కాంగ్రెస్ కసరత్తు
– భారీగా ఆశావహులు
– ఎవరికి వారు ప్రయత్నాలు
– హైదరాబాద్ కు ఏఐసీసీ నేతలు
– మహబూబ్ నగర్ టికెట్ పై చర్చ
నిర్దేశం, హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే సర్వేలు చేయించి, గెలుపు గుర్రాలకు టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదివరకే మహబూబ్ నగర్ టికెట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించగా, మిగతా నియోజకవర్గాలకు కూడా టికెట్ లు ఖరారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలతో భేటీ అయి టికెట్ ల విషయమై చర్చించనున్నారు. కాంగ్రెస్ లో టికెట్ ల ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నారు. ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దిల్లీ వెళ్లి నాయకులను కలుస్తున్నారు.
ఎంపీ టికెట్ కోసం పదవికి రాజీనామా
నాగర్ కర్నూల్ టికెట్ కోసం మల్లు రవి దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ఈ పదవి తన టికెట్ కు అడ్డంకి అవుతందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నాగర్ కర్నూల్ టికెట్ కోసం ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ దిల్లీ స్థాయిలో తనకున్న సంబంధాలతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎంపీ మంద జగన్నాథ్ కూడా ఆశిస్తున్నారు. ఖమ్మం టికెట్ కోసం అత్యధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన రేణుకా చౌదరికి రాజ్యసభ ఇవ్వడంతో ఇతరులకు అవకాశం దక్కనుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని తో పాటు మరికొందరు టికెట్ ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ ఇచ్చినందున అంజన్ కుమార్ కు ఇవ్వడం అనుమానమే. మెదక్ టికెట్ ను మైనంపల్లి హనుమంత రావు, జగ్గారెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన నీలం మధు ఆశిస్తున్నారు. నల్గొండ టికెట్ ను జానారెడ్డి, రమేష్ రెడ్డి పోటీ పడుతున్నారు. చేవెళ్ల టికెట్ సునీతా రెడ్డి కి దాదాపు ఖరారైంది.
మహబూబ్ నగర్ టికెట్ పై చర్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందస్తుగా మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి పేరు ప్రకటించడం చర్చనీయాంశమైంది. మహబూబ్ నగర్ టికిట్ ఆశించి మన్నె జీవన్ రెడ్డి పార్టీలో చేరారు. వంశీచంద్ పేరు ప్రకటించడంతో జీవన్ రెడ్డి నిరాశకు గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే వంశీచంద్ కు ఎంపీ టికెట్ హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినందునే ప్రకటించారా..? లేక దిల్లీ పెద్దలతో చర్చించి ప్రకటించారా అనే విషయమై రకరకాల చర్చ జరుగుతోంది. కొందరు ముందుగా ఎలా ప్రకటిస్తారని అంటుంటే, మరికొందరు రేవంత్ కు ఫ్రీహాండ్ ఇచ్చారంటున్నారు.