నా బూతే.. నా భవిష్యత్ = తెలంగాణ రాజకీయం

బూతులు లేకుండా రాజాసింగ్ ప్రసంగం చేయలేరేమో. బూతు మాటల్లో బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ లీడర్లు ఉన్నారు. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది

0

నిర్దేశం: రాజకీయాల్లో రెండు రకాల బూతులు ఉంటాయి. ఒకటి ఓటు వేసే పోలింగ్ బూత్, రెండోది విపక్ష నేతలను దూషించే బూత్. ప్రతి బూతుకి నాయకుడు ఉన్నట్టే. ప్రతి పార్టీకి బూతు నాయకుడు ఉంటారు. అయితే, ఈ రెండింటిలో ఏది ఎక్కువ, ఏది తక్కువ అంటే చెప్పడం కష్టం. ఈ రెండు బూతులు.. నాయకులకు రెండు కళ్లలాంటివి. అందుకే వీటిని కంటికి రెప్పలా చూసుకుంటారు.

ఇక తెలంగాణ రాజకీయంలో బూతు నాయకులకు తక్కువేం లేదు. చిత్రంగా ఆ నాయకులే కొన్ని పార్టీలకు అధినేతలుగా ఉన్నారు. రంగు, కులంతో పాటు కొన్ని బయటికి చెప్పలేని మాటలు వాడుతుంటారు. అందులో ల..కారాలతో పాటు మంటపుట్టించే అన్ని కారాలు ఉంటాయి. లంగలు, లఫంగులు అని కేసీఆర్ సర్వసాధారణంగా వాడుతుంటారు. అసెంబ్లీనా, మీడియా సమావేశమా అనేది అస్సలు పట్టించుకోరు. సీతయ్య ఎవరి మాటా వినడు అన్నట్లు దూసుకుపోతూనే ఉంటారు. నిండు అసెంబ్లీలో ‘‘ప్రిపేర్ అయి రాకపోతే, పీకనీకి వచ్చారా?’’ అనే మాట ఇప్పటికీ న భూతో న భవిష్యతి.

ఏ విషయంలోనైనా కేసీఆర్ తో పోటీ పడే రేవంత్ రెడ్డి.. బూతు మాటల్లో కూడా గట్టి పోటీనే ఇస్తారు. ఆయనకు తిక్క రేగిందా.. ఎదురుగా ఎవరున్నారనేది పట్టించుకోరు. ముడ్డీపగలకొడతా ముండా కొడుకా అనేస్తారు. బూతులే కాదు, వివాదపు మాటల్లో కూడా రేవంత్ దిట్టే. పేగులు తీస్తాం, బాంబులు వేస్తాం అని ఆమధ్య రేవంత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. హరీష్ రావును గాడిద పెరిగినట్టు పెరిగాడని తరుచూ అంటుంటారు రేవంత్. ఇక, అసెంబ్లీ ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డిని ‘ఒరెయ్ బామ్మర్ది’ అని మల్లా రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు కానీ, అది చిన్నమాటేం కాదు.

కౌశిక్ రెడ్డి-అరికెపూడి గాంధీ కాంట్రవర్సీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ సందర్భంలో ఇరు పార్టీల మధ్య దొర్లిన మాటలు, చేతలు నిజానికి నిజంగా నా బూతే నా భవిష్యత్ అన్నట్టుగా ఉన్నాయి. వ్యక్తిగతమైన కోపం పక్కన పెడితే.. ఇరు పార్టీల నుంచి మెప్పు పొందేందుకు నాయకులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చీరలు, గాజులు పంపడం, ల..కారాలతో తిట్టుకోవడం, అనుచరులతో వెళ్లి అటాక్ చేయడం.. రాంగోపాల్ వర్మ కమర్షియల్ సినిమాను తలపించింది.

రాజాసింగ్ అయితే మరీనూ.. బయటికి చెప్పలేని అసభ్యకరమైన మాటలు ప్రయోగిస్తుంటారు. ఆయన తెలుగు ప్రసంగాల్లో పెద్దగా కనిపించవు కానీ, హిందీ ప్రసంగాల్లో కుప్పలు తెప్పలు. అసలు బూతులు లేకుండా రాజాసింగ్ ప్రసంగం చేయలేరంటేనే కరెక్ట్. బూతు మాటల్లో బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ లీడర్లు ఉన్నారు. వీరికి జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు ఉంది. అందులో రాజాసింగ్ కూడా ఉండడం, తెలంగాణ బీజేపీకి గర్వకారణమనే చెప్పాలి. ఇక, వివాదాస్పదంగా మాట్లాడే బండి సంజయ్ కూడా అప్పుడప్పుడు ఆణిముత్యాలు వదులుతుంటారు. ఎంత కాదనుకున్నా.. అవీ బూతులకేం తక్కువ కాదు.

ఎదుటి వారిని బద్నాం చేయడానికి కొందరు, అగ్ర నేత మెప్పుపొందడానికి కొందరు, తప్పించుకోవడానికి కొందరు, తెప్ప తగలేయడానికి కొందరు.. ఇలా రాజకీయాల్లో బూతులు సర్వసాధారణమయ్యాయి. ప్రజలు కూడా వీటికి అలవాటు పడిపోయారు. నేతలు బూతులు మాట్లాడినప్పుడు.. తిట్టడానికి బదులు.. తమకు నచ్చని నాయకుడిని భలే అన్నారని సంబరపడిపోతున్నారు. అందుకే నాయకులకు ఈ మాటలు అనడం మరింత సులువైంది.

– టోనీ బెక్కల్

Leave A Reply

Your email address will not be published.

Breaking
Advertisements