ప్రచారంతో నష్టం జరుగుతోందన్న విషయం గుర్తించారు. అగ్రనాయకుల సూచనమేరకే రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ తో పొత్తు ఉండబోదని స్పష్టం చేస్తున్నారు. కవిత అరెస్టు అయితే బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని తేలిపోతుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking