Take a fresh look at your lifestyle.

వలస నేతలకు పెద్దపీట

0 16

వలస నేతలకు పెద్దపీట
– కాంగ్రెస్ టికెట్లపై అసంతృప్తి
– 14మందిలో సగం కొత్తవారే
– రెండు నియోజకవర్గాలపై పునరాలోచన ?
– దానం నాగేందర్ ను మార్చే అవకాశం

(ఎం. హన్మంత్ రెడ్డి, జర్నలిస్టు )
పార్లమెంట్ టికెట్ ల కేటాయింపు కాంగ్రెస్ వాదులను ఆశ్యర్యానికి గురి చేస్తోంది. వలస వాదులకు పెద్దపీట వేయడంపై లోలోన అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వారిని పక్కనబెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీకి పని చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా సగం సీట్లు వారికే కేటాయించడమేమిటని అంటున్నారు. 10 ఏళ్లు అధికారం లేక నరకం అనుభవించామని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల వారికి పిలిచి టికెట్లు ఇవ్వడమేమిటని వాపోతున్నారు. పార్టీలో ఉన్న వారిని అనుమానించడమేనని అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ప్రకటించిన స్థానాల్లో సగం మంది వలస వాదులే ఉన్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, భువనగిరి, నల్గొండ, నిజామాబాద్, మహబూబాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల టికెట్లు కాంగ్రెస్ పార్టీ నేతలకు దక్కాయి. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, మెదక్, పెద్దపల్లి, వరంగల్ టికెట్లు వలస వాదులకు ఇచ్చారు. ఆదిలాబాద్ టికెట్ ఏ పార్టీకి సంబంధం లేని ఆత్రం సుగుణ కు కేటాయించారు.

జగ్గారెడ్డికి నిరాశ

మెదక్ టికెట్ ను జగ్గారెడ్డి తన భార్య నిర్మలకు కేటాయించాలని కోరినప్పటికీ కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరి పటాన్ చెరు టికెట్ ఆశించారు. మొదట టికెట్ ఇచ్చి ఆ తర్వాత మార్చారు. దీంతో ఆయన బీఎస్పీ నుంచి పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ మారినప్పటికీ ప్రస్తుతం పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. పెద్దపల్లి టికెట్ ఇస్తామని సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత ను చేర్చుకున్నారు. ఆ తర్వాత వంశీకృష్ణ కు కేటాయించారు. వరంగల్ టికెట్ ఇస్తామని సిట్టింగ్ ఎంపీ దయాకర్ ను చేర్చుకుని మొండి చెయ్యి ఇచ్చారు. బొంతు రామ్మోహన్ కు సికింద్రాబాద్ టికెట్ ఇస్తామని, ఆ తర్వాత ఇవ్వలేదు. టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత మొండి చెయ్యి చూపితే మోసం చేసినట్లు అవుతుందని అంటున్నారు.

రెండు నియోజకవర్గాలలో పునరాలోచన ?

మొదట టికెట్లు ప్రకటించినప్పటికీ స్థానిక నాయకుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తో పాటు ఇతర కారణాల వల్ల రెండు నియోజకవర్గాలలో అభ్యర్థుల విషయమై కాంగ్రెస్ అధిష్ఠానం పునరాలోచిస్తోందని తెలిసింది. మెదక్ అభ్యర్థి నీలం మధు ఆర్థికస్థోమతపై ఆరా తీస్తున్నారు. సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ ను మార్చుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, ఎంపీ టికెట్ ఇస్తామని అధిష్ఠానం ముందుగానే చెప్పినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. బీజేపీ అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తే ఆ రాష్ట్రాలలో బీజేపీ చర్యను తప్పుపట్టలేమని అధిష్ఠానం భావిస్తోంది. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుంటే బొంతు రామ్మోహన్ లేదా మరో అభ్యర్థిని పోటీకి దింపే అవకాశముందని తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking