సగం మంది ఫ్రీ గ్యాస్ కు దూరం

సగం మంది ఫ్రీ గ్యాస్ కు దూరం
– మరో రెండు గ్యారంటీల అమలు కు జీవో జారీ

తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌.. మరో రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టింది. మంగళవారం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకే సబ్సిడీ సిలిండర్‌ అందించే పథకాలకు జీవో జారీచేసింది. అభయహస్తం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం వాటి ఆధారంగానే కొత్త గ్యారంటీలు అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులో రేషన్‌ కార్డుదారులకు మాత్రమే సబ్సిడీ గ్యాస్, ఉచిత విద్యుత్‌ పథకం వర్తిస్తుంది. రాష్ట్రంలో 90 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 40 లక్షల మంది మాత్రమే సబ్సిడీ గ్యాస్, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగతా వారు దరఖాస్తు చేసుకోలేదు.

దీంతో వీరంతా ప్రస్తుతం సబ్సిడీకి దూరం కానున్నారు. కొందరు దరఖాస్తుల్లో సబ్సిడీ విద్యుత్, గ్యాస్‌ ఆప్షన్‌ ఎంచుకోలేదు. ఈ కారణంగా కూడా దరఖాస్తు చేసుకున్నవారిలో కూడా 5 లక్షల మంది అర్హత కోల్పోయారని సమాచారంఆరు గ్యాంరటీల్లో ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యాంరటీలను అమలు చేస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఈ పథకాలను రేషన్‌ కార్డు ఉన్నవారికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌ కార్డు లేనివారు కూడా అభయహస్తంలో దరఖాస్తు చేసుకున్నారు. కానీ, రేషన్‌ కార్డుదారులను మాత్రమే అర్హులుగా గుర్తించారు.రేషన్ కార్డులు లేని వారు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఇటీవల ప్రజాపాలనలో రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించలేదు.

అయినప్పటికీ సుమారు 20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులు ఇవ్వకుండా గ్యారంటీ పథకాలు అమలు చేయడం పట్ల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా మొదటి విడత అభయహస్తం దరఖాస్తులు వారం రోజులు స్వీకరించారు. ఆ సమయంలో చాలా మంది వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేదు. ఈ కారణంగా 50 లక్షల రేషన్‌కార్డుదారులు రూ.500 సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు దూరం అవుతున్నారు. అయితే రెండో విడత కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని, అభయహస్తం నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. దీంతో రెండో విడత ఎప్పుడు ప్రారంభిస్తారో అని మొదటి విడత దరఖాస్తు చేసుకోనివారు నిరీక్షిస్తున్నారు. త్వరగా దరఖాస్తులు స్వీకరించాలని కోరుతున్నారు. రేషన్ కార్డు లేని వారికి కార్డులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!